ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణకు కమిటీలు
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏర్పాటు
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీటి కల్పనపై విద్యాశాఖ దృష్టి సారించింది. ఈ పనుల పర్యవేక్షణకు గ్రామస్థాయి వరకూ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామస్థాయిలో సర్పంచ్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. ఎంపీటీసీ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సహా పలు సంఘాలకు చెందిన వారు కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ పాఠశాలల్లోని తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ తదితర సదుపాయాలపై మండల కమిటీకి సమాచారం ఇవ్వాలి. దీంతోపాటు ప్రతినెలా నివేదిక సమర్పించాలి. అలాగే మండల స్థాయిలోని కమిటీ.. గ్రామాల నుంచి వచ్చిన సమస్యలపై 15 రోజులకోసారి సమీక్షించాలి. ఈ కమిటీకి ఎంపీపీ చైర్‌పర్సన్‌గా, జెడ్పీటీసీ, ఎంఈఓ, ఎంపీడీఓ, ఏఈ సభ్యులుగా ఉంటారు.
జిల్లా స్థాయి కమిటీ కి చైర్మన్‌గా జిల్లా పరిషత్తు చైర్మన్ వ్యవహరిస్తారు. కోచైర్పర్సన్గా జిల్లా కలెక్టర్, కన్వీనర్‌గా డీఈఓ ఉంటారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్ఈ, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ, ఎస్ఎస్ఏ ఈఈ, జెడ్పీ సీఈవో, డీఎంహెచ్‌వో, మహిళ శిశు సంక్షేమ శాఖ పీడీ, సివిల్‌సొసైటీ నుంచి ఇద్దరు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ పాఠశాల పారిశుధ్యంపై జిల్లా వార్షిక ప్రణాళిక రూపొందించాలి. సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర ్యలు చేపట్టాలి. మూడు నెలలకోసారి సమీక్ష నిర్వహించాలి. అలాగే రాష్ట్ర స్థాయిలోని కమిటీకి విద్యాశాఖ మంత్రి చైర్మన్‌గా, ముఖ్యకార్యదర్శి వైస్ చైర్మన్‌గా, పాఠశాల విద్యా డెరైక్టర్ కన్వీనర్‌గా ఉంటారు. ఈ కమిటీ 6 నెలలకు ఒకసారి సమావేశమై వార్షిక ప్రణాళికను రూపొందించి అమలు చేయాలి.