హీరోనా? బాధితుడా? నేనేం చెప్పాలి?
చెన్నై: 'నాన్నను ఎవరు చంపారని నా కొడుకు అడిగితే ఏం చెపాలి? ఆయనను హీరో అనాలా? లేక బాధితుడని చెప్పాలా?' ఇది బాధతో పూడుకుపోయిన గొంతుతో వైశాళి రాఘవేంద్రన్ అడిగిన ప్రశ్న. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు విడిచిన రాఘవేంద్రన్ గణేషన్ భౌతికకాయం బుధవారం చెన్నైలోని కుటుంబసభ్యుల వద్దకు చేరింది. నిజానికి ఆయన పూర్తి భౌతికకాయం లభించలేదు. కేవలం భౌతికకాయం అవశేషాలు మాత్రమే ఓ డబ్బాలో తరలించారు. ఆ బాక్స్ ముందు కూచొని రోదిస్తున్న రాఘవేంద్రన్ భార్య వైశాలీని ఓదార్చడం.. ఆమె బంధువులకు కూడా సాధ్యపడలేదు. ఆమె అడిగిన ప్రశ్నలకు ఎవరి వద్ద సమాధానం లేదు.
2014 మార్చిలో వైశాలీ- రాఘవేంద్రన్ వివాహం జరిగింది. గత ఫిబ్రవరిలో తమ చిన్నారి బారసాల అనంతరం రాఘవేంద్రన్ బ్రస్సెల్స్ వెళ్లాడు. త్వరలోనే తిరిగొచ్చి భార్యను, పిల్లాడిని వెంట తీసుకెళుతానని వెళ్లేటప్పుడు చెప్పాడు. తన కొడుకు అర్జున్ బుడిబుడి అడుగులు వేయడం, బుజ్జిబుజ్జి మాటలు మాట్లాడటం మిస్ కాబోనని ప్రామిస్ చేశాడు. కానీ బుధవారం ఓ నల్లని డబ్బాలో ఆయన నిర్జీవ దేహం మాత్రమే తిరిగొచ్చింది. ఆ బాక్స్‌లో ఓ సెల్‌ఫోన్‌తోపాటు అది ఏయే దేశాలను దాటివచ్చింది.. ఆయా దేశాల స్టిక్కర్స్ ఉన్నాయి.
31 ఏళ్ల రాఘవేంద్రన్ ఇన్ఫోసిస్ ఉద్యోగి. బ్రస్సెల్స్ లో ఉగ్రవాద దాడులు జరిగిన మార్చి 22న ఆయన అదృశ్యమయ్యాడు. 'ఆత్మాహుతి బాంబర్ ఉన్న మెట్రో రైలు బోగీలోనే.. అతనికి సమీపంగా రాఘవేంద్రన్ ఉండటంతో ఆయన శరీర దిగువభాగమంతా గల్లంతు అయిందని అధికారులు తెలిపినట్టు ఆయన బంధువులు చెప్తున్నారు. బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య ఆయనకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.