'నూటొక్క దేశాలకు అందగాడిని నేను'
సాక్షి: 'నూటొక్క దేశాలకు అందగాడిని నేను' అన్న చందంగా కనిపిస్తున్న ఈ గొరిల్లా పేరు షబానీ. ఈ పేరు ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. విషయమేంటంటే.. ఈ మగ గొరిల్లా చాలా అందంగా ఉండటమే! దీనిని చూడటానికి వచ్చేవారిలో ఎక్కువగా మహిళలే ఉంటున్నారంట. గొరిల్లా అందంగా ఉండటమేంటి? దాన్ని చూసేందుకు ఆడవాళ్లు రావడమేంటి? ఆ మాటకొస్తే.. మనుషులేనా అందంగా ఉండేది? ఏం గొరిల్లాలు ఉండకూడదా? అని షబానీ ప్రశ్నిస్తుంది.
ఎక్కడుంటుంది?
కండలు తిరిగిన దేహంతో, నల్లగా నిగనిగలాడుతున్న ఈ గొరిల్లా పేరు షబానీ, జపాన్‌కు చెందిన నగోయా నగరంలోని ‘హిగాషియామా జూ అండ్ బొటానికల్ గార్డెన్’లో ఉంటుంది. దీని వయసు 18 సంవత్సరాలు. బరువు 180 కిలోలు. 1996లో నెదార్లాండ్స్లో జన్మించింది. దానికి రెండు నెలల వయసు ఉన్నపుడు తల్లిదండ్రులతో సహా ఆస్ట్రేలియాకు తరలించారు. అక్కడ సిడ్నీలోని తరంగా జూలో దాదాపు 11 ఏళ్లపాటు పెరిగింది. 2007లో దాన్ని జపాన్‌లోని జూకు తరలించారు. ఇప్పుడు ఈ గొరిల్లా జపాన్‌లోని మహిళలను విపరీతంగా ఆకర్షిస్తోంది.
కొంతకాలంగా షబానీని చూసేందుకు వస్తున్న వారిలో మహిళలే ఎక్కువగా ఉంటున్నారని జూపార్కు నిర్వాహకులు ప్రకటించడం విశేషం. ఇంటర్నెట్లోనూ షబానీ హవా నడుస్తోంది. ట్వీటర్లో షబానీ ఫొటోలు పెట్టగానే లైకుల వర్షం కురుస్తోందట. షబానీకి ఇంటర్నెట్లో, ప్రజల్లో వస్తోన్న ఆదరణ చూసి జూ నిర్వాహకులు ఆశ్చర్యపోతున్నారు. ఇది జపాన్ ప్రజలకు ఉన్న అభిమానంగా అభివర్ణిస్తున్నారు.
మోడల్ కూడా..!
షబానీ ఈ ఏడాది మొదట్లో జూ నిర్వహించిన ‘స్ప్రింగ్ ఫెస్టివల్’లో ప్రచారకర్తగా వ్యవహరించింది. దీంతో దీనికి మరింత క్రేజ్ పెరిగింది. దాని అమాయకపు చూపులు, బలమైన కండలు ఇక్కడ మహిళలను ఎంతగానో ఆకర్షిస్తున్నాయని జూ ప్రతినిధి ఇషికావా తెలిపారు. సోషల్ మీడియాలో మహిళలు దీనికి ‘ఐక్మన్’ (అందంగా కనిపించే మగాడు) అని ముద్దుపేరు కూడా పెట్టేసుకున్నారు.
ఇలాంటి ట్వీట్లు షబానీని జాతీయస్థాయిలో సెలబ్రిటీని చేశాయి. స్థానిక మీడియా షబానీ అందంపై డాక్యుమెంటరీలు తీసేసి మరింత ప్రచారం కల్పిస్తున్నాయి. ఇది ఫొటోలకు ఎంతో చక్కగా ఫోజులిస్తుందట. అప్పుడు దాని కళ్లలోకి చూసినవారికి దాంట్లో ఓ ప్రొఫెషనల్ మోడల్ కనిపిస్తుందని ఇషికావా పేర్కొన్నారు. జూలో ఉన్న ఐదు గొరిల్లాలకు ఇది పెద్దదిక్కు. దీనికి సంతానం, కుటుంబం కూడా ఉందండోయ్! మొత్తానికి షబానీకి లభిస్తోన్న ప్రజాదరణతో హిగాషియామా జూకు సందర్శకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని నిర్వాహకులు సంతోషంగా ఉన్నారట.