రిజర్వేషన్లు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం
రౌండ్‌టేబుల్ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
కాకినాడ కలెక్టరేట్ (కాకినాడ రూరల్) :
70 ఏళ్ల స్వాతంత్య్రం అనంతరం కూడా బడుగు, బలహీన వర్గాలకు పూర్తిస్థాయిలో రిజర్వేషన్లు కల్పించడంలో విఫలమై, కులాల కుంపట్లు సృష్టించి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పబ్బం గడిపేస్తున్నాయని సీపీఐ రాష్ట్రlప్రధాన కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గురువారం కాకినాడ ఆర్అండ్బీ అతిథిగృహంలో సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సమస్యలపై ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. అన్ని వర్గాల నుంచి 40 కులసంఘాల ప్రతినిధులు రౌండ్‌టేబుల్ సమావేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయంగా బడుగు, బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపైనే కాకుండా రుగ్మతలపై చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల వల్ల ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు లేకుండా పోతున్నాయన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ సెక్టార్లలో రిజర్వేషన్లు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను పక్కన పెట్టిన ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, విశ్వనాథ్, చొల్లంగి వేణుగోపాల్, ఫణీశ్వరరావు, నులుకుర్తి వెంకటేశ్వరరావు, భాస్కర్, గణేష్‌బాబు, పద్మశ్రీ, రాజేశ్వరరావు తదితరులు మాట్లాడారు.