కోటికిపైగా నకిలీ నోట్లు స్వాధీనం
అహ్మదాబాద్: గుజరాత్ లోని అమ్రేలిలో పెద్ద మొత్తంలో నకిలీ నోట్లు బయటపడ్డాయి. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపి తనిఖీ చేయగా కోట్లలో నకిలీ కరెన్సీ దొరికింది. విశ్వసనీయ సమాచారం మేరకు అమ్రేలి నగరంలోని లాథీ పోలీసులు గురువారం ఉదయం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా స్కూటీపై అనుమానిత లగేజితో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అడ్డుకున్నారు. వారి వెంట ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా నకిలీ కరెన్సీ కొత్త నోట్లు రూ.500, రూ.2000 ఉన్న రూ.1.11 కోట్లు ఉన్నట్లు గుర్తించారు.
వారిపై ఐపీసీ 489(బి) (సి)తో పాటు 120(బి), 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను భావ్‌నగర్‌కు చెందిన సచిన్ పర్మార్, అమ్రేలిలోని లాథి పట్టణానికి చెందిన పరమేష్ సోలంకిగా గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు తమకు ఆ బ్యాగులను అందజేసి, కొందరికి చేరవేయాలని పురమాయించారని నిందితులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. బహుశా ఆ నగదును అమ్రేలిలోని మార్కెట్లో చెలామణీ చేయటానికి పథకం వేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.