హెచ్సీయూ అక్రమ కేసులు ఎత్తేయాలి
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, రోహిత్ వేముల కేసులో పోలీసుల నిర్లక్ష్య వైఖరికి సంబంధించి చర్యలు తీసుకోవాలని తెలంగాణలోని ప్రజాస్వామిక వాదులు, మేధావులు తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 'హెచ్సీయూ కుల వివక్షకు, కుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడుతూ ఒక కేంద్ర బిందువుగా మారిందని అందరికీ తెలుసు. అయితే దురదృష్టవశాత్తూ ఇటీవల కాలంలో ఈ వర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో హెచ్సీయూలో స్వేచ్ఛాయుత, ప్రజాస్వామిక, అకాడమిక్ వాతావరణాన్ని నెలకొల్పాలి' అని ఓ ప్రతికా ప్రకటనలో ప్రొఫెసర్ జి.హరగోపాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
అనేక మంది విద్యార్థులపైనా, అధ్యాపకులపైనా తప్పుడు కేసులు నమోదయ్యాయి. ఈ అక్రమ కేసులున్న విద్యార్థులందరూ దళిత, మైనారిటీ, సామాజికంగా వెనకబడిన కుటుంబాల నుంచి వచ్చిన వారే. ఈ కుటుంబాలకు ఈ విద్యార్థుల ఉపాధి, ఆదాయాలే జీవనాధారంగా ఉన్నాయి. కనుక విద్యార్థులు, అధ్యాపకుల మీద ఉన్న కేసులను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ కొందరు మేధావులు సంతకాల సేకరణ చేశారు.
జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ రోహిత్ వేముల దళితుడేనని, మాల కులానికి చెందినవాడనీ, కలెక్టర్ ఇచ్చిన నివేదికల మీద ఆధారపడి నిర్ధారించింది. అంతే కాకుండా పోలీసులు ఈ కేసు విచారణను వేగవంతం చేయాలని ఆదేశించింది. అయినా ఇంతవరకూ ఆ విచారణ ముందుకు సాగలేదు. కావున తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని గౌరవించి, తన రాజ్యాంగ బద్ధమైన బాధ్యతను నిర్వర్తించి న్యాయం చేయాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.
విశ్వవిద్యాలయం సమాజంలో జరుగుతున్న మార్పులను ప్రజాస్వామిక పోరాటాలను విశ్లేశించి మద్ధతునిస్తుంది. కానీ రోహిత్ వేముల సంస్థాగత హత్య తర్వాత యూనివర్సిటీలో నిరంకుశమైన సర్క్యూలర్ ద్వారా సభలు, సమావేశాలు జరగకుండా చూస్తున్నారు. బహుశా దేశంలోనే మీడియాను, ప్రజా ప్రతినిధులను కూడా లోపలికి అనుమతించని వర్సిటీగా హెచ్సీయూ తయారైందంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుని వర్సిటీలో స్వేచ్ఛాయుత, వివక్షా రహిత, ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పడానికి కృషి చేయాలని కోరారు.