వారం వ్యవధిలో ముగ్గురి మృతి
లింగాపుట్టులో మళ్లీ జ్వరాల తీవ్రత
సత్యవరంలో ఐదుగురికి డెంగ్యూ
ఆందోళన లో గ్రామస్తులు
పాడేరు రూరల్ : మండలంలోని గొండెలి పంచాయతీ లింగాపుట్టులో మళ్లీ జ్వరాల తీవ్రత అధికమైంది. వారం రోజుల వ్యవధిలో రెండు నెలల శిశువుతో పాటు మరో ఇద్దరు గిరిజనులు మృతి చెందారు. గ్రామానికి చెందిన మంజెలి పిన్నయ్య అనే గిరిజనుడు రెండు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాదపడుతున్నాడు. శుక్రవారం ఉదయం ఆరోగ్య పరిస్థితి ఒక్క సారిగా విషమించటంతో అంబులెన్స్‌లో పాడేరు ప్రాంతీయ ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో మార్గంమధ్యలో మృతి చెందాడు.
గ్రామానికి చెందిన పలాసి రాజయ్య, రెండు నెలల శిశువు వారం రోజుల్లో మృత్యువాత పడ్డారు. మంచినీటి పథకం మూలకు చేరడంతో గిరిజనులు గెడ్డల్లోని కలుషిత నీరు తాగుతుండడంతో వల్లే అనారోగ్యంబారిన పడుతున్నారు. వాస్తవానికి గురువారమే మినుములూరు వైద్య సిబ్బంది గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి బాధితులకు వైద్యం అందించినా జ్వరాలు తగ్గుముఖం పట్టడం లేదు. తక్షణమే మెరుగైన వైద్య శిబిరం ఏర్పాటు చేసి, సురక్షిత తాగునీరందించేలా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
సత్యవరంలో డెంగ్యూ బెంగ
మాడుగుల : మండలంలోని సత్యవరం గ్రామంలో డెంగ్యూ, జ్వరాలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఇప్పటికే గ్రామానికి చెందిన మిరియాల దేముడమ్మ, మీసాల సూరిబాబులతో పాటు మరో ముగ్గురికి డెంగ్యూ వ్యాధి సోకిందన్న అనుమానంతో కుటుంబ సభ్యులు వారిని విశాఖ కేజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నారు. డెంగ్యూ బాధితుల తరలింపుతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. గ్రామంలో మరో 10 మందికి జ్వరాలుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.
ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఇక్కడ మెగా వైద్య శిబిరం ఏర్పాటుచేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. దీనిపై కింతలి పీహెచ్సీ వైద్యులను సంప్రదించగా ఈ నెల 9న వైద్య శిబిరం ఏర్పాటు చేశామని, అయినా జ్వరాలు తగ్గుముఖం పట్టలేదని చెప్పారు. కలుషిత నీరు కారణంగా పరిస్థితి మళ్లీ దిగజారి ఉండొచ్చని తెలిపారు. వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామన్నారు.