వధూవరులు పరార్!
నమ్మించి ...నట్టేట ముంచాడు
► పెళ్లి చేసుకుంటానంటూనే వేరొక యువతితో వివాహం
►విషయం తెలుసుకుని పెళ్లి మండపానికి చేరిన ప్రియురాలు
► ప్రియుని ఇంటి ముందు బైటాయింపు
► ఇరువురూ పోలీసు శాఖకు చెందిన వారే
► అప్పటికే పరారయిన నూతన వధూవరులు
ఇద్దరూ పోలీసు శాఖలో పనిచేస్తున్నారు. ఒకరికి ఒకరు ఇష్టపడ్డారు. కులాలు వేరయినా ఏడడుగులు కలిసి నడుద్దామంటూ ప్రేమలో పడ్డారు. పెద్దలను ఒప్పించి ఎలాగైనా పెళ్లి చేసుకుంటానని చెప్పిన ప్రేమికుడు చివరకు ముఖం చాటేశాడు. ఆమె పోలీసులను ఆశ్రయించగా అరెస్టయి జైలుకు వెళ్లాడు. కేసు నడుస్తోంది. ఇది జరిగి రెండేళ్లయింది. కట్ చేస్తే.. ప్రియుడు ఈ నెల 27న మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇంకేముంది.. సదరు మాజీ ప్రియురాలు సరాసరి పెళ్లి మండపానికి బయలుదేరింది. ఇంతలో విషయం లీకవడంతో సదరు వరుడు.. వధువుతో సహా పరారయ్యాడు. సినీఫక్కీలో చోటుచేసుకున్న ఈ సంఘటన మండలంలో చర్చనీయాంశంగా మారింది. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం...
జి. సిగడాం: మండలంలోని మధుపాం గ్రామానికి చెందిన శెగళ్ల రాజు పోలీసు శాఖలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ఎచ్చెర్ల కార్టర్స్‌లో నివాసం ఉంటున్నాడు. ఇతనికి శ్రీకాకుళం పట్టణానికి చెందిన గొంటి వీధిలో నివాసం ఉంటున్న హోంగార్డు కొర్లకోట తులసీ భాయితో రెండేళ్లపాటు ప్రేమయాణం సాగింది. ఇరువురూ వివాహం చేసుకోవాలనుకున్నారు. వివాహం మాటత్తేసరికి రాజు ముఖం చాటేయడంతో 2013లో శ్రీకాకుళం 2వ పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి రాజును అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.
ఆరు నెలలు గడువు కావాలని...
ప్రస్తుతం కేసు విచారణలో ఉండగా, రాజు పెద్దల సమక్షంలో సంబంధం కుదుర్చుకుని మరో యువతితో పెళ్లికి సిద్ధపడడంతో తులసీభాయి హతాశురాలైంది. తనను పెళ్లి చేసుకోవడానికి ఆరు నెలల గడువు కావాలన్నాడని, ఇంతలోనే వేరే యువతితో పెళ్లికి సిద్ధమవ్వడంతో తట్టుకోలేక వెంటనే జి.సిగడాం పోలీసులను ఆశ్రయించింది. రాజు తనను శారీరకంగా, మానసికంగా నమ్మించి మోసగిండంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది. తర్వాత.. రాజు స్వగ్రామైన మధుపాం గ్రామానికి బయలుదేరింది. విషయం కాస్త ముందుగానే తెలియడంతో రాజు కుటుంబ సభ్యులతో కలిసి వధువుతో సహా పరారయ్యాడు.
ప్రియుడి ఇంటిముందు మౌనదీక్ష
తనకు న్యాయం జరిగే వరకూ కదిలేదిలేదని తులసీభాయి ప్రియుడు రాజు ఇంటి ముందు మౌన దీక్షకు దిగింది. రాజు ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులందరూ పరారవ్వడంతో అక్కడై బైటాయించింది. బాధితురాలికి మద్దతుగా జిల్లా డీఆర్డీఏ మహిళా సమాఖ్య సభ్యులు పి. లక్ష్మి. పి. నిర్మల బి. లక్ష్మి లతోపాటు సిబ్బంది రంగంలోకి దిగారు. రాజాం సీఐ శేఖర్‌బాబుతోపాటు జి. సిగడాం పొలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని ఆరాతీశారు. తనకు అన్యాయం చేసిన రాజుపై న్యాయ పొరాటం చేస్తానని లేకపోతే రాజు ఇంటిముందే ప్రాణాలు విడుస్తానని తులసీభాయి సీఐ ముందు రోదిస్తూ చెప్పింది. ఆమె ఫిర్యాదు మేరకు రాజుపై కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు.