నేత్రపర్వంగా సుబ్రహ్మణ్యేశ్వర శాంతి కల్యాణం
ఘనంగా ప్రారంభమైన పీఠం 44వ వార్షికోత్సవాలు
వెదురుపాక(రాయవరం): మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠం 44వ వార్షికోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏటా ఆగస్టు 16 నుంచి 18 వరకు వీటిని నిర్వహిస్తున్న విషయం పాఠకులకు విదితమే. దీనిలో భాగంగా తొలిరోజు మంగళవారం పీఠాధిపతి వాడ్రేవు వెంకటసుబ్రహ్మణ్యం(గాడ్) సతీమణి సీతమ్మ జ్యోతిప్రజ్వలన చేసి వార్షికోత్సవాలను ప్రారంభించారు. పీఠంలో కొలువైన విజయదుర్గా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
నేత్రపర్వంగా సుబ్రహ్మణ్యేశ్వర కల్యాణం..
విజయదుర్గా పీఠంలో వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి శాంతి కల్యాణం నేత్వపర్వంగా సాగింది. సాయంత్రం ఆరు గంటలకు తమిళనాడు తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి చెందిన సంపత్గురుకుల్, గోపిగురుకుల్ అర్చకత్వంలో స్వామివారు, దేవేర్లకు శాస్త్రోక్తంగా కల్యాణం, పలు పూజలు నిర్వహించారు. ఉదయం త్రిశతిపూజ, హోమం నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించి పీఠాధిపతి గాడ్ ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో విశాఖపట్నం టౌన్‌ప్లానింగ్ అధికారి సంజీవ్‌కుమార్, వ్యాపారవేత్త ద్రోణంరాజు లక్ష్మీనారాయణ, కోట అసోసియేట్స్ అధినేత కోట సునీల్‌కుమార్, హిందూ ధర్మ పరిరక్షణ సమితి రీజనల్ కోఆర్డినేటర్ కందర్ప హనుమాన్, వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖులు పూజల్లో పాల్గొన్నారు. భక్తులకు పీఠం అడ్మినిస్ట్రేటర్ వి.వి.బాపిరాజు, పీఠం పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్(బాబి) ఆధ్వర్యంలో భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు.
ఆకట్టుకున్న అమ్మవారి విగ్రహం..
మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో విశాఖపట్నం నుంచి 14 అడుగుల దుర్గాదేవి విగ్రహాన్ని తీసుకుని వచ్చి భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేశారు. విగ్రహాన్ని గాడ్ ఆవిష్కరించి పూజాధికాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన 14 అడుగుల విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.