ప్రచార సమరం!
లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గరపడుతుండడంతో అన్ని పార్టీల అగ్రనేతలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. బీజేపీ ప్రదాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ నగరంలో మార్చి 26న భారీ ర్యాలీ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీలో బీజేపీ ప్రచారానికి ఊపందిస్తుందని పార్టీ భావిస్తోంది. శాస్త్రిపార్క్‌లో నిర్వహించే మోడీ ర్యాలీ ద్వారా నార్త్ ఈస్ట్ ఢిల్లీతోపాటు ఈస్ట్ ఢిల్లీ, చాందినీచౌక్ ఓటర్లను ఆకట్టుకోవాలని బీజేపీ ఆశిస్తోంది.
శాస్త్రిపార్క్ ప్రాంతం చిన్నది కావడం వల్ల నగరంలోని మిగతా నియోజకవర్గాల్లో మోడీ ర్యాలీని ప్రసారం చేయడానికి ఎల్ఈడీ స్క్రీన్లను అమర్చనున్నారు. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాల నుంచి పోటీచేస్తోన్న బీజేపీ అభ్యర్థులను మోడీ ఈ ర్యాలీలో పరి చయం చేస్తారని అంటున్నారు. నిజాయితీపరుడని హర్షవర్ధన్‌కు ఉన్న పేరుతో మధ్యతరగతి ఓటర్లను ఆకట్టకోవడానికి మోడీ ప్రయత్నిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
చాందినీచౌక్‌లో హర్షవర్ధన్ విజయం కోసం ప్రత్యేకంగా శ్రమించవలసి ఉం టుందని బీజేపీ గుర్తించింది. ఆయన బలమైన అభ్యర్థి అయినప్పటికీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ నుంచి వర్ధన్‌కు గట్టిపోటీ ఉంటుంది. ఆమ్ ఆద్మీ పా ర్టీ అభ్యర్థి ఆశుతోష్ కన్నా కపిల్ సిబలే తమ ప్రధాన ప్రత్యర్థని బీజేపీ నాయకులు చెబుతున్నారు.
చాందినీచౌక్‌లో గెలుపును ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న బీజేపీ న్యూఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీ, నార్త్ ఈస్ట్ ఢిల్లీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించింది. ఈ మూడు నియోజకవర్గాల్లో గెలుపు ఖాయమనిపించడం లేదని, మరింత శ్రమించాల్సిందిగా ఆర్ఎస్ఎస్ సూచించిందని బీజేపీ వర్గాలు తెలిపాయి. న్యూఢిల్లీ నుంచి మీనాక్షీ లేఖీ, నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి మనోజ్ తివారీ, నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి ఉదిత్‌రాజ్ బీజేపీ తరఫున పోటీచేస్తున్నారు.
ఈ నెల 30 సోనియా ర్యాలీ
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఈ నెల 30న ఢిల్లీలో ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తారని డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ సోమవారం మీడియా సమావేశంలో ప్రకటించారు. రాజధానిలో బీజేపీ, ఆప్‌ల బలం దారుణంగా పడిపోయిందన్నారు. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ తొలి విడత ప్రచారం ముగిసిందన్నారు.
రెండోదశ ప్రచారంలో భాగంగా సోనియా గాంధీ నేతృత్వంలో ర్యాలీని కరోల్‌బాగ్‌లోని అజ్మల్‌ఖాన్ పార్క్‌లో సాయంత్రం నాలుగింటికి నిర్వహిస్తామని లవ్లీ వివరించారు. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని కేంద్రమంత్రి కృష్ణాతీరథ్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే చరణ్‌సింగ్ కండేరా ఈ సందర్భంగా తిరిగి కాంగ్రెస్‌లో చేరారు.
ఏప్రిల్ మొదటివారం నుంచి కేజ్రీవాల్ ప్రచారం
ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్ ఏప్రిల్ 1 నుంచి 8 వరకు ఢిల్లీలో పార్టీ తరపున ప్రచారం చేయనున్నారు. పొరుగున ఉన్న హర్యానాతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన ఇంతవరకు ఢిల్లీలో ప్రచారం చేయలేదు. కేజ్రీవాల్ ప్రచారం చేయపోవడంపై ఆప్ అభ్యర్థులు, కార్యకర్తలు, అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కేజ్రీవాల్ ప్రచారానికి ఎందుకు రావడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారని కార్యకర్తలు అంటున్నారు. కేజ్రీవాల్ ప్రచారం వల్ల తమ గెలుపు అవకాశాలు మెరుగవుతాయని అభ్యర్థులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆప్ కార్యకర్తలు ఇంటింటికీ ప్రచారంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు.
కేజ్రీవాల్ మంగళవారం వారణాసిలో ప్రచారం చేస్తారు. తదనంతరం మూడు రోజులపాటు హర్యానాలో ప్రచారం చేస్తారు. ఏప్రిల్ 1 నుంచి ప్రచారం ఆఖరి తేదీ వరకు..అంటే ఏప్రిల్ 8 వరకు ఆయన ఢిల్లీలో ప్రచారం చేస్తారని ఆప్ వర్గాలు తెలిపాయి.