second win
-
దీపిక ‘హ్యాట్రిక్’
మస్కట్ (ఒమన్): జూనియర్ మహిళల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మలేసియా జట్టుతో సోమవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్‌లో జ్యోతి సింగ్ నేతృత్వంలోని భారత జట్టు 5–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీపిక మూడు గోల్స్‌తో ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. దీపిక 37వ, 39వ, 48వ నిమిషాల్లో గోల్స్ చేసింది. వైష్ణవి ఫాల్కే (32వ నిమిషంలో), కనిక సివాచ్ (38వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. మ్యాచ్ మొత్తంలో భారత జట్టుకు ఎనిమిది పెనాల్టీ కార్నర్లు... రెండు పెనాలీ స్ట్రోక్‌లు లభించాయి. ఇందులో మూడు పెనాల్టీ కార్నర్లను, ఒక పెనాల్టీ స్ట్రోక్‌ను భారత జట్టు గోల్స్‌గా మలిచింది. మిగతా ఐదు పెనాల్టీ కార్నర్లను, మరో పెనాల్టీ స్ట్రోక్‌ను భారత్ లక్ష్యానికి చేర్చి ఉంటే విజయం తేడా మరింత భారీగా ఉండేది. మరో మ్యాచ్‌లో దక్షిణ కొరియా 7–2 గోల్స్ తేడాతో చైనీస్ తైపీ జట్టును ఓడించింది. ఐదు జట్లున్న గ్రూప్ ‘ఎ’లో రెండేసి విజయాలు సాధించిన భారత్, చైనా జట్ల ఖాతాలో ఆరు పాయింట్ల చొప్పున ఉన్నాయి. అయితే చైనా చేసిన గోల్స్ (27) సంఖ్యకంటే భారత్ చేసిన గోల్స్ (17) తక్కువగా ఉండటంతో చైనా టాప్ ర్యాంక్‌లో, భారత్ రెండో ర్యాంక్‌లో ఉన్నాయి. బుధవారం జరిగే మూడో లీగ్ మ్యాచ్‌లో చైనాతో భారత్ తలపడుతుంది. -
మూడు మ్యాచ్ పాయింట్లు కాపాడుకొని భారత్ గెలుపు
చాంగ్షా (చైనా): బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా మహిళల టీమ్ టెన్నిస్ టోర్నీలో భారత జట్టు రెండో విజయం సాధించింది. చైనీస్ తైపీతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 2–1తో నెగ్గింది. తొలి మ్యాచ్‌లో రుతుజా భోస్లే 6–3, 6–2తో హావో చింగ్ చాన్‌ను ఓడించింది. రెండో మ్యాచ్ లో అంకిత రైనా 6–2, 4–6, 4–6తో ఎన్ షువో లియాంగ్ చేతిలో ఓటమి పాలైంది. నిర్ణాయక మూడో మ్యాచ్‌లో అంకిత–ప్రార్థన జోడీ 4–6, 6–1, 15–13తో హావో చింగ్ చాన్–ఎన్ షువో లియాంగ్ జంటపై గెలిచి భారత్‌కు విజయాన్ని అందించింది. టైబ్రేక్‌లో అంకిత జోడీ మూడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకోవడం విశేషం. -
ప్రజ్ఞానందకు రెండో విజయం
ప్రాగ్ మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద రెండో విజయం నమోదు చేశాడు. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ విదిత్ సంతోష్ గుజరాతితో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో ప్రజ్ఞానంద 52 ఎత్తుల్లో గెలిచాడు. డేవిడ్ నవారా (చెక్ రిపబ్లిక్)తో జరిగిన గేమ్‌లో భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ 61 ఎత్తుల్లో ఓడిపోయాడు. ఐదో రౌండ్ తర్వాత ప్రజ్ఞానంద, గుకేశ్ 2.5 పాయింట్లతో వరుసగా నాలుగో, ఐదో ర్యాంక్‌లో ఉన్నారు. -
WPL 2023: ముంబై సూపర్ షో
