డీఎస్పీకి ఫిర్యాదు చేస్తున్న గిరిజనులు
పాలకొండ : సీతంపేట ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని ఆ మండలానికి చెందిన పలువురు గిరిజనులు డిమాండ్ చేశారు. ఈ మేరకు డీఎస్పీ సీహెచ్ ఆదినారాయణను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల రైల్వేలో ఉద్యోగాల పేరిట బెంగళూరుకు చెందిన కొందరు సీతంపేట, భామిని, కొత్తూరు మండలాల పరిధిలోని పలువురు గిరిజన యువకుల నుంచి డబ్బులు తీసుకున్నాడు. ఈ విషయమై బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందుతులను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌లో నిందితుడు బాధితుల నుంచి తీసుకున్న రూ.30లక్షల్లో రూ.10 లక్షలు ఖర్చయిందని, రూ.20 లక్షలు చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీనిపై బాధితులను మరుసటి రోజు స్టేషన్‌కు రమ్మని చెప్పిన ఎస్‌ఐ తరువాత వెళ్లగా నిందితుడు వద్ద ఎటువంటి డబ్బుల్లేవని మాట మార్చారని తెలిపారు. ఎస్‌ఐ వల్లే గిరిజనులకు అన్యాయం జరిగిందని వారు పేర్కొన్నారు. డీఎస్పీకి ఫిర్యాదు చేసిన వారిలో సవర మల్లేశ్వరరావు, సవర శ్రీరాములు, సవర భాస్కరరావు, సవర సందరయ్య, సవర వెంకటరావు, సవర మహేష్, బిడ్డిక సుబ్బారావు, సీఐటీయూ పట్టణ కార్యదర్శి దావాల రమణారావు తదితరులు ఉన్నారు. దీనిపై డీఎస్పీ స్పందిస్తూ కేసును పాలకొండ సీఐకి అప్పగించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.