భయంతో ట్రంప్ వద్దకు చిన్న దేశ ప్రధాని
టోక్యో: అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్‌ను తొలిసారి ఓ పొరుగు దేశ ప్రధాని కలవనున్నారు. జపాన్ ప్రధాని షింజో అబే గురువారం ట్రంప్ తో భేటీ అవనున్నారు. రక్షణకు సంబంధించి ఒబామా హయాంలో చేసుకున్న ఒప్పందాన్ని ట్రంప్ రూలింగ్‌లో కూడా కొనసాగించే మార్గం సుగుమం చేసేందుకు ఆయన ఈ పర్యటనకు సిద్ధమయ్యారు. ట్రంప్ అధ్యక్ష పదవికి ఎన్నికైన తర్వాత ఆయనతో భేటీ అవనున్న తొలి విదేశీ నేత షింజో అబేనే. ట్రంప్ విజయం సాధించిన వెంటనే భిన్న సామర్థ్యాలు కలిగిన వాళ్లలోనే ట్రంప్ అసాధారణమైన టాలెంట్స్ కలిగిన నేత అనే షింజో అబే పొగడ్తల్లో ముంచెత్తిన విషయం తెలిసిందే.
అయితే, ఎన్నికల ప్రచార సమయంలో ఆసియా-ఫసిఫిక్ ప్రాంతంలో గస్తీ కాస్తున్న అమెరికా సేనలను వెనక్కి రప్పిస్తానని, రక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నందుకు మరిన్ని చెల్లింపులు చేస్తే తప్ప తాము అమెరికా సైనికులను కొనసాగించలేమని ట్రంప్ చెప్పారు. ఇన్నాళ్లు అమెరికా న్యూక్లియర్ గొడుగు కింద ఉండి ఆ రెండు దేశాలు శక్తిమంతంగా తయారయ్యాయని, అణుశక్తిని సాధించాయని చెప్పారు. దీంతో ఆ ప్రకటన చేసినప్పటి నుంచి జపాన్, దక్షిణ కొరియాలకు కాస్తంత కంగారు మొదలైంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తో రక్షణ పరమైన ఒప్పందం విషయంలో హామీ పుచ్చుకునేందుకు గురువారం న్యూయార్క్ వస్తున్నారు.