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్ ధనాధన్ ఆల్‌రౌండ్ షోతో వరుసగా రెండో విజయం సాధించింది. సోమవారం జరిగిన పోరులో 9 వికెట్ల తేడాతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌ను చిత్తు చేసింది. బౌలింగ్‌లో 3 వికెట్లు పడగొట్టిన హేలీ మాథ్యూస్ బ్యాటింగ్‌లో (38 బంతుల్లో 77 నాటౌట్; 13 ఫోర్లు, 1 సిక్స్) ఆకాశమే హద్దుగా చెలరేగింది. టాపార్డర్ బ్యాటర్ నట్ సీవర్ బ్రంట్ (29 బంతుల్లో 55 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) కూడా మెరుపు అర్ధ సెంచరీ సాధించడంతో ఛేదన సులువైంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 18.4 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. రిచా ఘోష్ (26 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా, సయిక ఇషాక్, అమెలియా కెర్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ హేలీ, బ్రంట్‌ల అజేయ అర్ధ సెంచరీలతో 14.2 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 159 పరుగులు చేసింది. అందరూ అంతంతే! బెంగళూరు స్కోరైతే 150 దాటింది కానీ... ఏ ఒక్క బ్యాటర్‌ది చెప్పుకోదగ్గ స్కోరుగానీ, ఇన్నింగ్స్‌ను కుదుటపర్చిన భాగస్వామ్యంగానీ లేవు. అదే బెంగళూరు పాలిట శాపమైంది. కెప్టెన్, ఓపెనర్ స్మృతి మంధాన (17 బంతుల్లో 23; 5 ఫోర్లు) మొదలు మేగన్ షట్ (14 బంతుల్లో 20; 3 ఫోర్లు) దాకా ఐదుగురు బ్యాటర్లు రిచా, కనిక ఆహుజా (13 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయాంక పాటిల్ (15 బంతుల్లో 23; 4 ఫోర్లు) 20 పైచిలుకు పరుగులు చేశారు. అందరు ఇలా వచ్చి అలా షాట్లు బాదేసి పెవిలియన్‌కు వెళ్లినవారే! ఇందులో ఏ ఒక్కరు నిలబడినా, మెరుపుల భాగస్వామ్యం నమోదైనా పరిస్థితి మరోలా ఉండేది. అయితే ముంబై బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టడంలో సమష్టిగా సఫలమయ్యారు. హేలీ, బ్రంట్ ఫిఫ్టీ–ఫిఫ్టీ ముంబై ముందున్న లక్ష్యం 156 పరుగులు. అంత సులభమైందేమీ కాదు. కానీ యస్తిక భాటియా (19 బంతుల్లో 23; 4 ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన హేలీ మాథ్యూస్ తొలి ఓవర్ నుంచే ఎదురుదాడికి దిగింది. స్కోరు జోరందుకున్న సమయంలో యస్తికను ప్రీతి బోస్ వికెట్ ముందు దొరకబుచ్చుకుంది. 45 పరుగుల వద్ద తొలి వికెట్ కూలగా, బెంగళూరుకు అదే ఆఖరి ఆనందం అయ్యింది. తర్వాత నట్ సీవర్ వచ్చాక హేలీ వేగం మరో దశకు చేరింది. బెంగళూరు కెప్టెన్ బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా ఫలితం లేకపోయింది. అటు బ్రంట్, ఇటు హేలీ బౌండరీలను అవలీలగా బాదేస్తుంటే ఆద్యంతం ‘పవర్ ప్లే’నే కనిపించింది. పదో ఓవర్లోనే హేలీ 26 బంతుల్లో (8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. 