సీమాంధ్ర ఉద్యోగుల కొనసాగింపును అంగీకరించం
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రంలో సీమాంధ్ర ఉద్యోగుల కొనసాగింపును ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ సచివాలయం, జిల్లాల్లో అటెండర్ నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ తెలంగాణ ఉద్యోగులే పనిచేయాలన్నారు. శుక్రవారం సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లిలో టీఎన్జీఓ యూని యన్ జిల్లా కోశాధికారి రాఘవేందర్రావు పదవీ విరమణ సన్మానసభ జరిగింది. సభకు హాజరైన ఆయన జిల్లా అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు.
15 వేల మంది సీమాంధ్ర ఉద్యోగులు బోగస్ సర్టిఫికెట్లు సమర్పించి తాము హైదరాబాద్ వారిమని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించిన ఉద్యోగులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల విభజనలో అన్యాయం జరిగితే సహించేది లేదని, జూన్ 2 తర్వాతే ఉద్యోగుల విభజన చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉద్యోగుల సమస్యలను విస్మరిస్తే ఆ ప్రభుత్వాలపై పోరాటాలు చేసేందుకు వెనక్కి తగ్గేదిలేదని స్పష్టం చేశారు. ఉద్యోగుల స్థానిక ఆధారంగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు కేటాయింపులు జరగాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చాక కూడా తెలంగాణ సచివాలయంలో ఆంధ్ర అధికారులు ఉంటే ఎలా అని ప్రశ్నించారు. సమావేశంలో రాష్ట్ర నాయకుడు రవీందర్‌రెడ్డి, జిల్లా నాయకులు నర్సింలు, సుశీల్‌బాబు, జావేద్ పాల్గొన్నారు.