కొడుకు మ్యాచ్ కళ్లారా చూడాలని..
► అవతార్ తల్లిదండ్రుల తపన
► ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపులు
న్యూఢిల్లీ: క్రీడల్లో ప్రవేశమున్న తమ పిల్లల మ్యాచ్ లను ప్రత్యక్షంగా చూడాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. అయితే ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉన్న ఆ తండ్రి ఇప్పటిదాకా తన కొడుకు ప్రదర్శనను ప్రత్యక్షంగా తిలకించలేదు. తమ పిల్లాడి అద్భుత నైపుణ్యాన్ని టీవీల్లో చూసే ఆ పేరేంట్స్ మురిసిపోయేవాళ్లు.
కానీ ఈసారి మాత్రం ఎలాగైనా కనులారా వీక్షించాలని అనుకుంటున్నాడు. ఎందుకంటే అతడి కుమారుడు ఈసారి పాల్గొనేది ప్రపంచ క్రీడల్లోనే అత్యున్నత వేదికైన ఒలింపిక్స్‌లో మరి. భారత్ తరఫున రియో గేమ్స్‌లో పాల్గొంటున్న ఏకైక జూడో క్రీడాకారుడు అవతార్ సింగ్ కుటుంబ పరిస్థితి ఇది. అవతార్ తండ్రి షింగర సింగ్ స్థానిక ఆస్పత్రిలో చిన్నస్థాయి ఉద్యోగి. తల్లి గృహిణి. వచ్చే ఆదాయం చాలా తక్కువ. ఇప్పటిదాకా కుమారుడి విదేశీ ప్రయాణాల ఖర్చులకు అప్పు చేసి మరీ డబ్బు అందించాడు.
అయితే ఈసారి కొడుకును ప్రభుత్వమే పంపిస్తున్నా తాము మాత్రం బ్రెజిల్ వెళ్లాలంటే లక్షల్లో ఖర్చుపెట్టాలి. అందుకే ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. అదృష్టవశాత్తు వీరికి చేయూత అందించేందుకు మిలాప్.ఓఆర్జీ వెబ్సైట్ ముందుకు వచ్చింది. అవతార్ తల్లిదండ్రులకు ఈ పర్యటనకయ్యే ఖర్చు రూ.8 లక్షల కోసం విరాళాలను సేకరించాలని నిర్ణయించింది. 90కేజీల విభాగంలో తలపడే అవతార్ మ్యాచ్ వచ్చే నెల 10న ఉంటుంది. ఈనెల 31 వరకు ఆ ఖర్చులకు అవసరమైన విరాళాలు అందుతాయని ఆశిస్తున్నారు.