10.2 ఓవర్లోనే జట్టు స్కోరు 100 దాటింది. మేగన్ షట్ వేసిన 12, శ్రేయాంక పాటిల్ వేసిన 13వ ఓవర్లలో బ్రంట్, హేలీలు ఫోర్లతో చెలరేగిపోయారు. దీంతో ఈ రెండు ఓవర్లలోనే ముంబై 40 పరుగులు చేయడంతో లక్ష్యాన్ని 5.4 ఓవర్ల ముందే ఛేదించింది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి మంధాన (సి) వాంగ్ (బి) హేలీ 23; సోఫీ (సి) అమన్‌జోత్ (బి) సయిక 16; దిశ (బి) సయిక 0; ఎలైస్ పెర్రీ రనౌట్ 13; హీథెర్‌నైట్ (బి) హేలీ 0; రిచాఘోష్ (సి) నట్ సీవర్ (బి) హేలీ 28; కనిక (సి) యస్తిక (బి) పూజ 22; శ్రేయాంక (ఎల్బీ) (బి) నట్ సీవర్ 23; మేగన్ (స్టంప్డ్) యస్తిక (బి) అమెలియా 20; రేణుక (బి) అమెలియా 2; ప్రీతి నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (18.4 ఓవర్లలో ఆలౌట్) 155. వికెట్ల పతనం: 1–39, 2–39, 3–43, 4–43, 5–71, 6–105, 7–112, 8–146, 9–154, 10–155. బౌలింగ్: హేలీ 4–0–28–3, నట్ సీవర్ 3–0–34–1, సయిక ఇషాక్ 4–0–26–2, ఇసి వాంగ్ 2–0–18–0, అమెలియా కెర్ 3.4–0–30–2, కలిత 1–0–10–0, పూజ 1–0–8–1. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: హేలీ మాథ్యూస్ నాటౌట్ 77; యస్తిక (ఎల్బీ) (బి) ప్రీతి 23; నట్ సీవర్ నాటౌట్ 55; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (14.2 ఓవర్లలో వికెట్ నష్టానికి) 159. వికెట్ల పతనం: 1–45. బౌలింగ్: రేణుక 3–0–28–0, ప్రీతి బోస్ 4–0–34–1, మేగన్ షట్ 3–0–32–0, ఎలైస్ పెర్రీ 1.2–0–18–0, శ్రేయాంక 2–0–32–0, సోఫీ డివైన్ 1–0–11–0. డబ్ల్యూపీఎల్‌లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్ X లక్నో విజార్డ్స్ రాత్రి గం. 7:30 నుంచి స్పోర్ట్స్ 18 చానెల్లో, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం. -
Pro Kabaddi 2022: తెలుగు టైటాన్స్ గెలుపు
సాక్షి, హైదరాబాద్: వరుసగా 11 పరాజయాల తర్వాత ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు రెండో విజయం అందుకుంది. శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 32–26తో యు ముంబాను ఓడించింది. టైటాన్స్ తరఫున సిద్ధార్థ్ దేశాయ్ తొమ్మిది పాయింట్లు, అభిషేక్ ఐదు పాయింట్లు, విశాల్ భరద్వాజ్ నాలుగు పాయింట్లు స్కోరు చేశారు. యు ముంబా తరఫున గుమన్ సింగ్ ఎనిమిది పాయింట్లతో రాణించాడు. ఇతర మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీ 30–27తో పట్నా పైరేట్స్‌పై... జైపూర్ పింక్ పాంథర్స్ 42–29తో యూపీ యోధాస్‌పై గెలిచాయి. -
Chess Olympiad 2022: భారత జట్ల జోరు
చెన్నై: చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్లు వరుసగా రెండో విజయం నమోదు చేశాయి. శనివారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో ఓపెన్ విభాగంలో భారత్ ‘ఎ’ 3.5–0.5తో మాల్డోవాపై, భారత్ ‘బి’ 4–0తో ఎస్తోనియాపై, భారత్ ‘సి’ 3.5–0.5తో మెక్సికోపై గెలుపొందాయి. మహిళల విభాగం రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో కోనేరు హంపి, తానియా సచ్దేవ్, వైశాలి, భక్తి కులకర్ణిలతో కూడిన భారత్ ‘ఎ’ 3.5–0.5తో అర్జెంటీనాపై, భారత్ ‘బి’ 3.5–0.5తో లాత్వియాపై, భారత్ ‘సి’ 3–1తో సింగపూర్‌పై విజయం సాధించాయి. మరీసా (అర్జెంటీనా)తో