మంత్రి తనయుడి కోసం
కర్నూలు (టౌన్) ;
విశాలమైన స్థలం, గాలి వెలుతురు, బాడుగ తక్కువ.. ఇలా అన్ని వసతులున్న భవనాన్ని కాదని ఇరుకు గదులు, పార్కింగ్‌కు ఏమాత్రం అవకాశం లేని భవనంలోకి మారనుంది రిజిస్ట్రేషన్ కార్యాలయం. ఇందుకు సంబంధించిన పనులు ఇప్పటికే ఈ చకచకా సాగుతున్నాయి. జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి తనయుడి కోసం జిల్లా స్టాంప్స్, రిజిస్ట్రేషన్ కార్యాలయ తరలింపు ఏమాత్రం ఇష్టం లేకన్నా...ఇక లాంచనమే. మూడు రోజుల క్రితం ఈ విభాగానికి చెందిన ఉన్నతాధికారి ఆ భవనాన్ని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. జిల్లా స్టాంప్స్, రిజిస్ట్రేషన్ కార్యాలయం గతంలో గౌరిగోపాల్ కాంప్లెక్స్‌లో ఉండేది. పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో ద్విచక్ర, కార్లయజమానులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. దీంతో అక్కడి నుంచి కార్యాలయాన్ని గుత్తి పెట్రోల్ బంకు సమీపంలోని అబ్బాస్‌నగర్, న్యూ హాసింగ్ బోర్డు కాలనీలోని వాణిజ్య సముదాయానికి పదే«ళ్ల క్రితం తరలించారు. అయితే ఇటివల ఓ మంత్రి తనయుడు స్థానిక జిల్లా పరిషత్తు ఎదురుగా ఉన్న ఆర్‌ఎంకె ప్లాజాను కోనుగోలు చేసినట్లు సమాచారం. అక్కడ ఇరుకుగా ఉండటం, వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు ఎలాంటి స్థలం లేకపోవడంతో షాపులు తీసుకునేందుకు ఏ ఒక్కరు ముందుకు రావడంలేదన్నది బహిరంగ రహస్యం. అయితే ఈ వాణిజ్య సముదాయంలో షాపులన్ని పూర్తి కావాలన్న ఉద్దేశ్యంతో జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని తరలించాలని నిర్ణయించారు. అధికారం చేతిలో ఉండటంతో ఉన్నత స్థాయి ఆధికారుల ఆదేశాల మేరకు కార్యాలయ తరలింపునకు రంగం సిద్ధమైంది. ఇప్పుడున్న ఈ సముదాయంలో కార్యాలయానికి రూ. 70 వేలు బాడుగ ఉండగా జిల్లా పరిషత్తు ఎదురుగా ఉన్న కొత్త భవనానికి తరలిస్తే మరింత పెరగనుంది.
భవనాన్ని పరిశీలించిన డీఐజీ
ఆర్‌ఎంకె ప్లాజాను రిజిస్ట్రేషన్ల విభాగం డీఐజీ సాయి ప్రసాద్ మూడు రోజుల క్రితం పరిశీలించారు. ఐజీ ఆదేశాల మేరకు భవనాన్ని తనిఖీ చేసి ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు కార్యాలయ వర్గాలు ధృవీకరించాయి. నెలరోజుల్లో భవన తరలింపు కార్యాక్రమానికి శ్రీకారం చుట్టడం ఖాయమని రిజిస్ట్రేషన్ కార్యాలయ ఉద్యోగులు వెల్లడించారు.