ఐదేళ్లలో 50 లక్షల కొత్త ఉద్యోగాలు
ప్రైవేట్ సెక్యూరిటీ రంగంలో అపార అవకాశాలు: సీఏపీఎస్ఐ-క్యాప్సి
న్యూఢిల్లీ: భారత్లో 2020 కల్లా ప్రైవేట్ సెక్యూరిటీ రంగంలో 50 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయి. సెక్యూరిటీ గార్డులకు డిమాండ్ పెరుగుతుండటంతో ఈ స్థాయి ఉద్యోగాలు వస్తాయని ది సెంట్రల్ అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీ(సీఏపీఎస్ఐ-క్యాప్సి) అంచనా వేస్తోంది. ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసులందజేసే కంపెనీల అత్యున్నత సంఘమైన క్యాప్సి చైర్మన్ కున్వర్ విక్రమ్ సింగ్ వెల్లడించిన వివరాలు..,
* కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీలు, మౌలిక రంగ అభివృద్ధి ప్రాజెక్టులు, రహదారులు, విమానశ్రయాలు, ఓడరేవులపై ప్రధానంగా దృష్టిసారిస్తోంది. ఫలితంగా ఐదేళ్లలో భారీ స్థాయిలో సెక్యూరిటీ గార్డులు అవసరం అవుతారు.
* ప్రస్తుతం 15 వేల సెక్యూరిటీ సర్వీసుల కంపెనీలు భారత్లోని 600 జిల్లాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 70 లక్షలకు పైగా పురుష, మహిళ సెక్యూరిటీ గార్డులు పనిచేస్తున్నారు.
* సెక్యూరిటీ గార్డుల కోసం వ్యక్తులను వెదకడం, ఆ వ్యక్తులను అదే ఉద్యోగంలో కొనసాగించడం... ఈ రెండు అంశాలు ప్రైవేట్ సెక్యూరిటీ పరిశ్రమలో అతి పెద్ద సమస్యలు. ప్రత్యామ్నాయ ఉద్యోగ అవకాశాలు పెరుగుతుండడమే దీనికి ప్రధాన కారణం.
* ఈ రంగంలో డిమాండ్-సరఫరాల మధ్య అంతరం 30 శాతంగా ఉంది.
* ప్రైవేట్ సెక్యూరిటీ రంగంలో ఉద్యోగవకాశాలపై గిరిజన ప్రాంతాల్లో క్యాప్సి, సెక్యూరిటీ సెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్లు దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నాయి.