రావలు.. తినాల్సిందే..!
భీమవరం: దీపావళి వస్తుందంటే చాలు మాంసాహార ప్రియలు రావలు(రామలు)కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు. మామూలు రోజుల్లో రావలు దొరికినా దీపావళి అమావాస్యకు మంచి రుచిగా ఉంటాయనే నమ్మకమే వాటిపై ఆసక్తి పెరగడానికి కారణం. అంతేకాకుండా ఈ చేపలు తినడం వల్ల కంటి రోగాలు తగ్గి చూపు మందగించకుండా ఉంటుందని నమ్ముతారు. రావలు కేవలం అక్టోబర్, నవంబర్ నెలల్లో మాత్రమే దొరుకుతాయి.
గతంలో మొగల్తూరు నుంచి పాతపాడు వరకు ఉప్పుటేరు వెంబడి విరివిగా ఇవి దొరికేవి. పాతపాడు నుంచి మొగల్తూరుకు లాంచీల్లో తీసుకువచ్చి అక్కడ హోల్‌సేల్‌గా అమ్మేవారు. అయితే మొగల్తూరు ప్రాంతంలో మడ అడవులు అంతరించిపోవడంతో రావలు కూడా కనుమరుగయ్యాయి. కాగా ఇటీవల కాలంలో కొంతమంది రైతులు చెరువుల్లోæ రావల పెంపకం చేపట్టారు.
ప్రస్తుతం మార్కెట్లో రావలు ఒక్కొక్కటి రూ.10 నుంచి రూ.20 పలుకుతున్నాయి. 9 అంగుళాలు పొడవుండి పాము ఆకారంలో ఇవి ఉంటాయి. ఈ జాతి చేప సీతారాముల కళ్యాణం(శ్రీరామనవమి) లోపు ఏ ప్రాంతంలో ఉన్నా నదుల ద్వారా ప్రయాణం సాగించి భద్రాచలం చేరి తరిస్తాయన్నది ఓ కథనం. ఏది ఏమైనా దీపావళి రోజున రావల కూరతింటే ఆ మజానే వేరంటున్నారు అనుభవజ్ఞులు.