ప్రజలకు సౌకర్యంగా కొత్త జిల్లాలు
అఖిలపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకే జిల్లాల పునర్ వ్యవస్థీకరణ చేపట్టినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ, కొత్త జిల్లాలు, కొత్త డివిజన్లు, మండలాల ఏర్పాటుపై సచివాలయంలో సీఎం అధ్యక్షతన శనివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఎం,సీపీఐ, ఎంఐఎం పాల్గొన్నాయి. 17 కొత్త జిల్లాలతో కలిపి మొత్తం 27 జిల్లాలతో రూపొందించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రజల్లోకి వెళ్లిన తర్వాత దానిపై విస్తృత చర్చ జరుగుతుందని భేటీలో సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రతిపాదనలపై ప్రజల అభిప్రాయం మేరకు మార్పుచేర్పులు చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించారు.
డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై వచ్చే అభిప్రాయాలపై చర్చించడానికి పదిహేను రోజుల తర్వాత ఒకసారి, 30 రోజుల తర్వాత మరోసారి అఖిలపక్ష సమావేశాలు నిర్వహిస్తామని వివరించారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే జిల్లాల ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకుంటామని పునరుద్ఘాటించారు. ‘‘2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా 121 కోట్లు. దేశవ్యాప్తంగా 683 జిల్లాల్లో ఒక్కో జిల్లా సగటు జనాభా 18 లక్షలు. తెలంగాణలోనేమో 3.6 కోట్ల జనాభా ఉంటే 10 జిల్లాలే ఉన్నాయి. ఒక్కో జిల్లాలో సగటున 36 లక్షల మంది ఉన్నారు. అంటే జాతీయ సగటు కన్నా రెట్టింపు.
విస్తీర్ణపరంగా కూడా జాతీయ స్థాయిలో ఒక్కో జిల్లా సగటున 4 వేల చదరపు కి.మీ. ఉంటే, తెలంగాణ జిల్లాల సగటు విస్తీర్ణమేమో 11 వేల చదరపు కి .మీ. ఉంది. పైగా చాలా మండలాలు, గ్రామాలు జిల్లా కేంద్రాలకు దూరంగా ఉన్నాయి. ఈ పరిస్థితిని నివారించడానికి, ప్రజల సౌకర్యం, పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి వివరించారు. జిల్లాల ఏర్పాటు నిర్ణయాన్ని కాంగ్రెస్, టీ టీడీపీ, బీజేపీ, సీపీఎం,సీపీఐ, ఎంఐఎం స్వాగతించాయి. డివిజన్లు, మండలాల ఏర్పాటుపై ప్రతిపక్షాలు చేసిన కొన్ని సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. సమావేశంలో టీఆర్ఎస్ తరఫున కె.కేశవరావు, నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు.
సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి: సీపీఎం
తెలంగాణలో 92 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలున్నందున కొత్త జిల్లాల ఏర్పాటులోనూ సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సీపీఎం సూచించింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి భేటీలో పాల్గొన్నారు. ‘‘జిల్లాల ఏర్పాటులో, పాలనలో ఎస్టీలకు అన్యాయం జరగకుండా చూడాలి. వివాదరహితంగా ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. స్థూలంగా జిల్లాల కూర్పును అంగీకరిస్తున్నా, కొన్ని జిల్లాలపై ప్రభుత్వ వైఖరితో విభేదిస్తున్నాం. ఏజెన్సీ ప్రాంతమంతా కలిపి అటానమస్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి. భద్రాచలం ప్రాముఖ్యత, ఇతర రాష్ట్రాలతో సరిహద్దు కారణంగాదాన్ని జిల్లా చేయాలి. సికింద్రాబాద్‌ను జిల్లా చేయాలి. కంటోన్మెంట్‌ను మల్కాజిగిరి జిల్లాలో కలపాలి. జనగామను జిల్లా చేయాలి. వెనకబడిన మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రధాన పారిశ్రామిక ప్రాంతమైన షాద్‌నగర్‌ను శంషాబాద్‌లో కలపొద్దు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రభుత్వ ప్రతిపాదనల్లో మార్పులు చేయాలి’’ అని డిమాండ్ చేశారు.
ప్రమాణాలు పాటించాలి: సీపీఐ
కొత్త జిల్లాలు, రెవె న్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో నిర్దిష్ట ప్రమాణాలు పాటించాలని సీపీఐ కోరింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి భేటీలో పాల్గొన్నారు. ‘‘కొత్త జిల్లాలు జనాభా, విస్తీర్ణ ప్రాతిపదికలకు అనుగుణంగా ఉండాలి. రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలున్నందున వాటి ప్రాతిపదికన కొత్త జిల్లాల సంఖ్యను 17 నుంచి 20కి పరిమితం చేయాలి. ఒక అసెంబ్లీ స్థానాన్ని మూడు నాలుగు జిల్లాలకు విస్తరించడం పాలనా సౌలభ్యం రీత్యా సరికాదు. ప్రజాప్రతినిధులకూ ఇబ్బందికరం. ఒక జోన్ పరిధిలోని ప్రాంతాలను మరో జోన్లో కలిపితే న్యాయపరమైన చిక్కులొస్తాయి. వెనకబడిన ప్రాంతాల ప్రజలకు విద్య, ఉద్యోగ నియామకాల్లో స్థానికత ఆధారంగా రిజర్వేషన్లు కొనసాగాలంటే జోనల్ వ్యవస్థ ఉండాల్సిందే. జనాభా కొన్ని జిల్లాల్లో 7 లక్షలు, మరికొన్నింట్లో 15 లక్షలకు పైగా ఉండటం సరికాదు’’ అన్నారు.
స్వాగతిస్తున్నాం: మజ్లిస్
కొత్త జిల్లాల ఏర్పాటును మజ్లిస్ స్వాగతించింది. అఖిలపక్ష భేటీలో మజ్లిస్ ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీ, ఎమ్మెల్సీ సయ్యద్ అమీన్-ఉల్-హసన్ జాఫ్రీ పాల్గొన్నారు. హైదరాబాద్‌లో ఎలాంటి మార్పులూ చేయకుండా జిల్లాను యథాతథంగా కొనసాగించాలని గట్టిగా వాదనలు విన్పించారు. రంగారెడ్డి జిల్లాను మూడుగా విభజించడాన్ని సమర్థించారు. షాద్‌నగర్‌ను శంషాబాద్‌లో కలిపే బదులు మహబూబ్‌నగర్ జిల్లాలో ఉంచితే బాగుంటుందన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 53 మండలాలను 70కి పెంచాలన్నారు. అప్పుడు హైదరాబాద్‌లో మరో రెండు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ఆస్కారముంటుందన్నారు.
స్పష్టమైన విధి విధానాలు ప్రకటించాలి : కాంగ్రెస్
జిల్లాల ఏర్పాటుకు స్పష్టమైన విధివిధానాలను ప్రకటించాలని టీ-కాంగ్రెస్ డిమాండ్ చేసింది. భేటీలో పార్టీ తరఫున పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, షబ్బీర్ అలీ హాజరయ్యారు. జిల్లాల ఏర్పాటుకు ఏపీ జిల్లాల పునర్విభజన చట్టం-1974ను అమలు చేయాలని కోరినట్టు తెలిపారు. ‘‘జిల్లాల ఏర్పాటుకు జనాభా, విస్తీర్ణం, సహేతుకత, వాస్తవికత, ప్రజల సౌలభ్యం, మనోగతం, భౌగోళిక స్వరూపం, వనరుల వంటివాటిని దృష్టిలో పెట్టుకోవాలన్నాం. 35 లక్షల జనాభా ఉన్న వరంగల్‌ను మూడు జిల్లాలు చేయడం, 40 లక్షలున్న హైదరాబాద్‌ను ఒకే జిల్లాగా ఉంచడం ఎలా సహేతుకం? ఐదారు జిల్లాల్లో గిరిజన జనాభా ఎక్కువగా ఉండటంవల్ల పీసా, 1/70 వంటి చట్టాలు అమల్లో ఉంటాయి. షెడ్యూల్డు ప్రాంతంలోని భూముల బదిలీల్లోనూ సమస్యలొస్తాయి’’ అన్నారు. జోనల్ వ్యవస్థను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. న్యాయపరమైన సమస్యలు రాకుండా, ప్రజలకు ఇబ్బందుల్లేకుండా ప్రక్రియను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
రాజకీయ కోణమొద్దు: టీడీపీ
కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నామని టీడీపీ పేర్కొంది. ఆ పార్టీ తరఫున తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి భేటీలో పాల్గొన్నారు. ‘‘జిల్లాల విభజన కుటుంబ పాలన కోసమన్నట్టుగా ఉండొద్దు. వాటి ఏర్పాటులో రాజకీయ కోణం ఉండొద్దు. శాస్త్రీయ కోణముండాలి. వివరాలను ప్రభుత్వ వెబ్సైట్లో పెట్టాలి. జనాభాను దృష్టిలో పెట్టుకోవాలి. దీనిపై జిల్లాల్లో పర్యటించి ప్రజలను చైతన్యపరుస్తాం. ప్రజాభిప్రాయం మేరకు ప్రభుత్వ నిర్ణయాలుండాలి’’ అన్నారు.
జ్యుడీషియల్ కమిషన్ వేయాలి: బీజేపీ
జిల్లాల పునర్విభజనపై హైకోర్టు జడ్జితో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. పార్టీ తరఫున ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు, ఎస్.మల్లారెడ్డి భేటీలో పాల్గొన్నారు. ‘‘జనాభా, విస్తీర్ణంలో సమతుల్యత పాటించాలి. జిల్లా కేంద్రం, రవాణా సౌకర్యాలు, ఖనిజ సంపద, నీటి వనరులు, ఆర్థిక పరిపుష్టి, విద్యా సౌకర్యాలు, చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాలను పరిగణనలోకి తీసుకోవాలి. షెడ్యూల్డు ప్రాంతాల్లోని గిరిజనుల హక్కులకు భంగం కలుగకుండా చూడాలి.
వరంగల్‌ను విడదీసి హన్మకొండ జిల్లా ఏర్పాటు చేయడం అశాస్త్రీయం. ప్రజల మనోభిప్రాయాలకు విరుద్ధం. కొత్త జిల్లాలకు సమ్మక్క సారక్క, ప్రొఫెసర్ జయశంకర్, కొమురం భీమ్, లక్ష్మణ్ బాపూజీ వంటి పేర్లు పెట్టాలి. జనగామ, నారాయణపేట, గద్వాల, సిరిసిల్ల జిల్లాల కోసం జరుగుతున్న ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలి. ఒక అసెంబ్లీ నియోజకవర్గమంతటినీ ఒకే జిల్లాలో ఉంచాలి. జోనల్ విధానంపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలి’’ అని డిమాండ్ చేశారు.