అతడి వాలకం చూసి.. పెళ్లి వద్దన్న వధువు
భువనేశ్వర్: కాబోయే భర్త మద్యానికి బానిసయ్యాడని తెలిసిన ఓ వధువు ఆ పెళ్లిని నిరాకరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను ఈ వివాహం చేసుకోనని తెగేసి చెప్పడంతో ఆఖరి నిమిషంలో వివాహం రద్దు అయ్యింది. సంచలనం సృష్టించిన ఈ ఘటన ఒడిశాలో మంగళవారం జరిగింది.
పశ్చిమ ఒడిశాలోని సంబల్పూర్ జిల్లా జుజుమురా సమితి గోవర్ధన్ బడమల్ గ్రామంలో మంగళవారం ఓ వివాహం జరుగుతోంది. వరుడు పూటుగా మద్యం తాగి వచ్చాడు. అతను తూలిపోతూ కనీసం తాళి కూడా కట్టలేకపోయాడు. ఇది చూసిన వధువు అతనితో పెళ్లి వద్దని పీటల మీద నుంచి లేచి వచ్చేసింది. దీంతో అబ్బాయి తరఫు వారు వధువుని కాసేపు బతిమలాడారు. కానీ వధువు మాత్రం పెళ్లి సమయంలో ఇలా తాగివచ్చిన వాడితో తాను జీవితాన్ని పంచుకోలేనని స్పష్టం చేసింది. చేసేదేమిలేక చివరి నిమిషంలో పెళ్లిని రద్దు చేశారు. వరుడు, అతడి కుటుంబ సభ్యులు తమకు ఇచ్చిన కట్నకానులను తిరిగిచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తాగుబోతును పెళ్లి చేసుకోనని కరాకండీగా చెప్పేసిన వధువును పలువురు అభినందించారు.