జరిగిన గేమ్‌ను ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ హంపి 44 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా... అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) తానియా సచ్దేవ్ 36 ఎత్తుల్లో అనాపవోలాపై, వైశాలి 90 ఎత్తుల్లో మరియా జోస్పై, భక్తి కులకర్ణి 44 ఎత్తుల్లో మరియా బెలెన్‌పై గెలిచారు. ఓపెన్ విభాగంలో భారత్ ‘ఎ’కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ తన ప్రత్యర్థి ఇవాన్ షిట్కోపై నెగ్గగా... తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ తన ప్రత్యర్థి మెకోవరితో గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. -
Norway chess: ఆనంద్‌కు మరో విజయం
స్టావెంగర్: నార్వే చెస్ టోర్నమెంట్లో భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేశాడు. బుధవారం రాత్రి జరిగిన క్లాసికల్ విభాగం రెండో రౌండ్లో ఆనంద్ 36 ఎత్తుల్లోనే బల్గేరియాకు చెందిన వసెలిన్ తొపలోవ్‌పై విజయం సాధించాడు. ఐదు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన 52 ఏళ్ల ఆనంద్ 10 మంది పాల్గొంటున్న ఈ టోర్నీలో ప్రస్తుతం 6 పాయింట్లతో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. మరో పోరులో మాగ్నస్ కార్ల్‌సన్‌ను అమెరికాకు చెందిన వెస్లీ సో చిత్తు చేశాడు. వీరిద్దరి మధ్య జరిగిన గేమ్ 38 ఎత్తుల్లో డ్రాగా ముగియగా ‘సడెన్ డెత్’లో వెస్లీకి విజయం లభించింది. -
IPL 2022: రసెల్ విధ్వంసం
ముంబై: సుదీర్ఘకాలం తర్వాత ఆండ్రీ రసెల్ తనదైన శైలిలో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడటంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)కు ఐపీఎల్లో రెండో విజయం దక్కింది. శుక్రవారం జరిగిన పోరులో కేకేఆర్ 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ 18.2 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. భానుక రాజపక్స (9 బంతుల్లో 31; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడగా... కగిసో రబడ (16 బంతుల్లో 25; 4 ఫోర్లు, 1 సిక్స్) కీలక పరుగులు జోడించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఉమేశ్ యాదవ్ (4/23) నాలుగు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అనంతరం కోల్‌కతా 14.3 ఓవర్లలో 4 వికెట్లకు 141 పరుగులు చేసి గెలిచింది. ఆండ్రీ రసెల్ (31 బంతుల్లో 70 నాటౌట్; 2 ఫోర్లు, 8 సిక్స్‌లు) విధ్వంసక బ్యాటింగ్‌తో జట్టును గెలిపించాడు. సమష్టి వైఫల్యం... శివమ్ మావి వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్... తొలి నాలుగు బంతుల్లో వరుసగా 4, 6, 6, 6 బాదిన రాజపక్స... ఐదో బంతికి అవుట్! పదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రబడ ఒకదశలో వరుసగా తాను ఎదుర్కొన్న ఆరు బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో చెలరేగాడు! పంజాబ్ ఇన్నింగ్స్‌లో ఈ రెండూ మినహా చెప్పుకునేందుకు ఏమీ లేదు. తొలి ఓవర్లోనే మయాంక్ (1) వెనుదిరగ్గా, ధావన్ (16) విఫలమయ్యాడు. లివింగ్‌స్టోన్ (19),షారుఖ్ (0) ప్రభావం చూపలేదు. 