గోవులను సంరక్షించుకోవాలి
నెల్లూరు(బారకాసు): గోవులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని జై గోమాత గోశాల వ్యవస్థాపకుడు డాక్టర్ జీవన్‌కుమార్ పేర్కొన్నారు. శ్రీరంగనాథ గోశాల కమిటీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి పురమందిరంలో పంచగవ్య థెరపీ, నాడీ చికిత్సపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మాట్లాడారు. గోమాత పంచగవ్యముల నుంచి తయారు చేసిన ఔషధ చికిత్సే పంచగవ్య చికిత్స అని చెప్పారు. సమాజంలో ప్రతి ఒక్కటీ కలుషితమైపోతుండటంతో మానవులు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గోవులు నానాటికీ అంతరించిపోతున్నాయని చెప్పారు. నెల్లూరులో గోశాలను ఏర్పాటు చేయడం, దానికి ఓ కమిటీని నియమించడాన్ని అభినందించారు. అనంతరం కమిటీ అధ్యక్షుడు యేల్చూరు పాంచజన్యం మాట్లాడారు. గోవులను సంరక్షించేందుకు 2003లో మొట్టమొదటగా రంగనాథస్వామి దేవస్థానంలో రెండు గోవులతో ప్రారంభమైందని చెప్పారు. ప్రస్తుతం టీపీ గూడూరు మండలం విలుకానిపల్లి గ్రామంలో దేవస్థానానికి చెందిన భూమిని లీజుకు తీసుకొని తమ కమిటీ ఆధ్వర్యంలో 42 ఆవులను సంరక్షిస్తున్నామని చెప్పారు. ఉచిత వైద్యశిబిరంలో పాల్గొన్న రోగులకు పంచగవ్య థెరపీ, నాడీ చికిత్సలను నిర్వహించారు. అనంతరం రంగనాథ గోశాల నూతన కమిటీ సభ్యులకు ఆయన కండువాలు కప్పి అభినందించారు. డాక్టర్ జీవన్‌కుమార్ సతీమణి భారతి, రంగనాథస్వామి నూతన కమిటీ గౌరవాధ్యక్షుడు అచ్యత సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి సురేంద్రనాథ్, కోశాధికారి జనార్దన్, ఉపాధ్యక్షులు శరత్‌బాబు, జయకుమార్, సహాయ కార్యదర్శులు జయప్రకాష్, రామ్‌కుమార్, సహాయ కోశాధికారి కిషోర్‌కుమార్, గౌరవ సలహాదారులు సుదర్శన్, నందకిషోర్, తదితరులు పాల్గొన్నారు.