సీతంపేట, న్యూస్‌లైన్: గిరిజన గూడలు ఏనుగుల భయంతో వణికిపోతున్నాయి. ఐదు నెలల క్రితం ఏ గ్రామం నుంచి కొండల్లోకి వెళ్లిపోయాయో..మళ్లీ అదే ప్రాంతంలోకి వచ్చి అలజడి సృష్టిస్తున్నాయి. మంగళవారం వేకువజామున బిల్లుమడ జీడితోటల్లో ఘీంకరించాయి. అనంతరం పి.రాజారావు, పత్తిక కరువయ్య, ఉర్లక చిన్నారావు, ఉర్లక సాయమ్మలకు చెందిన తోటలను నాశనం చేశాయి. అలాగే సమీపంలోని వరి పంటను సైతం నాశనం చేశాయి. నూర్చేందుకు వేసిన వరి ఓవులను చిందరవందర చేశాయి. కొబ్బరి, అరటి చెట్లను ధ్వంసం చేశాయి. ఆరుగాలం శ్రమ ఏనుగుల బారిన పడడంతో గిరిజనలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెట్టుగూడకు చెందిన రైతుల రబీ పంటలైన ఉలవలు,పెసలు, మినము, కందితోపాటు ఇతర పంటలకు ఏనుగులు తీవ్ర నష్టం కలిగించాయి. చెరుకుకు కూడా నష్టం వాటిల్లింది.
గతంలోనూ ఇక్కడే..
గత జీడి, మామిడి సీజన్లో ఇదే ప్రాంతాలకు వచ్చి జీడి,మామిడి పంటలను నాశనం చేశాయి. అప్పట్లో గిరిపుత్రులకు పూడ్చలేని నష్టం వాటిల్లింది. ప్రస్తుతం ఖరీఫ్, వాణిజ్య పంటలు చేతికొస్తున్న తరుణంలో ఏనుగుల గుంపు దాడులు చేస్తుండడంతో పంటంతా నాశనమవుతోందని గిరిజనులు వాపోతున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టామని..ప్రస్తుతం పంటలు నాశనమవుతుండడంతో ఎలా బతకాలో తెలియడం లేదని పేర్కొంటున్నారు.
రాత్రంతా జాగారమే..
ఇదిలా ఉండగా..ఏనుగులు గ్రామాల్లోకి రాకుండా.. రాత్రి వేళల్లో కె.గుమ్మడ, బిల్లుమడ, వెంపలగూడ, సుందరయ్యగూడ తదితర గ్రామాలకు చెందిన గిరిజనులు మంటలు వేసుకుంటూ..రాత్రంతా కాపలా కాస్తున్నారు. రాత్రిపూట ఏనుగుల ఘీంకారానికి కంటిమీద కనుకులేకుండా పోతోందని వాపోతున్నారు.
అటవీశాఖ చర్యలు
నామమాత్రమే..
ఇదిలా ఉండగా..ఏనుగులను అటవీ ప్రాంతంలోకి మళ్లించాల్సిన అటవీ శాఖ అధికారులు మొక్కుబడి చర్యలకే పరిమితమవుతున్నారు. గిరిజనుల్లాగే వీరు కూడా ఏనుగులు వచ్చాయంటూ.. చూడడానికి వస్తున్నారే తప్ప..వాటిని మళ్లించేందుకు చర్యలు చేపట్టడం లేదు. అదికూడా కింది స్థాయి సిబ్బందే వస్తున్నారని..పై స్థాయి అధికారులు వచ్చి, పరిశీలించిన దాఖలాలు లేవని స్థానిక గిరిజనులు వాపోతున్నారు. ఏనుగులను ఈ ప్రాంతం నుంచి పంపించేస్తామని అటవీ శాఖ మంత్రి ఇచ్చిన హామీ గాలిలో కలిసిపోయిందని దుయ్యబట్టారు.
మళ్లీ గజ‘గజ’..!
Published Wed, Dec 18 2013 3:54 AM | Last Updated on Tue, Mar 19 2019 9:23 PM
Advertisement
Advertisement