రీఎంట్రీకి రెడీ..పెళ్లయినా హీరోయిన్స్‌గానే
వీలైతే నాలుగు మాటలు... కుదిరితే కప్పు కాఫీ... ‘బొమ్మరిల్లు’లో ఇలాంటి డైలాగుల్లో జెనీలియా అమాయకత్వాన్ని మరచిపోలేం. అమ్మాయి.. బాగుంది.. చూడచక్కగా ఉంది.. నటన కూడా బాగుంది. ‘అమ్మాయి బాగుంది’తో తెలుగు తెరకు వచ్చిన మీరా జాస్మిన్‌కి లభించిన ప్రశంసలు.గ్లామర్ మాత్రమే కాదు.. మంచి నటి కూడా.. హిందీలో అనుష్కా శర్మకు దక్కిన అభినందనలు. ఈ ముగ్గురు భామలూ పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్ చెప్పారు. ఇప్పుడు బ్రేక్‌కి ఫుల్స్టాప్ పెట్టారు. సినిమాలు సైన్ చేశారు. అభిమానులను ఆనందపరచడానికి మళ్లీ వస్తున్నారు.
పెళ్లయిన నాయికలకు ‘లీడ్ రోల్స్’ రావు అనే మాటని ఐశ్వర్యా రాయ్ బచ్చన్, జ్యోతిక, రాణీ ముఖర్జీ వంటి తారలు అబద్ధం చేశారు. కథానాయికలుగా చేస్తున్నారు. అంతెందుకు? దాదాపు పద్నాలుగేళ్ల గ్యాప్ తర్వాత శ్రీదేవి రీ–ఎంట్రీ ‘ఇంగ్లిష్–వింగ్లిష్’లో చేసిన లీడ్ రోల్‌తోనే జరిగింది. ఆ తర్వాత ‘మామ్’లోనూ లీడ్ రోల్ చేశారామె. శ్రీదేవి హఠాత్తుగా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. లేకుంటే ఈ ఫిఫ్టీ ప్లస్ తారను మరిన్ని మెయిన్ రోల్స్‌లో చూడగలిగేవాళ్లం.
మామూలుగా హాలీవుడ్లో ఫిఫ్టీ, సిక్స్టీ ప్లస్ తారలు కూడా నాయికలుగా చేస్తుంటారు. ఇండియన్ సినిమాలోనూ అది సాధ్యం అని నిరూపించారు శ్రీదేవి. ఇక రీ ఎంటర్ అవుతున్న తారల్లో జెనీలియా గురించి చెప్పాలంటే.. ‘బొమ్మరిల్లు, రెడీ, శశిరేఖా పరిణయం, ఆరెంజ్’.. ఇలా తెలుగులో మంచి సినిమాలు జెనీలియా ఖాతాలో ఉన్నాయి. 2012లో చేసిన ‘నా ఇష్టం’ తర్వాత ఈ నార్త్ బ్యూటీ తెలుగులో సినిమాలు చేయలేదు. అదే ఏడాది హిందీ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత రెండు మూడు హిందీ చిత్రాల్లో, ఓ మరాఠీ చిత్రంలో అతిథి పాత్రల్లో కనిపించడంతో పాటు కొన్ని చిత్రాలకు నిర్మాతగా చేశారు. 2014లో ఒక బాబుకి, 2016లో ఓ బాబుకి జన్మనిచ్చారు జెనీలియా. ఇక నటిగా కొనసాగాలనుకుంటున్నారు.
మరాఠీ సినిమా ‘వేద్’తో ఆమె రీ ఎంట్రీ షురూ అయింది. మరాఠీలో జెనీలియా కథానాయికగా చేస్తున్న తొలి చిత్రం ఇది. అది కూడా ఆమె భర్త రితేష్ దర్శకత్వం వహించనున్న సినిమా కావడం విశేషం. ‘‘నేను మహారాష్ట్రలో పుట్టి, పెరిగాను. కానీ మరాఠీలో పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్ర చేయలేదు. ఆ కొరత తీరుతున్నందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు జెనీలియా. ఇక, మీరా జాస్మిన్ విషయానికొస్తే.. ‘అమ్మాయి బాగుంది’తో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళ బ్యూటీ అంతకు ముందే మలయాళ, తమిళ చిత్రాల్లో నటించారు.
వాటిలో తమిళ చిత్రం ‘రన్’ తెలుగులోనూ విడుదలైంది. తెలుగులో ‘గుడుంబా శంకర్’, ‘భద్ర’ వంటి హిట్ చిత్రాల్లో నటించారు. 2014లో అనిల్ జాన్ని పెళ్లాడిన మీరా ఆ తర్వాత నాలుగైదు సినిమాల్లో నటించారు. వాటిలో అతిథి పాత్రలు ఉన్నాయి. బ్రేక్‌కి ముందు ట్రెడిషనల్ హీరోయిన్ క్యారెక్టర్లు చేసిన మీరా జాస్మిన్ రీ–ఎంట్రీలో అందుకు పూర్తి భిన్నమైన ఇమేజ్‌ని కోరుకుంటున్నట్లున్నారు. మళ్లీ వస్తున్న విషయాన్ని తెలియజేస్తూ, గ్లామరస్‌గా ఫొటోషూట్ చేయించుకున్నారు. అంతేకాదు.. అభిమానులకు అందుబాటులో ఉండాలని సోషల్ మీడియాలోకీ ఎంట్రీ ఇచ్చారు. ‘మక్కళ్’ అనే మలయాళ సినిమా అంగీకరించారు మీరా.
‘అందం హిందోళం.. అదరం తాంబూలం’ అంటూ ‘యముడికి మొగుడు’లో స్టైల్‌గా స్టెప్పులేసిన రాధ 30 ఏళ్ల క్రితం స్టార్ హీరోయిన్. తెలుగులో ‘అగ్నిపర్వతం’, ‘సింహాసనం’, ‘రాముడు భీముడు’ వంటి పలు చిత్రాల్లో కథానాయికగా 1980 నుంచి 1990 వరకూ నాటి తరానికి పాపులర్. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి అగ్ర హీరోలతో నటించారామె. 1991లో వ్యాపారవేత్త రాజశేఖరన్‌ని పెళ్లాడాక సినిమాలకు బ్రేక్ వేశారు. 30ఏళ్ల తర్వాత ఆమె రీ ఎంట్రీ ఇచ్చారు.. అయితే స్మాల్ స్క్రీన్‌కి. తమిళంలో ఈ మధ్యే ప్రసారం ప్రారంభమైన ‘సూపర్ క్వీన్’కి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు రాధ. మంచి పాత్రలు వస్తే సినిమాల్లోనూ నటించే ఆలోచనలో రాధ ఉన్నారని సమాచారం.
అటు హిందీ వైపు వెళితే.. అనుష్కా శర్మ వెండితెరపై కనిపించి దాదాపు మూడేళ్లవుతోంది. 2017లో క్రికెటర్ విరాట్ కోహ్లీని పెళ్లాడాక, బ్రేక్ తీసుకున్నారామె. గత ఏడాది ఓ పాపకు జన్మనిచ్చారు. ఈ ఐదేళ్ల బ్రేక్‌లో నటించలేదు కానీ, నిర్మాతగా సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు బ్రేక్‌కి ఫుల్స్టాప్ పెట్టి, హీరోయిన్గా ‘చక్‌ద ఎక్స్‌ప్రెస్’ సినిమాకి సైన్ చేశారు అనుష్క. భారత ప్రముఖ మహిళా క్రికెటర్ జులన్ గోస్వామి బయోపిక్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. జులన్ పాత్రను అనుష్క చేస్తున్నారు. ‘‘ఇలాంటి ప్రయోజనాత్మకమైన సినిమా ద్వారా వస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు అనుష్కా శర్మ.రాధ, జెనీలియా, మీరా జాస్మిన్, అనుష్కా శర్మ.. వీరి ఎంట్రీ మరికొంతమంది తారలకు ఇన్స్పైరింగ్గా ఉంటుందని చెప్పొచ్చు. ఇక వీలైతే నాలుగు సినిమాలు లేదా అంతకు మించి.. కుదిరితే లీడ్ రోల్స్‌లో తమ అభిమాన తారలను చూడాలని ఫ్యాన్స్ కోరుకోకుండా ఉంటారా!