35 మంది ఎంపీహెచ్‌ఏలకు ఉద్యోగోన్నతి
గుంటూరు మెడికల్, న్యూస్‌లైన్: గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్యశాఖ సంచాలకుల(ఆర్డీ) కార్యాలయం పరిధిలో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్(ఫీమేల్)లకు 35 మందికి శుక్రవారం ఉద్యోగోన్నతి కౌన్సెలింగ్ జరిగింది. గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఆర్డీ కార్యాలయంలో అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి ఉద్యోగోన్నతి ఉత్తర్వులు అందజేశారు. గుంటూరు జిల్లాలోని 16, ప్రకాశం జిల్లాలోని 19 ఎంపీహెచ్ఏ ఖాళీలు ఈ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ అయ్యాయి.
ఉద్యోగోన్నతుల కోసం ఆర్డీ కార్యాలయం అధికారులు గతేడాది నవంబర్‌లో ఫైల్ పంపగా హైదరాబాద్ వైద్యాధికారులు ఈనెల 7న కౌన్సెలింగ్‌కు అనుమతి ఇచ్చారు. ఆరునెలలుగా ఉద్యోగోన్నతి కోసం ఎదురు చూపులు చూశామని, తెలంగాణ గొడవ వల్ల పదోన్నతి ఫైలు ఆలస్యంగా వచ్చినట్లు ప్రభుత్వ ఏఎన్ఎమ్, హెచ్‌వి, పిహెచ్న్, సిహెచ్‌ఓల అసోసియేషన్ జిల్లా సెక్రటరీ నిర్మలాదేవి తెలిపారు. ఆర్డీ డాక్టర్ డి.షాళినిదేవి, డిప్యూటీ డైరక్టర్ డాక్టర్ జె.విజయలక్ష్మి, సూపరింటెండెంట్లు పూసల శ్రీనివాసరావు, షేక్ బాజిత్, సిబ్బంది కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు.
సూపరింటెండెంట్స్‌గా మరో ముగ్గురు..
ఆర్డీ కార్యాలయం పరిధిలో సీనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ముగ్గురికి శుక్రవారం సూపరింటెండెంట్స్‌గా ఉద్యోగోన్నతి కల్పించారు. ఆర్డీ డాక్టర్ డి.షాళినిదేవి ఈ కౌన్సెలింగ్ నిర్వహించారు. గుంటూరు జిల్లా నరసరావుపేట క్లస్టర్లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఐ.వి.రాఘరావును ప్రమోషన్‌పై నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి బదిలీ చేశారు. జిల్లాలోని పెదపలకలూరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సిహెచ్. సాంబశివరావును, నెల్లూరు జిల్లా కొవ్వూరు క్లస్టర్లో పనిచేస్తున్న ఎం.శైలేష్‌కుమార్‌ను నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు బదిలీచేశారు.