Shifted to Cherlapalli Central Jail
-
పుస్తక పఠనంలో రామలింగరాజు
రోజుకు 10-15 గంటల పాటు వాటితోనే కాలక్షేపం సాధారణ ఖైదీలానే దినచర్య సోమవారం పని కేటాయించే అవకాశం.. హైదరాబాద్: ‘సత్యం’ కుంభకోణం కేసులో ఏడేళ్ల శిక్షఖారారై చర్లపల్లి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న రామలింగరాజు అధికసమయం పుస్తక పఠనంతో గడిపేందుకే ఇష్టపడుతున్నట్లు తెలిసింది. ఆయన రోజుకు 10-15 గంటల పాటుగా రీడింగ్ రూంలో ఉంటూ పుస్తక పఠనం చేస్తున్నారు. ఎక్కువగా బయోలజీ, కెమిస్ట్రీ, సైన్స్‌కు సంబంధించిన పుస్తకాలను చదువుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో జైలులో ఆయన ఎవరితోను మాట్లాడటం లేదని, ఏకాంతంగా ఉండేందుకే మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. జైలులో ఆయనకు ప్రత్యేక సౌకర్యాలేవీ కల్పించడం లేదు. అందరిలానే అల్పాహారం, భోజనాన్నే ఆయనా తీసుకుంటున్నారు. అయితే ఇతర ఖైదీల మాదిరిగా ఇంకా ఆయనకు నిబంధనల మేరకు ప్రత్యేక పని అప్పగించలేదు. సోమవారం నుంచీ రామలింగరాజు సోదరులతో సహా మిగతా వారికి కూడా అధికారులు పనిని కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. రాజుకు జైలులో పాఠశాల, లైబ్రరీ, కంప్యూటర్ తరగతుల నిర్వహణ వంటి బాధ్యతలు అప్పగించే దిశగా జైల్ అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. రామలింగరాజు మాత్రం లైబ్రరీ ఇన్చార్జీ బాధ్యతలు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. రామలింగరాజు ఇప్పటికే మూడేళ్ల జైలు జీవితం గడిపినందున ప్రస్తుత శిక్షా కాలంలో అది మినహాయిస్తే ఓ నాలుగేళ్లు జైలులో ఉండే అవకాశాలుంటాయని, ఇక సత్ప్రవర్తనతో ఉంటే అది మూడేళ్లకే శిక్షాకాలం పూర్తికావచ్చని జైలు అధికారులు అంటున్నారు. -
పోలీసులతో గొడవలే
వరంగల్: ఎన్కౌంటర్లో మృతి చెందిన ఐదుగురు ఉగ్రవాదులను గత నెలలోనే వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఉగ్రవాద నేరాల్లో నిందితులుగా ఉన్న వీరు.. అండర్ ట్రయల్(యు.టి) ఖైదీలుగా హైదరాబాద్‌లోని చర్లపల్లి సెంట్రల్ జైలులో ఉండేవారు. మార్చి మొదటివారంలో మరికొందరు ఉగ్రవాద ఖైదీలు, ఇతర నేరాల్లో శిక్షననుభవిస్తున్న ఇంకొందరితో ఈ జైలులో గొడవపడ్డారు. దీంతో వీరిని బృందాలుగా విడదీసి తెలుగు రాష్ట్రాల్లోని ఇతర సెంట్రల్ జైళ్లకు తరలించారు. ఇలా ఐదుగురిని వరంగల్ సెంట్రల్ జైలుకు పంపించారు. మహ్మద్ జకీర్‌ను మార్చి 1న, మిగిలిన నలుగురిని మార్చి 10న పోలీసులు వరంగల్‌కు తీసుకొచ్చారు. హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో విచారణ నిమిత్తం వీరిని తీసుకెళ్తున్న సమయంలో ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో మృతి చెందిన వికార్ ప్రవర్తన పోలీసులకు మొదటి నుంచీ ఇబ్బందికరంగానే ఉండేది. విచారణ కోసం జనగామ కోర్టుకు వచ్చి వెళ్లే సమయాల్లో బిర్యానీ కావాలంటూ పోలీసులతో గొడవకు దిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. హైదరాబాద్‌కు తరలిస్తున్న సమయంలో ఒకసారి తనతో విధుల్లో ఉన్న ఎస్సైని కాళ్లలో కాలు పెట్టి పడేసే ప్రయత్నం చేశాడు. అప్పుడు జనగామ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లగా, అక్కడా గొడవకు దిగాడు. వరంగల్ సెంట్రల్ జైలులోనే పలుసార్లు వికారుద్దీన్ గొడవలకు దిగిన సందర్భాలు ఉన్నాయి. బిర్యానీ, భోజనం విషయంలో జైల్లో ఒకసారి పెద్ద గొడవ కూడా చేశాడు. జైలు సిబ్బందిపై దాడి చేశాడు. జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు.