'సైజ్ జీరో' కోసం పక్కటెముకలు తీయించుకుంది!
'జెస్సికా రాబిట్'ను పోలిన నాజూకైన నడుమును సొంతం చేసుకునేందుకు ఓ యువతి ఏకంగా ఆరు పక్కటెముకలు తీయించుకుంది. స్వీడన్‌కు చెందిన 25 ఏళ్ల పీక్సీ ఫాక్స్ ఒకప్పుడు మాములు ఎలక్ట్రీషియన్. ఆ తర్వాత మోడల్‌గా మారి.. అమెరికాలోని నార్త్ కరోలినాకు మకాం మార్చింది. ఆ తర్వాత అందంగా కనిపించేందుకు ఎడాపెడా శస్త్రచికిత్సలు చేయించుకుంది. లక్షల రూపాయాలు ఖర్చు చేసి.. ముక్కు, వక్షోజాలు ఇలా అనేక శస్త్రచికిత్సలతో శరీర ఆకృతిని మార్చేసుకుంది. తాజాగా ఈ అమ్మడు ఏకంగా ఆరు పక్కటెముకలు తీయించుకొని.. కేవలం 14 ఇంచుల నడుముతో ఆన్లైన్లో పెట్టిన ఫొటోలు, వీడియోలు హల్చల్ చేస్తున్నాయి.
పిక్సీ స్ఫూర్తిగా తీసుకున్న 'జెస్సికా రాబిట్' అనేది ఓ కార్టూన్ క్యారెక్టర్. డిస్నీ కథ అయిన 'స్లీపింగ్ బ్యూటీ' ఇతివృత్తంగా తీసిన 'వూ సెన్సార్డ్ రోజర్ రాబిట్ అండ్ అరౌరా' సినిమాలో కనిపించే ఈ క్యారెక్టర్ నడుము రెండు అరచేతుల నడుమ ఇమిడిపోతుంది. తను కూడా అలాంటి నడుమును సొంతం చేసుకునేందుకు పిక్సీ ఇండియానాపోలిస్‌లో మొత్తం ఐదు నెలలపాటు శస్త్రచికిత్సలు చేయించుకుంది. మొత్తం ఆరు దిగువ పక్కటెముకలు తీయించుకొని.. అరచేతిలో పట్టే నడుమును సాకారం చేసుకుంది.
ఈ చిట్టి నడుముతో ఈమె ఈ నెల 26న పెట్టిన వీడియోను ఇప్పటికే యూట్యూబ్‌లో 8.5లక్షలమంది చూశారు. రోజర్ రాబిట్, ఇతర సెక్సీ కార్టూన్ క్యారెక్టర్ల తరహాలో శరీర ఆకృతిని మార్చుకొని 'లీవింగ్ కార్టూన్'గా పేరు తెచ్చుకోవడం తన లక్ష్యమని, ఇందుకు అవసరమైన శస్త్రచికిత్సల కోసం విరాళాలు ఇవ్వాలని కోరుతూ 'గో ఫండ్ మి పేజ్'ను కూడా ఆమె ప్రారంభించింది. తర్వాత ఆమె హిప్, బమ్, హైలాష్ శస్త్రచికిత్సలు చేయించుకోనున్నట్టు తెలిపింది.