102/8తో ఉన్న పంజాబ్ స్కోరు చివర్లో రబడ దూకుడుతో 137 వరకు చేరింది. మెరుపు బ్యాటింగ్... ఛేదనలో కోల్‌కతా కూడా తడబడింది. ఓపెనర్లు రహానే (12), వెంకటేశ్ (3) విఫలమయ్యారు. శ్రేయస్ అయ్యర్ (15 బంతుల్లో 26; 5 ఫోర్లు) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా ఎక్కువసేపు నిలవకపోగా, వెంటనే నితీశ్ రాణా (0) డకౌటయ్యాడు. స్కోరు 51/4 వద్ద నిలిచిన ఈ దశలో బిల్లింగ్స్, రసెల్ భాగస్వామ్యం జట్టును విజయం దిశగా నడిపించింది. ముఖ్యంగా రసెల్ సిక్సర్ల జోరులో పంజాబ్ కుదేలైంది. హర్‌ప్రీత్ ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన రసెల్... స్మిత్ ఓవర్లో ఏకంగా 3 సిక్సర్లు, ఒక ఫోర్ బాదాడు. 26 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న రసెల్... లివింగ్‌స్టోన్ వేసిన 15వ ఓవర్లో రెండు వరుస సిక్సర్లతో మ్యాచ్‌ను ముగించాడు. ఒకే ఓవర్లో 30 పరుగులు! ఒడెన్ స్మిత్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో రసెల్ చెలరేగిపోయాడు. అతను వరుస బంతుల్లో 4, 6, 6, 0, 6, 1 (+నోబాల్) పరుగులు చేయగా, తర్వాతి బంతికి బిల్లింగ్స్ సిక్స్ కొట్టడంతో మొత్తం 30 పరుగులు వచ్చాయి. స్కోరు వివరాలు: పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: మయాంక్ (ఎల్బీ) (బి) ఉమేశ్ 1; ధావన్ (సి) బిల్లింగ్స్ (బి) సౌతీ 16; రాజపక్స (సి) సౌతీ (బి) మావి 31; లివింగ్‌స్టోన్ (సి) సౌతీ (బి) ఉమేశ్ 19; రాజ్ బావా (బి) నరైన్ 11; షారుఖ్ (సి) రాణా (బి) సౌతీ 0; హర్‌ప్రీత్ (బి) ఉమేశ్ 14; ఒడెన్ స్మిత్ (నాటౌట్) 9; రాహుల్ చహర్ (సి) రాణా (బి) ఉమేశ్ 0; రబడ (సి) సౌతీ (బి) రసెల్ 25; అర్‡్షదీప్ (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (18.2 ఓవర్లలో ఆలౌట్) 137. వికెట్ల పతనం: 1–2, 2–43, 3–62, 4–78, 5–84, 6–92, 7–102, 8–102, 9–137, 10–137. బౌలింగ్: ఉమేశ్ 4–1–23–4, సౌతీ 4–0–36–2, శివమ్ మావి 2–0–39–1, వరుణ్ 4–0–14–0, నరైన్ 4–0–23–1, రసెల్ 0.2–0–0–1. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: రహానే (సి) స్మిత్ (బి) రబడ 12; వెంకటేశ్ (సి) హర్‌ప్రీత్ (బి) స్మిత్ 3; శ్రేయస్ (సి) రబడ (బి) చహర్ 26; బిల్లింగ్స్ (నాటౌట్) 24; రాణా (ఎల్బీ) (బి) చహర్ 0; రసెల్ (నాటౌట్) 70; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (14.3 ఓవర్లలో 4 వికెట్లకు) 141. వికెట్ల పతనం: 1–14, 2–38, 3–51, 4–51. బౌలింగ్: అర్‡్షదీప్ 3–0–32–0, రబడ 3–0–23–1, ఒడెన్ స్మిత్ 2–0–39–1, రాహుల్ చహర్ 4–1–13–2, హర్‌ప్రీత్ 2–0–20–0, లివింగ్‌స్టోన్ 0.3–0–13–0. ఐపీఎల్లో నేడు ముంబై ఇండియన్స్ X రాజస్తాన్ రాయల్స్ వేదిక: ముంబై, మధ్యాహ్నం గం. 3:30 నుంచి గుజరాత్ టైటాన్స్ X ఢిల్లీ క్యాపిటల్స్ వేదిక: పుణే, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
