పదవీకాలం పొడగింపు కోరుతున్న పాటిల్
భారత క్రికెట్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్ తన పదవీకాలాన్ని మరో ఏడాది పొడగించాలని కోరుతున్నాడు. భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ)కు పాటిల్ ఈ మేరకు లేఖ రాసినట్టు సమాచారం. సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా సందీప్ నాలుగేళ్ల పదవీకాలం వచ్చే సెప్టెంబర్‌లో పూర్తికానుంది.
పాటిల్ విన్నపాన్ని బీసీసీఐ మన్నించకపోవచ్చు. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఏ సెలెక్టర్ కూడా నాలుగేళ్లకు మించి పదవిలో ఉండరాదని, పాటిల్‌కు బోర్డు ఎలా మినహాయింపు ఇస్తుందని క్రికెట్ వర్గాలు చెప్పాయి. ఈ పదవిని చాలా మంది ఆశిస్తున్నారని తెలిపారు. దీన్నిబట్టి పాటిల్ పదవీకాలాన్ని పొడగించే అవకాశం దాదాపుగా లేనట్టే. కాగా టీమిండియా చీఫ్ కోచ్ పదవి కోసం కూడా పాటిల్ దరఖాస్తు చేసుకున్నా ఆయన పేరును పరిగణనలోకి తీసుకోలేదు. మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లేను చీఫ్ కోచ్‌గా నియమించిన సంగతి తెలిసిందే.