ఆది, ఆదా జోడీగా ‘గరమ్’!
‘‘పవన్‌కల్యాణ్ ఏడో సినిమా ‘ఖుషి’... మహేశ్‌బాబు ఏడో సినిమా ‘ఒక్కడు’... ఎన్టీఆర్ ఏడో సినిమా ‘సింహాద్రి’...ఈ మూడూ ఎంతటి ఘనవిజయాలను సొంతం చేసుకున్నాయో తెలిసిందే. అప్పట్నుంచీ ఏ హీరోకైనా ఏడో సినిమా హిట్ అనే సెంటిమెంట్ చిత్రపరిశ్రమలో బలంగా ఉంది. అందుకే మేము నిర్మిస్తున్న ‘గరమ్’ చిత్రం హిట్ కావడం ఖాయం. ఎందుకంటే ఇది హీరో ఆది ఏడో సినిమా’’ అంటున్నారు రాజ్‌కుమార్ యం. ఆయన నిర్మాతగా.. మదన్ దర్శకత్వంలో ఆది, ఆదా శర్మ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘గరమ్’.
ఈ సినిమా హైదరాబాద్‌లో ఆరంభమైంది. ముహూర్తపు దృశ్యానికి పారిశ్రామికవేత్త టి. వెంకట్రావు కెమెరా స్విచాన్ చేయగా, చిత్రనిర్మాత రాజ్‌కుమార్ కుమార్తె రాజశ్రీ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు సుకుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ నెల 15న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత తెలిపారు. ఆది మాట్లాడుతూ -‘‘మంచి కథ, చక్కని సంభాషణలు కుదిరిన చిత్రం ఇది. వాణిజ్య అంశాలు మెండుగా ఉన్నాయి’’ అని చెప్పారు. మదన్ మాట్లాడుతూ -‘‘నా సహాయ దర్శకుడు శ్రీనివాస్ ఈ కథ ఇచ్చారు.
జీవన ప్రయాణంలో ఎన్ని అవాంతరాలొచ్చినా... అవన్నీ పక్కకు నెట్టేసి ముందుకు తీసుకెళ్లిపోయే తత్వం ఇందులో హీరోది. ప్రతి ఇంట్లోనూ ఇలాంటి కుర్రాడు ఒకడుండాలి అనిపించేలా హీరో పాత్ర ఉంటుంది జీవితమనే వాహనం చివరిదాకా ప్రయాణించాలంటే ‘ప్రేమ’ అనే ఇంధనం అవసరమని తెలిపే కథాంశంతో ఈ చిత్రం రూపొందిస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రంలో సంగీతానికి మంచి అవకాశం ఉందనీ, మ్యూజికల్ హిట్టయ్యే పాటలు కుదిరాయని సంగీత దర్శకుడు అగస్త్య తెలిపారు. ఆదికి వంద శాతం నప్పే పాత్ర ఇదని రచయిత శ్రీనివాస్ గవిరెడ్డి తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: టి. సురేంద్రరెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: నాగిరెడ్డి బి., లైన్ ప్రొడ్యూసర్: హరికృష్ణ జి.