‘స్వగృహ’ బంపర్ ఆఫర్
ప్రాజెక్టు ధరలు భారీగా తగ్గింపు
బండ్లగూడలో చదరపు అడుగుకు రూ.2,200
పోచారంలో రూ.2,050 చొప్పున నిర్ధారణ!
ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పరిధిలో అమ్ముడు పోకుండా తెల్ల ఏనుగుల్లా మిగిలిన రాజీవ్ స్వగృహ ప్రాజెక్టులను వదిలించుకునేక్రమంలో ప్రభుత్వం వాటి ధరలను భారీగా తగ్గించింది. కొనేవారు లేకున్నా ధరలను మాత్రం తగ్గించబోమంటూ ఇప్పటి వరకు భీష్మించుకు కూర్చున్న అధికారులు వాస్తవాలను గుర్తించి దిగొచ్చారు. ఇప్పటి వరకు చదరపు అడుగు ధర దాదాపు రూ.2,800కు పైగా ఉన్న బండ్లగూడ స్వగృహ ప్రాజెక్టు ధరను రూ.2,200కు, చదరపు అడుగు ధర రూ.2,600 వరకు ఉన్న పోచారం ప్రాజెక్టు ధరను రూ.2,050కు తగ్గించేలా కసరత్తు చేస్తున్నారు. ఏకమొత్తంలో ఇళ్లను కొనేందుకు ముందుకొస్తే ధరలను మరింత తగ్గించేలా ‘బేరసారాల’కు అవకాశం కల్పించారు. దీనికి సంబంధించి మరో రెండుమూడు రోజుల్లో అధికారికంగా ఆదేశాలు వెలువడనున్నాయి. దీంతో సింగిల్ బెడ్రూం ఫ్లాట్ ధర రూ.2 లక్షలు, డబుల్ బెడ్రూం ఫ్లాట్ ధర రూ.3 లక్ష ల మేర తగ్గనున్నాయి. పోచారం, బండ్లగూడ ప్రాజెక్టులకు ఈ కొత్త ధరలను వర్తింపజేయనున్నారు. ప్రస్తుతం బండ్లగూడలో రెండు వేలు, పోచారంలో రెండున్నరవేల ఫ్లాట్లు సిద్ధంగా ఉన్నాయి. స్వగృహను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించడంతో అప్పట్లో ప్రభుత్వం వాటి నిర్మాణంలో మన్నికకు పెద్దపీట వేసింది. కానీ, ధరలు భారీగా ఉండడంతో ఇళ్ల కొనుగోలుకు ప్రజలు పెద్దగా ముందుకురాలేదు. ఇప్పుడు ధరలను భారీగా తగ్గించడంతో అమ్మకాలు జోరుగా సాగుతాయని అధికారులు భావిస్తున్నారు. బండ్లగూడ ప్రాజెక్టును రాయితీ ధరలకు ప్రభుత్వ ఉద్యోగులకు అమ్మాలని మొదట నిర్ణయించినా ఇప్పుడు సాధారణ ప్రజలు ముందుకొస్తే వారికి కూడా అమ్మాలని భావిస్తున్నారు.
భారీగా ‘అదనపు’ ధరలు ..
ధరలు తగ్గించడం వరకు బాగానే ఉన్నా అధికారులు ఇక్కడ చేసిన ప్రయోగం కొనుగోలుదారులను కలవరపెట్టేలా ఉంది. ప్రైవేటు బిల్డర్ల తరహాలో కొత్త ధరలను నిర్ధారించాలని నిర్ణయించడమే దీనికి కారణం. ఫ్లాట్ ధరకు ఇతర వసతుల రుసుం అదనం అని ప్రకటించాలని నిర్ణయించారు. స్వగృహ ప్రాజెక్టుల్లో పైప్డ్ గ్యాస్, కామన్ సోలార్‌వాటర్ హీటర్, కబ్బోర్డ్స్తో పాటు పూర్తిస్థాయిలో ఫర్నిషింగ్... ఇలా కొన్ని హంగుల ధరను ఇంటి ధరలో కలపకుండా విడిగా చూపారు.
చదరపు అడుగు ధరగా అధికారులు ప్రకటించే మొత్తంలో ఇవి కలవవు. సింగిల్ బెడ్ రూంకు రూ. లక్షన్నర, డబుల్ బెడ్ రూం ఫ్లాట్‌కు రూ. రెండున్నర లక్షలు... ఇలా విస్తీర్ణం పెరిగే కొద్దీ ఈ ‘అదనపు’ ధరలు పెరుగుతాయి. అలాగే వాహన పార్కింగ్‌కు విడిగా ధర ఖరారు చేస్తున్నారు. కవర్డ్ పార్కింగ్ స్థలం (యజమానికి శాశ్వత నిర్ధారిత స్థలం) కోసం పోచారంలో రూ.1.25 లక్షలు, బండ్లగూడలో రూ.1.75 లక్షలుగా నిర్ధారించాలని నిర్ణయించారు. కేవలం చదరపు అడుగు ధర ప్రకారం లెక్కిస్తే ఇంటి ధర తక్కువగా కనిపించినా... ఇవన్నీ కలిపితే మళ్లీ ఎక్కువగానే ఉండనుంది. అయితే కొన్ని ఫ్లాట్లలో ఆ హంగులు లేవు. వాటికి అదనపు ధరలు ఉండవని అధికారులు పేర్కొంటున్నారు.
కార్పస్ ఫండ్ ఏర్పాటు..
మెగా ప్రాజెక్టులు కావటంతో వాటి నిర్వహణ భారంగా ఉంటుంది. భవిష్యత్తులో వాటికి రంగులేయాలన్నా, మరమ్మతులు చేయాల్సి వచ్చినా నిర్వహణ సులభంగా ఉండేందుకుగాను కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం కొనుగోలుదారులు చదరపు అడుగుకు రూ.50 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. దానిపై వచ్చే వడ్డీతో అవసరమైన పనులు చేయిస్తారు.