జుగ్రాజ్ హ్యాట్రిక్
పాచెఫ్స్ట్రోమ్ (దక్షిణాఫ్రికా): అంతర్జాతీయ హాకీ సమాఖ్య పురుషుల ప్రొ లీగ్‌లో భారత జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 10–2 గోల్స్ తేడాతో నెగ్గింది. భారత్ తరఫున రెండో మ్యాచ్ ఆడుతున్న ‘డ్రాగ్ ఫ్లికర్’ జుగ్రాజ్ సింగ్ మూడు గోల్స్‌తో (4వ, 6వ, 23వ ని.లో) ‘హ్యాట్రిక్’ సాధించాడు. గుర్సాహిబ్జిత్ సింగ్ (24వ, 36వ ని.లో), దిల్‌ప్రీత్ సింగ్ (25వ, 58వ ని.లో) రెండు గోల్స్ చొప్పున చేశారు. హర్మన్‌ప్రీత్ సింగ్ (2వ ని.లో), అభిషేక్ (12వ ని.లో), మన్దీప్ సింగ్ (27వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. మంగళవారం ఫ్రాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 5–0తో నెగ్గిన సంగతి విదితమే. -
ఆంధ్రను గెలిపించిన స్టీఫెన్
వడోదర: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు ఖాతా లో రెండో విజయం చేరింది. జార్ఖండ్ జట్టుతో శనివారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర ఎనిమిది పరుగుల తేడాతో గెలిచింది. ఆంధ్ర బౌలర్లు చీపురపల్లి స్టీఫెన్ (3/23), హరిశంకర్ రెడ్డి (3/24) రాణించారు. 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జార్ఖండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 157 పరుగులు చేసి ఓడిపో యింది. చివరి ఓవర్లో జార్ఖండ్ విజయానికి 10 పరుగులు అవసరమయ్యాయి. చేతిలో ఐదు వికెట్లున్నాయి. అయితే జార్ఖండ్ ఒక్క పరుగు మాత్రమే చేసి నాలుగు వికెట్లు (రెండు వికెట్లు స్టీఫెన్, రెండు రనౌట్లు) కోల్పోయింది. ఆఖరి ఓవర్ వేసిన ఆంధ్ర బౌలర్ స్టీఫెన్ కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి జార్ఖండ్‌ను కట్టడి చేశాడు. ఆంధ్ర వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ నాలుగు క్యాచ్‌లు తీసుకోవడంతోపాటు ఒక రనౌట్‌లో పాలుపంచుకున్నాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు చేసింది. అశ్విన్ హెబ్బార్ (45; 6 ఫోర్లు), శ్రీకర్ భరత్ (48; 5 ఫోర్లు), రికీ భుయ్ (15 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆకట్టుకున్నారు. -
హరికృష్ణకు రెండో విజయం
సాక్షి, హైదరాబాద్: బీల్ చెస్ ఫెస్టివల్లో భాగంగా క్లాసికల్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ రెండో విజయాన్ని సాధించాడు. స్విట్జర్లాండ్‌లో సోమవారం జరిగిన క్లాసికల్ విభాగం ఐదో రౌండ్ గేమ్‌లో హరికృష్ణ 1–0తో పోలాండ్ గ్రాండ్‌మాస్టర్ రాడోస్లా ఓజాసెక్పై గెలుపొంది చాంపియన్‌షిప్ రేసులో నిలిచాడు. ఈ గేమ్‌లో నల్లపావులతో ఆడిన భారత మూడో ర్యాంక్ ప్లేయర్ 50 ఎత్తుల్లో రాడోస్లాను ఓడించాడు. క్లాసికల్ విభాగంలో ఇప్పటివరకు 3 డ్రాలు 2 విజయాలు నమోదు చేసిన హరికృష్ణ ఖాతాలో 12.5 పాయింట్లు చేరాయి. ఓవరాల్ (క్లాసిక్, ర్యాపిడ్, బ్లిట్జ్) జాబితాలో 31.5 పాయింట్లతో రాడోస్లా అగ్రస్థానంలో ఉండగా... హరికృష్ణ 28.5 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకాడు. -
