పోలీసులతో గొడవలే | Clash with police | Sakshi
Sakshi News home page

పోలీసులతో గొడవలే

Published Wed, Apr 8 2015 2:12 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

Clash with police

వరంగల్: ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఐదుగురు ఉగ్రవాదులను గత నెలలోనే వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఉగ్రవాద నేరాల్లో నిందితులుగా ఉన్న వీరు.. అండర్ ట్రయల్(యు.టి) ఖైదీలుగా హైదరాబాద్‌లోని చర్లపల్లి సెంట్రల్ జైలులో ఉండేవారు. మార్చి మొదటివారంలో మరికొందరు ఉగ్రవాద ఖైదీలు, ఇతర నేరాల్లో శిక్షననుభవిస్తున్న ఇంకొందరితో ఈ జైలులో గొడవపడ్డారు. దీంతో వీరిని బృందాలుగా విడదీసి తెలుగు రాష్ట్రాల్లోని ఇతర సెంట్రల్ జైళ్లకు తరలించారు. ఇలా ఐదుగురిని వరంగల్ సెంట్రల్ జైలుకు పంపించారు. మహ్మద్ జకీర్‌ను మార్చి 1న, మిగిలిన నలుగురిని మార్చి 10న పోలీసులు వరంగల్‌కు తీసుకొచ్చారు. హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో విచారణ నిమిత్తం వీరిని తీసుకెళ్తున్న సమయంలో ఎన్‌కౌంటర్ జరిగింది.

ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వికార్ ప్రవర్తన పోలీసులకు మొదటి నుంచీ ఇబ్బందికరంగానే ఉండేది. విచారణ కోసం జనగామ కోర్టుకు వచ్చి వెళ్లే సమయాల్లో బిర్యానీ కావాలంటూ పోలీసులతో గొడవకు దిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. హైదరాబాద్‌కు తరలిస్తున్న సమయంలో ఒకసారి తనతో విధుల్లో ఉన్న ఎస్సైని కాళ్లలో కాలు పెట్టి పడేసే ప్రయత్నం చేశాడు. అప్పుడు జనగామ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లగా, అక్కడా గొడవకు దిగాడు. వరంగల్ సెంట్రల్ జైలులోనే పలుసార్లు వికారుద్దీన్ గొడవలకు దిగిన సందర్భాలు ఉన్నాయి. బిర్యానీ, భోజనం విషయంలో జైల్లో ఒకసారి పెద్ద గొడవ కూడా చేశాడు. జైలు సిబ్బందిపై దాడి చేశాడు. జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement