నిద్రలేవగానే కీళ్లనొప్పి...!
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్
నా వయసు 58 ఏళ్లు. రెండు వారాల నుంచి నేను ఉదయం నిద్రలేచిన వెంటనే నడవడం చాలా కష్టంగా ఉంటోంది. కీళ్లనొప్పి, వాపు, బిగుసుకుపోవడం, కాళ్లలో బలహీనత, మొద్దుబారడం జరుగుతోంది. ఇలా ఎందుకు జరుగుతోంది? నాకు తగిన సలహా ఇవ్వండి.
- కె. బలరామ్, కొత్తగూడెం
మీరు తెలిపిన లక్షణాలను బట్టి మీరు ఆస్టియో ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కీళ్లలోని కార్టిలేజ్ అనే మృదులాస్థి అరుగుదలకు గురికావడం, తద్వారా చుట్టూ ఉన్న కణజాలంపై అరుగుదల ప్రభావం పడటాన్ని ఆస్టియో ఆర్థరైటిస్‌గా పేర్కొంటారు. ఇది 40 ఏళ్ల వయసు దాటిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఇది ఎక్కువ. ఎక్కువగా మోకాలిలో కనిపించే సమస్య అయినప్పటికీ చేతివేళ్లు, వెన్నుపూస, తుంటి ప్రాంతం, కాలివేళ్లలోనూ ఆస్టియో ఆర్థరైటిస్ తలెత్తే అవకాశం ఉంది.
ఈ సమస్య సాధారణంగా గతంలో కీళ్లకు ఏదైనా దెబ్బ తగిలి ఉండటం, అధిక బరువు, కాళ్ల ఎదుగుదలలో హెచ్చుతగ్గులు ఉండటం, కీళ్లపై అధిక ఒత్తిడి కలిగించే పనులు చేయడం వంటివి కారణాలు. కొందరిలో వంశపారంపర్యంగానూ ఈ సమస్య కనిపించవచ్చు. మీరు కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాలి. రక్తపరీక్ష, మోకాలి నుంచి కొద్దిగా ద్రవాన్ని తీసి పరీక్షించడం, ఎక్స్-రే, సీటీ స్కాన్ వంటి పరీక్షల ద్వారా ఈ సమస్యను నిర్ధారణ చేయవచ్చు. మీకు దగ్గర్లోని వైద్య నిపుణులను సంప్రదించండి.
- డా. ప్రవీణ్ మేరెడ్డి
ఆర్థోపెడిక్ సర్జన్,కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
హోమియో కౌన్సెలింగ్
నా వయసు 52 ఏళ్లు. నాకు చాలాకాలంగా తలలో, ముఖం మీద, కనురెప్పల దగ్గర చర్మం ఎర్రటి, తెల్లటి పొరలతో దురదగా ఉంటోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే సెబోరిక్ డర్మటైటిస్ అని చెప్పారు. మందులు వాడితే సమస్య తగ్గుతోంది, కానీ మళ్లీ కొంతకాలానికే తిరగబెడుతోంది. అసలు సమస్య ఎందుకు వస్తోంది? హోమియోలో ఈ సమస్యకు పూర్తి పరిష్కారం లభించే అవకాశం ఉందా? సలహా ఇవ్వండి.
- పురుషోత్తమరావు, మంచిర్యాల
చర్మంలో సెబేషియస్ గ్రంథులు ఎక్కువగా ఉండే భాగాలు ఎర్రగా మారడంతో పాటు, దురదతో ఈ వ్యాధి కనిపిస్తుంటుంది. సాధారణంగా ఇది దీర్ఘకాలిక సమస్య. ఇది 30 నుంచి 70 ఏళ్ల వారితో పాటు మూడు నెలల శిశువులలోనూ కనిపిస్తుంది. వీళ్లలో 6 నుంచి 12 నెల వయసు వరకు ఇది తగ్గిపోతుంటుంది. తలలో వచ్చే తేలికపాటి సెబోరిక్ డర్మటైటిస్‌ని చుండ్రు అని అంటారు. ఇది ఎక్కువ మందిని వేధించే సమస్య. ఈ వ్యాధి ఎక్కువగా తల, ముఖం, ఛాతీ, వీపు, చెవి లోపలి భాగాలతో పాటు వెంట్రుకలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో కనిపిస్తుంటుంది.
కారణాలు : ఈ వ్యాధికి కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. కానీ చర్మంలోని సెబేషియస్ గ్రంథులు ఎక్కువగా ఉన్న చోట మలసేజియా అనే ఒక రకం జీవజాతి అధికంగా అభివృద్ధి చెంది కొన్ని హానికరమైన పదార్థాలను విడుదల చేస్తుంది. ఈ అంశం సెబోరిక్ డర్మటైటిస్‌ను ప్రేరేపిస్తుంది.
* రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉండే హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుల్లోనూ, పార్కిన్సన్ వ్యాధిగ్రస్తుల్లోనూ ఇది కనిపించే అవకాశాలు ఎక్కువ.
* మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండేవారిలో, జిడ్డు చర్మం ఉండేవారిలో ఇది కనిపించే అవకాశాలు అధికం.
* వాతావరణం, హార్మోన్ సమస్యలు, కొన్ని జన్యుపరమైన అంశాలు ఈ వ్యాధిని ప్రభావితం చేయవచ్చు.
లక్షణాలు : సెబోరిక్ డర్మటైటిస్ లక్షణాలు క్రమంగా ఏర్పడతాయి చర్మంపై ఎర్రటి, తెల్లటి లేదా పసుపు వర్ణంలో పొరలు ఏర్పడతాయి. దురద, మంట కనిపిస్తుంటుంది దీని తీవ్రత సాధారణంగా చలికాలంలో ఎక్కవగానూ, వేసవిలో ఒకింత తక్కువగానూ ఉంటుంది.
చిన్నపిల్లల్లో : తలపై చర్మం జిడ్డుగా, పొరలుగా, ఎర్రటి దద్దుర్లలా కనిపిస్తాయి. దీనినే ‘క్రెడిల్ క్యాప్’ అని అంటారు. ఇది చంకలకు, గజ్జలకు వ్యాపిస్తుంది. వీళ్లలో దురద ఎక్కువగా ఉండకపోవచ్చు.
నిర్ధారణ : వ్యాధి లక్షణాలను బట్టి దీన్ని గుర్తించవచ్చు. ఇది సోరియాసిస్‌ను పోలి ఉంటుంది. కానీ సోరియాసిన్ ముఖాన్ని ప్రభావితం చేయకపోవడం వల్ల ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించవచ్చు.
* మీరు ఆందోళన చెందకండి. ఆధునిక జెనెటిక్ కాన్స్టిట్యూషన్ చికిత్స ద్వారా రోగనిరోధక శక్తిని సరిచేయడం వల్ల సెబోరిక్ డర్మటైటిస్‌ను పూర్తిగా నయం చేయవచ్చు.
- డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్
ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్,హైదరాబాద్
యూరాలజీ కౌన్సెలింగ్
నా వయసు 40 ఏళ్లు. నేను ఉద్యోగం చేస్తుంటాను. చాలాకాలం నుంచి నాకు వేసవి కాలంలో మూత్రమార్గంలో ఇన్ఫెక్షన్ వస్తోంది. ఈ కాలంలోనే మూత్ర విసర్జన సమయంలో మంట, కొద్దికొద్దిగా రావడం, నొప్పి వంటివి వస్తున్నాయి. ప్రతి ఏటా డాక్టర్‌ను ఇలా సంప్రదించడం, మందులు వాడటం పరిపాటిగా మారింది. ఎందుకిలా జరుగుతోంది. దయచేసి కారణాలు వివరించండి.
- రాణి, హైదరాబాద్
మూత్రమార్గంలో ఇన్ఫెక్షన్ రావడానికి ప్రధాన కారణం ‘ఈ-కొలై’ అనే బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా బయట వాతావరణంలోనే ఉంటుంది. ఇది మూత్రవిసర్జన సమయంలో గానీ లేదా సెక్స్ వల్లగాని మూత్రనాళాల్లోకి వెళ్లినప్పుడు కిడ్నీకి సైతం దీనివల్ల అత్యంత ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇందులో ‘క్లెబ్సియల్లా, ఇంటరోకోకస్ ఫైకలిస్’ అనే రెండు బ్యాక్టీరియాలు చాలా కీడు చేసేవి. యాంటీబయాటిక్స్ లాంటి మందులకు కూడా ఇవి లొంగవు. ఇటీవలి అధ్యయనాల వల్ల 55 ఏళ్ల లోపు వయసు ఉన్న మహిళల్లో 50 శాతం మంది దీని బారిన పడుతున్నట్లు తెలుస్తోంది.
డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశాలు వేసవిలోనే ఎక్కువ కాబట్టి మూత్రమార్గంలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వేసవిలోనే వస్తుంటాయి. సాధారణంగా మంచినీళ్లు ఎక్కువగా తాగని వారు ఈ కాలంలోనూ అదే ధోరణిని కొనసాగిస్తుంటారు. దాంతో కిడ్నీలకు సరైన మంచినీరు అందక అవి శరీర మలినాలను సరిగా శుద్ధి చేయలేవు. ఫలితంగా ఇన్ఫెక్షన్ పెరుకుపోయి మంట పుట్టడం, నొప్పి రావడంతో పాటు కొద్దికొద్దిగా మూత్రం వస్తూ ఇబ్బందులకు గురిచేస్తుంది.
దీనికి తోడు శారీరక శ్రమ ఉండటం, పని ఒత్తిడికి లోనై నీళ్లు చాలాసేపు తాగకపోవడం వల్ల మూత్రనాళల్లో ఉన్న మూత్రం అలాగే కొన్ని గంటల పాటు ఉండటంతో బ్యాక్టీరియాకు అవి నివాస కేంద్రాలుగా మారి ఇన్ఫెక్షన్కు కారణమవుతుంటాయి. మూత్ర సంబంధిత సమస్యలను సాధారణంగా వైద్యులు మందులతోనే తగ్గిస్తుంటారు. మీరు మరోసారి మీ డాక్టర్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి.
- డా.ఎ.సూరిబాబు