డ్యాం చిన్నదైతే ముంపు తప్పుతుంది
* ఖమ్మం జిల్లా అంతా తెలంగాణలోనే ఉంచాలి: విద్యాసాగర్
సాక్షి, హైదరాబాద్: కేంద్రప్రభుత్వం ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా వ్యవహరించకూడదని, ఖమ్మం జిల్లాను మొత్తం తెలంగాణలోనే ఉంచాలని కేంద్ర జల సంఘం రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఆర్. విద్యాసాగర్‌రావు అన్నారు. గురువారం ఎర్రమంజిల్ లోని జలసౌధ కార్యాలయంలో ఆదివాసీలకు అండగా నిలబడదాం, పోలవరం ఆర్డినెన్స్‌ను వెంటనే నిలుపుదల చేయాలంటూ జలసౌధ ఉద్యోగులు భోజనవిరామ సమయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి విద్యాసాగర్ రావు సంఘీభావం తెలిపేందుకు వచ్చారు.
ఆయన మాట్లాడుతూ, గతంలో కేంద్ర జలసంఘం పోలవరం ప్రాజెక్ట్‌ను 36 లక్షల క్యూసెక్కుల నీరు నిలుపుదల సామర్థ్యంతో నిర్మించేందుకు డిజైన్ తయారు చేశారని, అప్పుడే 239 గ్రామాలు ముంపునకు గురువుతున్నట్టు నిపుణులు చూచాయగా తేల్చారని తెలిపారు. కాని ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్‌ను 50 లక్షల క్యూసెక్కుల నీటిని నిలుపుదల చేసేలా డిజైన్ చేశారని దీని ద్వారా ఎన్ని గ్రామాలు ముంపునకు గురౌతాయో లెక్కలు తేల్చలేదన్నారు.
ప్రస్తుతం నిర్మించతలపెట్టిన ప్రాజెక్ట్ వల్ల కేవలం తెలంగాణ, ఆంధ్రలోని గ్రామాలే కాకుండా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన అనేక గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉందన్నారు. గుజరాత్లో ఏవిధంగా చిన్నచిన్న డ్యామ్‌లు నిర్మించారో అదేవిధంగా పెద్ద పోలవరం కాకుండా చిన్న పోలవరం ప్రాజెక్ట్‌లను నిర్మిస్తే ముంపు ప్రాంతాలు తగ్గుతాయన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ రమణా నాయక్, జలసౌధ ఉద్యోగులు వెంకటేశం, శ్రీధర్‌దేశ్‌పాండే, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.