తండ్రికి నివాళిగా ఫొటోగ్రాఫ్ 51
ఒకప్పుడు సినిమాల్లోకి రావాలనుకునేవాళ్లు ముందు రంగస్థలంపై తమ ప్రతిభ నిరూపించుకునేవారు. కొంతమంది కళల పట్ల ఉన్న మక్కువతో రంగస్థల నటీనటులుగా కొనసాగేవాళ్లు. అలాంటి రంగస్థలం సినిమా వచ్చాక దాదాపు కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకుంది. కానీ, సినిమాల్లో రాణిస్తున్న తారల్లో రంగస్థలం మీద ఇంకా మమకారం ఉన్నవాళ్లు ఉన్నారు. అలాంటివాళ్లల్లో హాలీవుడ్ నటి నికోల్ కిడ్మేన్ ఒకరు. ఎప్పుడో పదిహేడేళ్ల క్రితం ఆమె ‘ది బ్లూ రూమ్’ అనే నాటకంలో నటించారు.
లైంగిక దాడుల నేపథ్యంలో సాగే ఆ ప్లేలో నికోల్ నటనను, అప్పటి క్రిటిక్ ‘ప్యూర్ థియేటరికల్ వయాగ్రా’ అని పేర్కొన్నారు. రంగస్థలం మీద మక్కువ ఉన్నప్పటికీ ఆ తర్వాత సరైన అవకాశం రాకపోవడం, గాయనిగా, నటిగా, సినిమాలతో బిజీగా ఉండటంతో మళ్లీ స్టేజిపై కనిపించలేకపోయారు నికోల్. ఇటీవల ఆమెకు ఆ అవకాశం వచ్చింది. ‘ఫొటోగ్రాఫ్ 51’ అనే ప్లేలో నటించారామె. ఇందులో రోజలిండ్ ఫ్రాంక్లిన్ అనే శాస్త్రవేత్తగా నటించారు.
ఈ పాత్ర తనకు చాలా ఆత్మసంతృప్తి మిగిల్చిందని నికోల్ పేర్కొన్నారు. ఎందుకంటే ఆమె తండ్రి పెద్ద పేరున్న శాస్త్రవేత్త. ఏడాది క్రితం ఆయన చనిపోయారు. ఈ ‘ఫోటోగ్రాఫ్ 51’ తన తండ్రికి ఘన నివాళిలా భావిస్తున్నాననీ, చిన్నప్పుడు తండ్రితో సైన్స్ ల్యాబ్లో గడిపిన క్షణాలను ఈ నాటకం గుర్తుచేసిందని నికోల్ తెలిపారు.