హే..కృష్ణా!
‘కృష్ణా డెల్టా ఆయకట్టుకు జూలై 16వ తేదీ నాటికి నీరందిస్తాం. ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా చూసే బాధ్యత మాది’ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జిల్లా అధికారులు, ప్రభుత్వ పెద్దలు పదేపదే చెప్పిన మాటలివి. జూలై 16 కాదుకదా.. ఆగస్టు 16 దాటిపోయినా దెందులూరు, ఏలూరు నియోజకవర్గాల్లోని కృష్ణా ఆయకట్టుకు నీరు మాత్రం రాలేదు. నారుమడులు ఎండిపోతుండగా.. రైతులు నాట్లు వేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉండిపోయారు.
సాక్షి ప్రతినిధి, ఏలూరు : కృష్ణా కాలువ పరిధిలో జిల్లాలోని పెదపాడు, ఏలూరు, దెందులూరు మండలాల్లో 58 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనికి ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా కెనాల్ ద్వారా నీరు అందించాల్సి ఉంది. చుక్క నీరు కూడా రాకపోవడంతో చాటపర్రు, పాలగూడెం, కొమడవోలు, జాలిపూడి, కాట్లం పూడి, మాదేపల్లి, లింగారావుగూడెం, పోణంగి తదితర గ్రామాల్లో 12 వేల ఎకరాల్లో వేసిన నారుమళ్లు ఎండిపోతున్నాయి. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను తరలించి జూలై 16వ తేదీ నాటికి కృష్ణా డెల్టాకు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇప్పటివరకూ పట్టిసీమ నుంచి పూర్తి సామర్థ్యంతో నీటిని తీసుకువెళ్లింది లేదు. 4,200 క్యూసెక్కుల నీటి ప్రవాహానికే కృష్ణా జిల్లా రామిలేరు వద్ద పోలవరం ప్రాజెక్ట్ కుడి కాలువకు గండిపడింది. దీంతో నీటి తరలింపును నిలిపివేశారు. తాజాగా ఒకటి రెండు మోటార్ల ద్వారా నీటిని తరలిస్తున్నారు. కృష్ణా డెల్టాకు 15 వేల క్యూసెక్కుల నీరివ్వాల్సి ఉండగా, ప్రస్తుతం పట్టిసీమ ద్వారా వెళ్లిన ఆరు టీఎంసీల నీరు ఏ మాత్రం సరిపోలేదు. మరోవైపు కృష్ణా పుష్కరాల నేపథ్యంలో అక్కడి నదిలో నీటిమట్టం ఉండేలా చూసేందుకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీని నమ్ముకుని పంటలు వేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
గోదావరి జలాలూ ఇచ్చింది లేదు.. పోణంగిపుంత పథకం పనులు పూర్తి కాకపోవడం వల్ల గోదావరి నీరు కూడా తరలించే అవకాశం లేకుండా పోయింది. దీంతో చేలు బీడువారి నారుమళ్లు, నాట్లు ఎండుతున్నాయి. ఇప్పటికే సాగు చేపట్టిన రైతులు పూర్తిగా నష్టపోతుండగా, మిగిలిన రైతులు నాట్లు వేయాలా వద్దే ఆనే మీమాంసలో ఉన్నారు. ఇప్పటికే అదును దాటిపోయింది. ఈ నెలలో నాట్లు వేస్తే పంట కోతకు వచ్చే సమయంలో వాయుగుండం, అల్పపీడనాలు ముంచుకొచ్చే ప్రమాదం ఉంది.
కస్సుబుస్సులాడిన ఎమ్మెల్యే
రెండు రోజుల క్రితం పంట బోదెల ద్వారా కొంతమేర నీరు వచ్చినా.. మోటార్లతో తోడుకుంటేగాని చేలకు అందని పరిస్థితి. వంతులవారీగా నీరు తోడుకునే విషయంలో రైతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఎగువ రైతులు పూర్తిగా వాడుకున్న తర్వాత గాని దిగువకు నీరి వ్వడానికి అంగీకరించడం లేదు. నీటి విషయం అడిగితే దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ ఎవరినడిగి పంటలు వేశారంటూ కస్సుబుస్సులాడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అపరాలు వేసే పరిస్థితి కూడా లేదు. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియని స్థితిలో అపరాలు వేసినా నష్టపోవాల్సి వస్తుందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఖరీఫ్, రబీ పంటలు రెండూ వేయలేకపోయారు. ఫలితంగా ఆ ప్రాంతంలోని 14 వేల మంది కౌలు రైతులు, 20 వేల మంది వ్యవసాయ కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఈ ఏడాది ఖరీఫ్‌పై ఆశలు పెట్టుకున్నా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతో సాగు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
రైతుల నుంచి సొమ్ము వసూలు
ఏలూరు మండలంలోని కొద్దిపాటి ఆయకట్టును కాపాడుకునే అవకాశం ఉన్న తూర్పు లాకుల నుంచి గోదావరి నీటిని మోటార్ల సాయంతో తోడి కాలువలోకి పంపిస్తున్నారు. గత ఏడాది ప్రభుత్వ ఖర్చుతో నీటిని తోడగా, ఈ ఏడాది కూడా అదే పని చేస్తున్నారు. అయితే, దొడ్డిదారిన రైతుల నుంచి సొమ్ము వసూలు చేస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి ఎకరాకు రూ.500 చొప్పున తీసుకుంటున్నారు. అయినా, ఆ నీరు వరి పంటకు కాకుండా చేపల చెరువులకు మళ్లిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.