బ్యాంకుల మూసివేతపై క్లారిటీ
న్యూడిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు త్వరలో మూత పడనున్నాయన్న కథనాలు ఆందోళన నేపథ్యంలో ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంక్ స్పందించాయి. గతరెండు వారాలుగా సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలలో చక్కర్లు కొడుతున్న వదంతులపై వివరణ ఇచ్చాయి. ఈ మెసేజ్‌లన్నీ నిరాధారమైనవనీ, సత్యదూరాలని కొట్టి పారేశాయి. ఖాతాదారుల డిపాజిట్ సొమ్ము సురక్షితంగా ఉంటాయని హామీ ఇచ్చాయి. ఈ పుకార్ల పట్ల ప్రతి ఒక్కరూ విజ్ఞతగా ఉండాలని సూచించారు.
తొమ్మిది ప్రభుత్వరంగ బ్యాంకుల మూత వేత అనే అంశం హాస్యాస్పదంగా ఉందని, ఇది నిరాధారమైందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. మరోవైపు ఈ వదంతులను నమ్మవద్దని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా ఖాతాదారులను కోరారు. సోషల్ మీడియా సందేశాల్లో ప్రచారమవుతున్న తప్పుడు సమాచారంపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రస్తుతం, ఈ బ్యాంకులు..భారీగా పేరుకుపోయిన బ్యాడ్ లోన్లు, తక్కువ మూలధన బఫర్ కు సంబంధించి బలహీనంగా ఉన్నాయని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఆర్బీఐ చర్యలు చేపడుతోందని చెప్పారు. ప్రాంమ్ట్ కరెక్టివ్ యాక్షన్ (పీఈఏ) పరిధిలో ఈ బ్యాంకుల పనితీరును సకాలంలో మెరుగుపరుస్తామని ముంద్రా పేర్కొన్నారు.
కాగా ముఖ్యంగా ఎస్బీఐ అనుబంధ బ్యాంక్‌ల విలీనం తరువాత బ్యాంకుల కన్సాలిడేషన్ వైపు కేంద్రం యోచిస్తోందన్నవాదనలు వినిపించాయి. తద్వారా మొత్తం 3-4 అంతర్జాతీయ బ్యాంక్‌లను రూపొందించనుందనీ, అందుకే ప్రస్తుతం ఉన్న 21 ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్యను 12కు తగ్గించే ప్రతిపాదనలు సిద్దం చేస్తోందని కథనాలు వినిపించాయి.
అలాగే గత కొన్ని వారాలుగా వాట్సాప్ గ్రూపులలో తొమ్మిది ప్రభుత్వ రంగ బ్యాంకులు (కార్పొరేషన్ బ్యాంక్, యూకో బ్యాంకు, ఐడిబిఐ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఆంధ్రా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేనా బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) మూత పడనున్నాయని, అప్రమత్తంగా ఉండాలన్న సందేశాలు విపరీతంగా షేర్ అవుతున్న సంగతి తెలిసిందే.