క్రైం సీరియల్స్ స్ఫూర్తితో హత్యకు పథకం
పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో మంగళవారం వేకువజామున రివాల్వర్ పేలిన ఘటనలో పట్టుబడిన సుదర్శనం రవిదత్తా(29) బుల్లితెరపై వచ్చే క్రైం సీరియల్స్ చూసేవాడు. వాటిని స్ఫూర్తిగా తీసుకొని తాను ఇష్టపడిన మహిళ భర్తను హత్య చేసేందుకు పథక రచన చేసినట్టు పోలీసుల దర్యాప్తు లో వెలుగు చూసింది.
ఆరేళ్లుగా చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టగా, అనూహ్యంగా రివాల్వర్ పేలి పోలీసులకు పట్టుబడి కటకటాల పాలయ్యాడు. విశ్వసనీయ సమాచారం ప్రకా రం.. ఇబ్రహీంపట్నం ఫెర్రి గ్రామానికి చెందిన సుదర్శనం ఆచార్యుడు కుమారులు మారుతీ వరప్రసాద్ (32), రవిదత్తా (25)లు రింగుసెంటర్ వద్ద గల భీమరాజు గుట్టపై ఉన్న దాసాంజనేయ స్వామి ఆలయంలో పూజారులుగా వ్యహరిస్తున్నారు. రవి దత్తా విజయవాడకు చెందిన యువతిని ఓ శుభకార్యంలో చూసి ఇష్టపడ్డాడు.
అప్పటికి తన అన్న వివాహం కాకపోవడంతో ఇష్టపడిన యువతి గురించి కుటుంబ సభ్యులకు తెలపలేదు. తరువాత ఒంగోలుకు చెందిన ఓ యువకునితో 2008లో ఆమెకు వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. ఆ అమ్మాయిని ఎలాగైనా దక్కించుకోవాలని రవి దత్తా నిశ్చయించుకున్నాడు. భర్త ఉంటుండగా ఎలాగూ దక్కదు. అందువల్ల అతడినే చంపేస్తే.. తరువాత పెళ్లి చేసుకుంటే వితంతువును వివాహమాడిన ఘనత తనకే దక్కుతుందని అనుకున్నాడు. ఈ క్రమంలోనే యువతి భర్తతో పరిచయం పెంచుకున్నాడు. అతడిని హత్య చేసేందుకు ఇబ్రహీంపట్నంలో ఆటోడ్రైవర్లు చింతా సతీష్‌బాబు, రమేష్ సాయం కోరాడు. వీరు ముగ్గురూ పలుమా ర్లు ఒంగోలు వెళ్లారు. తొలుత నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి తాడును గొంతుకు బిగించి హత్య చేయాలనుకున్నారు.
పలుమార్లు వీరు బయటకు పిలిచినా యువతి భర్త రాకపోవడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. మరికొన్నిసార్లు రోడ్డుపై నడుస్తూ వేగంగా వెళ్లే వాహనాల కింద తోసేయాలనుకున్నా సాధ్యం కాలేదు. ఇక దూరం నుంచే రివాల్వర్‌తో కాల్చి చంపాలని నిర్ణయించుకున్నారు. మూడు నెలల కిం దట బీహార్ వెళ్లి రివాల్వర్ తీసుకొచ్చారు. సోమవారం ముగ్గురూ కలి సి ఒంగోలు వెళ్లారు. ఆ యువకుణ్ణి కలిసినప్పటికీ చంపేందుకు ధైర్యం చాలకపోవడంతో రాత్రి తిరుగు ప్ర యాణమయ్యారు. వేకువజామున 2.30 గంటల సమయంలో పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో బస్సు దిగి టాయ్‌లెట్స్ వద్దకు వెళ్లారు. సతీష్, రమేష్ మూత్ర విసర్జనకు వెళ్లగా.. రవిదత్తా టాయిలెట్లోకి వెళ్లి లోడ్ చేసి ఉన్న రివాల్వర్‌ను ఆపరేట్ చేస్తుండగా పేలింది.
దీంతో అక్కడే ఉన్న తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామానికి చెందిన బెల్లం వ్యాపారి నిమ్మల వెంకట రమణ తీవ్రంగా గాయపడ్డాడు. సమీపంలో ఉన్న పోలీసులు అప్రమత్తమై రవిదత్తా, సతీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. రమేష్ మాత్రం పరారయ్యాడు. ‘ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. ఇలాంటి శబ్దం వినడం ఇదే మొదటిసారి. ఏం జరిగిందో తెలియక కొద్దిసేపు షాక్‌కు గురయ్యాం’ అంటూ టాయ్‌లెట్స్ వద్ద పని చేసే కొండవీటి శ్రీను, వెంకయ్య తెలి పారు.