రామప్ప.. పట్టించుకోండప్పా..
దిక్కూమొక్కూలేని స్థితిలో ‘రామప్ప’ అనుబంధ ఆలయాలు
- తమ పరిధి కాదని వదిలేసిన కేంద్ర–రాష్ట్ర పురావస్తు శాఖలు
- తాజా వానలతో కూలిన ఓ గుడి.. మిగతావీ కూలేందుకు సిద్ధం
- కుప్పకూలిన రామప్ప దేవాలయం అనుబంధ నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే.. రాష్ట్రానికి ప్రపంచ వారసత్వ హోదా తీసుకొచ్చే కట్టడానికి అనుబంధ నిర్మాణమయ్యేది. యునెస్కో గుర్తింపుతో ఐక్య రాజ్య సమితి నిధులతో ప్రపంచ పర్యాటకులను కను విందు చేసే నిర్మాణంలో భాగమయ్యుండేది. కానీ ఇప్పు డిలా కుప్పకూలి శిథిలాల కుప్పగా మారింది. కొద్ది రోజుల క్రితమే నిపుణులను పిలిపించి ప్రపంచ వారసత్వ హోదా కోసం యునెస్కోకు దరఖాస్తు చేయిం చేందుకు ప్రభుత్వం హడావుడి చేసిన 8 శతాబ్దాల నాటి రామప్ప దేవాలయం అనుబంధ ఆలయం దుస్థితి ఇది. వానలకు ఆలయం కూలిపోతే శిథిలాలను పరిశీలించేందుకు ప్రభుత్వ యంత్రాంగం రాలేకపోయింది. అదేమంటే.. అది తమ పరిధిలోని కట్టడం కాదని ఇటు కేంద్ర పురావస్తు శాఖ అటు రాష్ట్ర పురావస్తు విభాగం తప్పించుకుంటున్నాయి.
ఆలయం కూలి.. స్తంభాలు విరిగి..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రామప్ప దేవాలయం ప్రధాన నిర్మాణమే కాకుండా దాని చుట్టూ అనుబంధంగా 7 చిన్న దేవాలయాలున్నాయి. కానీ ప్రధాన దేవాలయం ఒక్కటే తమ పరిధిలోకి వస్తుందని, మిగతా 7 దేవాల యాలు తమకు సంబంధం లేదని కేంద్ర పురావస్తు శాఖ (ఏఎస్ఐ) పేర్కొంటోంది. ఏఎస్ఐ కట్టడానికి 300 మీటర్ల బఫర్ పరిధిలో ఉండే అనుబంధ కట్టడాలన్నీ ఆ శాఖ పరిధిలోకే వస్తాయని, కాబట్టి ఆ 7 నిర్మాణాలతో తమకు సంబంధం లేదని రాష్ట్ర పురావస్తు శాఖ వదిలేసింది. దీంతో ఆలయాల ఆలనాపాలనా పట్టించుకునేవారు లేక శిథిలమవుతున్నాయి. ప్రధాన కట్టడానికి అడపాదడపా మరమ్మతు చేస్తుండటంతో ఇంకా నిలిచి ఉంది. కానీ చిన్న దేవాలయా లను పర్యవేక్షించకపోవడంతో వాటి పరిస్థితి దయనీయం గా మారింది. తాజాగా ఓ శివాలయం కుప్పకూలింది. స్తంభాలు విరిగిపోయాయి. ఇంత జరిగినా శిథిలాలను పంచనామా చేసి పరిశీలించేందుకు ఏఎస్ఐ గాని, రాష్ట్ర పురావస్తు శాఖ గాని ముందుకు రాకపోవడం వాటి నిర్లక్ష్యానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
మరి యునెస్కో గుర్తింపు సంగతి..?
ప్రధాన దేవాలయానికి యునెస్కో గుర్తింపు కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసుకుంది. మరింత స్పష్టత కావాలని యునెస్కో పేర్కొనడంతో ప్రఖ్యాత నర్తకి, యునెస్కో కన్సల్టెంట్ చూడామణితో అధ్యయనం చేయించి మరో దరఖాస్తు పంపేందుకు సిద్ధమైంది. ప్రధాన ఆలయంతోపాటు చుట్టూ ఉన్న 7 చిన్న దేవాలయాలనూ అందులో భాగం చేసి ఆ ప్రాంతాన్ని టెంపుల్ టౌన్‌గా అభివృద్ధి చేయాల్సి ఉంది. కానీ కళ్లముందు కట్టడాలు కూలుతున్నా పట్టించుకోనప్పుడు యునెస్కో గుర్తింపు తీసుకొచ్చేందుకు ఏం ప్రయత్నిస్తారని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మిగతా 6 దేవాలయాలూ ఎప్పుడు కూలుతాయో తెలియని దుస్థితిలో ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆలయాల నిర్వహణ విషయమై స్పష్టత తీసుకురాకుంటే కొద్ది రోజుల్లోనే ఆ ఆరు ఆలయాలూ విరిగిపడే ప్రమాదం ఉంది.