'సెటిలర్స్ కాంగ్రెస్కు ఓటు వేయలేదు'
హైదరాబాద్ : హైదరాబాద్లో సెటిలర్స్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదని ఆపార్టీ నేతలు దానం నాగేందర్, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ సెటిలర్స్కు భద్రత కల్పిస్తామన్నప్పటికీ వారు తమను విశ్వసించలేదన్నారు. ఇక కేసీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని నష్టపరిచాయన్నారు.
గతంలో టీఆర్ఎస్ కంటే పెద్ద పార్టీలనే ఎదుర్కొన్నామని, ప్రజా ఉద్యమాలు అంటే ఎలా ఉంటాయో రుచి చూపిస్తామని దానం, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఓటమి స్వయంకృతాపరాధమని, పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ కార్యకర్తలకు అన్యాయం జరిగిందన్నారు. నామినేటెడ్ పదవులు రాక కార్యకర్తలు ఖాళీగా ఉన్నారన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ను ఓడించామే అని ప్రజలు పశ్చాత్తాప భావనలో ఉన్నారని వారు అన్నారు.
టీడీపీ నుంచి కొందరు తెలంగాణ ద్రోహులు ఎన్నికల్లో గెలిచారని, తెలంగాణ ఇచ్చినప్పటికీ తాము ఓడిపోయామన్నారు. పార్టీ సీనియర్లు తామే ముఖ్యమంత్రి అవుతామనే భావనతో జనంలోకి వెళ్లలేకపోయారన్నారు. ఆ సమన్వయలోపం వల్ల కాంగ్రెస్ ఓటమి పాలైందన్నారు. వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు వద్దన్న కేంద్రమంత్రి నజ్మా హెప్తుల్లా తక్షణమే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. దేశంలో చాలామంది ముస్లింలు పేదరికంలో బతుకుతున్నారని ఆయన అన్నారు.