ర్యాంకర్ల మనోగతం
బాంబే ఐఐటీలో సీఎస్ఈ: జీవితేశ్
ఐఐటీ బాంబేలో సీఎస్ఈ చేయడమే తన లక్ష్యమని జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆలిండియా నాలుగో ర్యాంకు సాధించిన జీవితేశ్ చెప్పాడు. ఈయన తండ్రి శివకుమార్ వీటీపీఎస్‌లో ఏడీఈగా పని చేస్తున్నారు. పదో తరగతి వరకు విజయవాడలో చదివిన జీవితేశ్.. హైదరాబాద్‌లోని నారాయణ కాలేజీలో ఇంటర్మీడియెట్ పూర్తి చేసి 981 మార్కులు సాధించాడు. తెలంగాణ ఎంసెట్‌లో 35, ఏపీ ఎంసెట్‌లో 78వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు.
సివిల్స్‌కు ప్రిపేర్ అవుతా: సాయితేజ
‘‘తల్లిదండ్రుల ప్రోత్సాహంతోపాటు నారాయణ శ్రీచైతన్య ఐఐటీ అకాడమీ ఫ్యాకల్టీ గెడైన్స్‌తోనే ఈ విజయం సాధ్యపడింది. ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చదవడం నా లక్ష్యం. ఆ తర్వాత సివిల్స్‌కి ప్రిపేర్ అవుతా’’ అని జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఐదో ర్యాంకు సాధించిన తాళ్లూరి సాయితేజ చెప్పాడు. టాప్-5లో స్థానం దక్కుతుందని ముందుగా ఊహించానన్నారు. గుంటూరు జిల్లా కూచిపూడికి చెందిన వీరి కుటుంబం చాలా సంవత్సరాల కిందట హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో స్థిరపడింది. నాన్న చలపతిరావు సివిల్ కాంట్రాక్టర్. తెలంగాణ ఎంసెట్‌లో సాయితేజ మొదటి ర్యాంకు సాధించగా... ఏపీ ఎంసెట్‌లో ఏడో ర్యాంకు పొందాడు.
ఎంసెట్‌లో 3.. అడ్వాన్స్‌డ్‌లో 7
వరంగల్ జిల్లాకు చెందిన నిఖిల్ సామ్రాట్ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఏడో ర్యాంకు కైవసం చేసుకున్నాడు. నిఖిల్ తండ్రి ప్రసాద్ విద్యాశాఖలో డీఈగా విధులు నిర్వహిస్తున్నారు. బాంబే ఐఐటీలో సీఎస్ఈ చేస్తానంటున్న నిఖిల్ తెలంగాణ ఎంసెట్‌లో మూడో ర్యాంకు, ఏపీ ఎంసెట్‌లో 54వ ర్యాంకు సాధించాడు.
బాంబేలో చదువుతా: ప్రణీత్‌రెడ్డి
కడప జిల్లాకు చెందిన సాయి ప్రణీత్ రెడ్డి జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 8వ ర్యాంకు సాధించాడు. ఈయన తండ్రి రాజగోపాల్ రెడ్డి సివిల్ కాంట్రాక్టర్. అమ్మ శ్రీలత గృహిణి. చిన్నతనం నుంచే చదువులో ముందుండే ప్రణీత్... తెలంగాణ ఎంసెట్‌లో 31, ఏపీ ఎంసెట్‌లో 53వ ర్యాంకు పొందాడు. బాంబే ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చేస్తానని చెప్పాడు.
స్పేస్ సైంటిస్ట్ అవుతా: విఘ్నేష్ రెడ్డి
బాంబే ఐఐటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేస్తానని జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో పదో ర్యాంకు సాధించిన కొండా విఘ్నేష్ రెడ్డి చెప్పాడు. ఈయనది నెల్లూరు జిల్లా. నాన్న శ్రీనివాసులు సాఫ్ట్వేర్ ఇంజినీర్. అమ్మ సరళాదేవి గృహిణి. ప్రస్తుతం వీరి కుటుంబం హైదరాబాద్‌లోనే స్థిరపడింది. ‘‘నాకు అంతరిక్షం అంటే చిన్నప్పట్నుంచీ చాలా ఆసక్తి. స్పేస్ సైంటిస్ట్ కావడమే నా జీవిత లక్ష్యం. 2025 నాటికి ఇస్రో ప్రపంచాన్ని శాసిస్తుందని నా నమ్మకం. అప్పటికి ఇస్రోలో నా పాత్ర ఉండాలి’’ అని విఘ్నేష్‌రెడ్డి పేర్కొన్నాడు.