సీ లయన్స్‌కు తప్పని అతిపెద్ద ముప్పు
న్యూయార్క్: కాలిఫోర్నియాలో అనూహ్యంగా భారీ సంఖ్యలో సీల్ చేపలు పెరిగిపోయాయి. ఎంతగా అంటే 1970లో వాటి సంఖ్య 50 వేలు ఉండగా.. ప్రస్తుతం అవి 3,40,000కు చేరుకున్నాయి. ఈ పెరుగుదల రేటు గతంలోని రికార్డులన్నింటిని దాటేసినా వాటి ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మాత్రం అయ్యో పాపం అనిపించక మానదు. ఎందుకంటే ప్రస్తుతం ఈ జీవరాశికి ఓ ముప్పు వచ్చి పడింది. సీల్ పిల్లలు పౌష్టికాహార లోపంతో తిండిలేక ఆకలి సమస్యతో బాధపడుతున్నాయి.
ఇప్పటివరకు మనుషులనే వేధిస్తున్న జంక్ ఫుడ్ సమస్య ప్రస్తుతం ఈ జీవరాశిని కూడా వెంటాడడమే ఇందుకు ఓ కారణం. వీటి తల్లులు జంక్ ఫుడ్ ను అమితంగా తీసుకోవడం వల్లే ప్రస్తుతం అవి ఆ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. నేషనల్ ఆసియానిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ సీల్ జీవరాశిపై పరిశోధన చేయగా ఈ విషయం తెలిసింది.
2004 నుంచి 2014 మధ్య కాలాన్ని పరిగణనలోకి తీసుకొని ఆ మధ్యకాలంలో సీలు చేప పిల్లల ఆరోగ్య స్థితిని అంచనా వేశారు. ఇందులో అవి అనూహ్యంగా బరువు తగ్గిపోతున్నట్లు, పౌష్టికాహార లోపంతో బాధపడిపోతున్నట్లు గుర్తించారు. వాటిలో ఉండే కేలరీల స్థాయి కూడా పడిపోతుందని, అత్యధిక స్థాయి నుంచి అతి తక్కువ స్థాయికి వాటి పోషక విలువలు పడిపోతున్నట్లు వారు చెప్తున్నారు. సముద్రపు నీరు వేడెక్కడం కూడా అవి బలహీనంగా తయారవడానికి మరోకారణం అని వారు భావిస్తున్నారు. సముద్ర జలాల్లో జంక్ ఫుడ్‌లాంటి పదార్థాలు ఎక్కువవడం వాటిని అవి తినడం వల్ల ప్రస్తుతం ఈ జాతి పిల్లలు పెను ప్రమాదాన్ని చవిచూస్తున్నాయని అధ్యయనం వెల్లడించింది.