భారత్ రెండో విజయం
హిరోషిమా (జపాన్): అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) మహిళల సిరీస్ ఫైనల్స్ టోర్నమెం ట్లో భారత్ రెండో విజయం నమోదు చేసింది. శనివారం ఉరుగ్వేపై ప్రదర్శించిన జోరును పోలాండ్‌పైనా చూపింది. ఆదివారం జరిగిన పూల్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో 5–0తో పోలాండ్‌పై ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున గుర్జీత్ కౌర్ (28వ, 35వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... జ్యోతి (21వ నిమిషంలో), వందనా కటారియా (26వ నిమిషంలో), నవ్‌నీత్ కౌర్ (56వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు.ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో రష్యా 6–0తో మెక్సికోపై, చిలీ 3–1తో జపాన్‌పై, ఉరుగ్వే 4–0తో ఫిజీపై గెలుపొందాయి. భారత్ గ్రూప్‌లోని తన చివరి మ్యాచ్‌ను మంగళవారం ఫిజీతో ఆడనుంది. -
క్వార్టర్ ఫైనల్లో సైనా
సారావక్ (మలేసియా): వరుసగా రెండో విజయం సాధించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్... మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సైనా 21–17, 21–12తో హనా రమాదిని (ఇండోనేసియా)పై గెలిచింది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ ఫిత్రియాని (ఇండోనేసియా)తో సైనా ఆడుతుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో ఆరో సీడ్ అజయ్ జయరామ్ కూడా క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో జయరామ్ 21–12, 15–21, 21–15తో సుయె సువాన్ యి (చైనీస్ తైపీ)పై గెలుపొందాడు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సుమిత్ రెడ్డి–మనూ అత్రి (భారత్) ద్వయం 17–21, 21–18, 12–21తో గుణవా¯ŒS–కిడో (ఇండోనేసియా) జంట చేతిలో ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్‌లో గుత్తా జ్వాల–మనూ అత్రి జోడీ 18–21, 10–21తో అహ్మద్–గ్లోరియా (ఇండోనేసియా) జంట చేతిలో ఓటమి పాలైంది. -
హరికృష్ణకు రెండో గెలుపు
డాన్‌జూ (చైనా): సూపర్ గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ రెండో విజయాన్ని నమోదు చేశాడు. శుక్రవారం జరిగిన ఏడో రౌండ్లో హరికృష్ణ 43 ఎత్తుల్లో నెపోమ్నియాచి (రష్యా)పై గెలిచాడు. ప్రస్తుతం హరికృష్ణ 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. -
హరికృష్ణ మరో విజయం
జిబ్రాల్టర్: భారత గ్రాండ్ మాస్టర్ పెంటేల హరికృష్ణ జిబ్రాల్టర్ చెస్ టోర్నమెంట్లో రెండో విజయం సాధించాడు. గురువారం జరిగిన గేమ్‌లో హరి 52 ఎత్తుల్లో క్వాంటన్ డ్యూకర్మన్ (హాలండ్)పై విజయం సాధించాడు. ఎండ్ గేమ్‌లో ప్రత్యర్థి వద్ద అదనంగా ఒక పావు ఉన్నా...హరికృష్ణ తన అత్యుత్తమ ఆటతీరు కనబర్చి క్వాంటన్పై పైచేయి సాధించడం విశేషం. ఇతర మ్యాచ్‌లలో ఎంఆర్ లలిత్ బాబు, మార్తా బార్తల్ (పోలండ్)పై విజయం సాధించగా... ద్రోణవల్లి హారిక, హికరు నకముర (జపాన్) చేతిలో ఓడింది.