seetham pet
-
సీతంపేట ఎస్ఐపై చర్యకు డిమాండ్
పాలకొండ : సీతంపేట ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఆ మండలానికి చెందిన పలువురు గిరిజనులు డిమాండ్ చేశారు. ఈ మేరకు డీఎస్పీ సీహెచ్ ఆదినారాయణను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల రైల్వేలో ఉద్యోగాల పేరిట బెంగళూరుకు చెందిన కొందరు సీతంపేట, భామిని, కొత్తూరు మండలాల పరిధిలోని పలువురు గిరిజన యువకుల నుంచి డబ్బులు తీసుకున్నాడు. ఈ విషయమై బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందుతులను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌లో నిందితుడు బాధితుల నుంచి తీసుకున్న రూ.30లక్షల్లో రూ.10 లక్షలు ఖర్చయిందని, రూ.20 లక్షలు చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై బాధితులను మరుసటి రోజు స్టేషన్‌కు రమ్మని చెప్పిన ఎస్ఐ తరువాత వెళ్లగా నిందితుడు వద్ద ఎటువంటి డబ్బుల్లేవని మాట మార్చారని తెలిపారు. ఎస్ఐ వల్లే గిరిజనులకు అన్యాయం జరిగిందని వారు పేర్కొన్నారు. డీఎస్పీకి ఫిర్యాదు చేసిన వారిలో సవర మల్లేశ్వరరావు, సవర శ్రీరాములు, సవర భాస్కరరావు, సవర సందరయ్య, సవర వెంకటరావు, సవర మహేష్, బిడ్డిక సుబ్బారావు, సీఐటీయూ పట్టణ కార్యదర్శి దావాల రమణారావు తదితరులు ఉన్నారు. దీనిపై డీఎస్పీ స్పందిస్తూ కేసును పాలకొండ సీఐకి అప్పగించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
పీహెచ్డీ@ 78
సీతంపేట, న్యూస్‌లైన్ : ఎవరైనా పదవీ విరమణ తర్వాత ఏంచేస్తారు? రామాకృష్ణా అంటూ కాలక్షేపం చేస్తారు. ఇష్టమైన గ్రంథాలను చదువుతుంటారు. లేదంటే ఏదో వ్యాపకం పెట్టుకుంటారు. కానీ ఆయన అలా చేయలేదు. దాదాపు ఎనిమిది పదుల వయసులోనూ చదువుపై మమకారం పెంచుకున్నారు. విశ్రాంతి తీసుకునే ప్రాయంలో డాక్టరేట్ కోసం తపించారు. ఎన్నో ఒడుదుడుకులెదురైనా అధిగమించారు. అనుకున్నది సాధించారు. డాక్టర్ నరసింహారావు అయ్యారు. విశాఖ నగరంలోని అక్కయ్యపాలెం 80 అడుగుల రోడ్లో ఉంటున్న ఎన్.డి.నరసింహారావు వయసు 78 ఏళ్లు. సెంట్రల్ హిందీట్రైనింగ్ ఇనిస్టిట్యూట్(ఢిల్లీ)లోఅసిస్టెంట్ డెరైక్టర్‌గా పదవీ విరమణ చేసి 20 ఏళ్ళయింది. లెక్చరర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించి వివిధ హోదాల్లో 24 ఏళ్ళు పనిచేశారు. ఈ క్రమంలో ఎందరో విద్యార్థులు రాసిన థీసిస్ చదివారు. తానూ బాగా థీసిస్ రాయగలనన్న నమ్మకంతో 2010లో పీహెచ్డీ ఎంట్రన్స్ రాసి అర్హత సాధించారు. ప్రొఫెసర్ ఆర్.డి.శర్మ పర్యవేక్షణలో ‘హిందీ తెలుగు దళిత ఆత్మ కథల తులనాత్మక అధ్యయనం’ అనే అంశపై పరిశోధన చేసి డిసెంబర్ 2011లో 650 పేజీల థీసిస్ సమర్పించారు. ఈనెల 5న దక్షిణ భారత హిందీ ప్రచార సభ నరసింహారావుకు డాక్టరేట్ ప్రదానం చేసింది. థీసిస్ సమర్పించే గడువు తేదీకి నెల రోజుల ముందు తన భార్య చనిపోయింది. అంతటి దుఃఖంలోనూ చివరి నెల రోజులు, రోజుకు 20 గంటలు శ్రమించి థీసిస్ సమర్పించారు. కృషి, పట్టుదల, సంకల్పబలం ఉంటే లక్ష్యాన్ని చేరుకోవచ్చంటున్నారు నరసింహారావు. మంచి ఆరోగ్యపు అలవాట్ల వల్లే 78 ఏళ్ళ వయసులోనూ ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారాయన. -
మళ్లీ గజ‘గజ’..!
