‘సంకురాత్రి’ సేవలు అభినందనీయం
జనసేన అధినేత పవన్కళ్యాణ్
కాకినాడ రూరల్:
సంకురాత్రి ఫౌండేషన్ అధినేత సంకురాత్రి చంద్రశేఖర్ జీవిత భాగస్వామితో పాటు సర్వం కోల్పోయి ఆత్మసై్థర్యంతో లోకమంతా తన కుటుంబమేనని ప్రజా సేవలో నిమగ్నమవడం ఆనందదాయకమని సినీ నటుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ అన్నారు. శనివారం కాకినాడ రూరల్ మండలం పెనుమర్తిలోని కిరణ్కంటి ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ గత ఎనిమిది దేళ్లుగా కిరణ్కంటి ఆసుపత్రి ద్వారా చంద్రశేఖర్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఎంతో మంది అనాథలకు, బడుగు వర్గాల ప్రజలకు ప్రాథమిక విద్యతో పాటు ప్రాథమిక ఆరోగ్యం అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేయడం సామాన్య విషయం కాదన్నారు. గత 26 ఏళ్లలో 2.50 లక్షల మందికి కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించి, 25 లక్షల మందికి సేవలందించడం ప్రశంసనీయమన్నారు. చంద్రశేఖర్ పాదాలకు అభివందనం చేశారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో చదువుతున్న విద్యార్థులతో పవన్ కొద్దిసేపు ముచ్చటించారు. ముందుగా ఆసుపత్రి ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం జిల్లా రోటరీక్లబ్, మిచిగన్ రోటరీ క్లబ్ ద్వారా గ్లోబల్ గ్రాంట్ 1,000 కంటి శస్త్ర చికిత్సల కార్యక్రమాన్ని, జిల్లాలో ఏర్పాటు చేసే రెండు విజన్ సెంటర్లను ఆయన ప్రారంభించారు. తుమ్మలపల్లి సాయి చంద్రశేఖర్, ముమ్మిడి మురళి, తుమ్మలపల్లి బాబు, సంగీతసాయి గుణరాజన్, కడలి శివ, కాద సతీష్, కామిరెడ్డి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.