గ్యాంగ్‌స్టర్ అని ఎప్పుడూ చెప్పలేదు
హరియాణా పోలీసుల ఎన్కౌంటర్లో హతమైన గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలి గ్యాంగ్‌స్టర్ అన్న విషయం అంతకుముందు తనకు తెలియదని అతని గాళ్‌ఫ్రెండ్ దివ్యా పాహుజ చెప్పింది. సందీప్ ఎన్కౌంటర్ కేసులో తనకు సంబంధంలేదని కోర్టులో వెల్లడించింది.
గత ఫిబ్రవరిలో ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఓ హోటల్లో ఉన్న సందీప్‌ను గుర్గావ్ పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ పేరుతో చంపినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో హోటల్ గదిలో దివ్య కూడా ఉందని, సందీప్ వివరాలను ఆమే గుర్గావ్ పోలీసులకు చేరవేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును ముంబై పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారిస్తోంది. ముంబై పోలీసులు.. గుర్గావ్ ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లతో పాటు దివ్యా పాహుజ, ఆమె తల్లి సోనియాను అరెస్ట్ చేశారు. దివ్యను మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు.
సందీప్ తన పేరు రిషబ్ అని పరిచయం చేసుకున్నాడని, గ్యాంగ్‌స్టర్ అనే విషయం ఎప్పుడూ చెప్పలేదని దివ్య కోర్టులో చెప్పింది. ఈ కేసులో తన పేరును ఇరికించాక తన జీవితం నాశనమైందని, తన స్నేహితులు దూరమయ్యారని, ఎవరూ మాట్లాడటం లేదని, ఉద్యోగం కోల్పోయానని, జైలు జీవితం అనుభవిస్తున్నానంటూ దివ్య కోర్టులో విలపించింది. ఇద్దరికీ స్నేహితుడైన మనీష్ ద్వారా సందీప్ పరిచయమయ్యాడని, ఓ రోజు ఫోన్ చేస్తే వెళ్లి కలిశానని అంతకుమించి తనకు ఏమీ తెలియదని కోర్టుకు విన్నవించింది. సందీప్ ఉన్న హోటల్ పేరు, గది నెంబర్ పోలీసులకు చెప్పలేదని, అతను వేరే పేరుమీద హోటల్ గది తీసుకున్నాడని, అతను గ్యాంగ్‌స్టర్ అని, నేరచరిత్ర ఉన్నట్టు తనకు ఏమాత్రం తెలియదని దివ్య చెప్పింది. తన వాళ్లు ఎవరూ ఇక్కడలేరని, సాయం చేసేవాళ్లు కూడా లేరని విలపించింది.