'నా సోదరిని రాడ్లతో కొట్టి చంపేశారు'
పట్నా: తన సోదరి షీలదేవి(29) హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని, దీనికి ఎస్పీ బాధ్యత వహించాలని భోజ్ పూర్ ఆర్జేడీ ఎమ్మెల్యే సరోజ్ యాదవ్ డిమాండ్ చేశారు. కేవలం ఎస్పీ బాధ్యతారాహిత్యం వల్లనే తన సోదరి ప్రాణాలు కోల్పోయిందని ఆరోపించారు. ఆసుపత్రి నుంచి ఇంటికి వస్తున్న షీలదేవి ఆటో లోంచి కిందకు తోసేసిన గుర్తుతెలియని వ్యక్తులు, ఇనుపరాడ్లతో కొట్టి చంపేశారని యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ముందు ఇది ప్రమాదంగా భావించామని, కానీ ఆమెకు హత్యకు గురైందనే విషయం తర్వాత తమకు అర్థమైందని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వంపై తనకు నమ్మకం ఉందని, న్యాయం జరుగుతుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఈ నెల 9న ఆసుపత్రికి వెళ్లిన షీలదేవి ఆటోలో ఇంటికి తిరిగి వస్తోంది. మధ్యలో ఆటోలో ఎక్కిన కొంతమంది యువకులు ఆమెతో అనుచితంగా ప్రవర్తించారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో తీవ్రంగా దాడిచేసి ఆటోలోంచి బయటకు తోసేసి పారిపోయారు. ప్రాణాపాయ స్థితిలో రోడ్డు పక్కన పడి వున్న ఆమెను స్థానికులు కొంతమంది గుర్తించి ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. తీవ్రగాయాలతో పట్నా మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ మంగళవారం ఆమె మరణించింది.
ఈ ఘటనపై భోజ్పురి జిల్లాలోని చాంది పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. కాగా షీల దేవి హత్య కేసులో ఇద్దరు నిందితులు మితిలేష్, సంతోష్ అరా బుధవారం కోర్టుముందు లొంగిపోయారు.