ముంబై తీరంలో గ్యాస్ లీకేజీ
తక్షణమే భద్రత చర్యలు చేపట్టిన ఓఎన్జీసీ
న్యూఢిల్లీ: ముంబై సముద్ర తీరంలో ప్రభుత్వరంగ సంస్థ ఓఎన్జీసీకి చెందిన చమురు, సహజవాయు క్షేత్రంలోని ‘ఎన్ఎస్’ అనే గ్యాస్ బావిలో శనివారం సర్వీసింగ్ జరుపుతుండగా భారీ స్థాయిలో గ్యాస్ లీక్ అయింది. భారీ ఒత్తిడితో, అత్యంత జ్వలనశీలత కలిగిన గ్యాస్ లీక్ కావడంతో ఓఎన్జీసీ వెంటనే భద్రత చర్యలు చేపట్టింది. చమురు క్షేత్రం వద్ద ఉన్న 82 మందిలో అత్యవసరం కాని 42 మంది సిబ్బందిని అక్కడి నుంచి పంపించేసింది. ‘ఓఎన్జీసీకి చెందిన సాగర్ ఉదయ్ అనే రిగ్తో చమురు బావిని సర్వీసింగ్ చేస్తుండగా లీకేజీని గుర్తించాం’ అని ఓఎన్జీసీ ప్రతినిధి తెలిపారు. ఎక్కడినుంచి గ్యాస్ లీక్ అవుతుందో గుర్తించగానే మరమ్మతు ప్రారంభిస్తామన్నారు. సంస్థకు చెందిన సంక్షోభ నివారణ బృందం ఘటనస్థలికి చేరుకుంది. పరిస్థితి విషమిస్తే రంగంలోకి దిగడానికి భారత నౌకాదళం, తీర రక్షక దళాలకు చెందిన రెండు నౌకలూ ఆప్రాంతానికి బయల్దేరాయి. రెండు హెలికాప్టర్లనూ సిద్ధంగా ఉంచినట్లు నౌకాదళ వర్గాలు తెలిపాయి. అయితే, అది బ్లోఅవుట్ కాదని, కేవలం గ్యాస్ లీకేజీనేనని, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని సంస్థ వర్గాలు వెల్లడించాయి.