సీతంపేట, న్యూస్‌లైన్: గిరిజన గూడలు ఏనుగుల భయంతో వణికిపోతున్నాయి. ఐదు నెలల క్రితం ఏ గ్రామం నుంచి కొండల్లోకి వెళ్లిపోయాయో..మళ్లీ అదే ప్రాంతంలోకి వచ్చి అలజడి సృష్టిస్తున్నాయి. మంగళవారం వేకువజామున బిల్లుమడ జీడితోటల్లో ఘీంకరించాయి. అనంతరం పి.రాజారావు, పత్తిక కరువయ్య, ఉర్లక చిన్నారావు, ఉర్లక సాయమ్మలకు చెందిన తోటలను నాశనం చేశాయి. అలాగే సమీపంలోని వరి పంటను సైతం నాశనం చేశాయి. నూర్చేందుకు వేసిన వరి ఓవులను చిందరవందర చేశాయి. కొబ్బరి, అరటి చెట్లను ధ్వంసం చేశాయి. ఆరుగాలం శ్రమ ఏనుగుల బారిన పడడంతో గిరిజనలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెట్టుగూడకు చెందిన రైతుల రబీ పంటలైన ఉలవలు,పెసలు, మినము, కందితోపాటు ఇతర పంటలకు ఏనుగులు తీవ్ర నష్టం కలిగించాయి. చెరుకుకు కూడా నష్టం వాటిల్లింది. గతంలోనూ ఇక్కడే.. గత జీడి, మామిడి సీజన్లో ఇదే ప్రాంతాలకు వచ్చి జీడి,మామిడి పంటలను నాశనం చేశాయి. అప్పట్లో గిరిపుత్రులకు పూడ్చలేని నష్టం వాటిల్లింది. ప్రస్తుతం ఖరీఫ్, వాణిజ్య పంటలు చేతికొస్తున్న తరుణంలో ఏనుగుల గుంపు దాడులు చేస్తుండడంతో పంటంతా నాశనమవుతోందని గిరిజనులు వాపోతున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టామని..ప్రస్తుతం పంటలు నాశనమవుతుండడంతో ఎలా బతకాలో తెలియడం లేదని పేర్కొంటున్నారు. రాత్రంతా జాగారమే.. ఇదిలా ఉండగా..ఏనుగులు గ్రామాల్లోకి రాకుండా.. రాత్రి వేళల్లో కె.గుమ్మడ, బిల్లుమడ, వెంపలగూడ, సుందరయ్యగూడ తదితర గ్రామాలకు చెందిన గిరిజనులు మంటలు వేసుకుంటూ..రాత్రంతా కాపలా కాస్తున్నారు. రాత్రిపూట ఏనుగుల ఘీంకారానికి కంటిమీద కనుకులేకుండా పోతోందని వాపోతున్నారు. అటవీశాఖ చర్యలు నామమాత్రమే.. ఇదిలా ఉండగా..ఏనుగులను అటవీ ప్రాంతంలోకి మళ్లించాల్సిన అటవీ శాఖ అధికారులు మొక్కుబడి చర్యలకే పరిమితమవుతున్నారు. గిరిజనుల్లాగే వీరు కూడా ఏనుగులు వచ్చాయంటూ.. చూడడానికి వస్తున్నారే తప్ప..వాటిని మళ్లించేందుకు చర్యలు చేపట్టడం లేదు. అదికూడా కింది స్థాయి సిబ్బందే వస్తున్నారని..పై స్థాయి అధికారులు వచ్చి, పరిశీలించిన దాఖలాలు లేవని స్థానిక గిరిజనులు వాపోతున్నారు. ఏనుగులను ఈ ప్రాంతం నుంచి పంపించేస్తామని అటవీ శాఖ మంత్రి ఇచ్చిన హామీ గాలిలో కలిసిపోయిందని దుయ్యబట్టారు.