‘ప్రైవేటు టెలికాం’కు జీఎస్టీ ఎఫెక్ట్
- సిమ్ కార్డులు, రీచార్జ్ కార్డుల సరఫరా తాత్కాలికంగా నిలిపివేత
- జూలై 4 నుంచి పునరుద్ధరణ
సాక్షి, అమరావతి బ్యూరో: జీఎస్టీ దెబ్బకు ప్రైవేటు టెలికం కంపెనీలు తమ సిమ్ కార్డులు, రీచార్జి కార్డుల జారీని తాత్కాలికంగా నిలిపివేశాయి. మార్కెట్లోని తమ ఫ్రాంచైజీలు, ఏజెన్సీలకు కొన్ని రోజులుగా వాటిని సరఫరా చేయడం లేదు. జీఎస్టీలో సిమ్ కార్డులు, రీచార్జ్ కార్డులపై పన్ను రేటు పెరగనుంది. ప్రస్తుతం వాటిపై 15 శాతం పన్ను ఉండగా, జీఎస్టీలో పన్ను రేటును 18 శాతానికి పెంచారు. ఈ మేరకు టెలికం సంస్థలు తమ సిమ్‌కార్డులు, రీచార్జ్ కార్డుల రేట్లు, ఇతరత్రా రికార్డుల్లో మార్పులు చేయాల్సి ఉంది. ఇందుకోసం సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలి. దీనికి సంబంధించి ప్రైవేటు టెలికం సంస్థలు వారం రోజులుగా కసరత్తు చేపట్టాయి.
అయితే, జూలై ఒకటో తేదీ నాటికి కూడా సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేయడం సాధ్యమయ్యేలా లేదు. జూలై 3వ తేదీ నాటికి సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేయగలమని కంపెనీలు భావిస్తున్నాయి. దీంతో అప్పటి వరకు ఏజెన్సీలకు సిమ్ కార్డులు, రీచార్జ్ కార్డులను సరఫరా చేయకూడదని అనధికారికంగా నిర్ణయించాయి. జూలై 4వ తేదీ నుంచి మళ్లీ సరఫరాను పునరుద్ధరించాలని భావిస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్కు మాత్రం వ్యవస్థాగత సామర్థ్యం ఎక్కువగా ఉండటంతో తమ సాఫ్ట్‌వేర్‌ను కొన్నిరోజుల క్రితమే అప్డేట్ చేసింది. ఏజెన్సీలకు యథాతథంగా సిమ్‌కార్డులు, రీచార్జ్ కార్డుల సరఫరాను కొనసాగిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ మార్కెటింగ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.