మత్తులో చిత్తు
తెలుగు నేలను మద్యం మహమ్మారి కబళిస్తోంది. అధికారిక మద్యం.. నాటు సారా.. కాపు సారా.. గుడుంబా.. రకరకాల రూపాల్లో కష్టజీవులను తన కోరల్లో బంధిస్తోంది. అక్షరాలా 100 కోట్ల రూపాయలు! తెలుగు రాష్ట్రాల్లో ప్రతి రోజూ మద్యపానానికి వెచ్చిస్తున్న సొమ్ము! అంటే నెలకు రూ. 3,000 కోట్లు.. సంవత్సరానికి రూ. 36,500 కోట్లకు పైమాటే! ఇది పండుగకో, పబ్బానికో కాదు! నిత్య వ్యసనానికి! రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు తమ దైనందిన దైన్యాన్ని మరచి మత్తులో జోగటానికి! మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి?
ఎన్నో మాటలు చెప్తున్నాయి. మద్యాన్ని నియంత్రిస్తామని. రూపుమాపుతామని. బెల్టుషాపులు రద్దు చేస్తామని. దశల వారీగా నిషేధం తెస్తామని. ఎన్నికల్లో హామీలు ఇస్తున్నాయి. కానీ.. అవి వట్టి మాటలే! మరి చేసేదేమిటి? ఏడాదికేడాదీ మద్యంపై ‘ఆదాయాన్ని’ పెంచుకోవటం. అందుకోసం ‘లక్ష్యాలు’ నిర్దేశించటం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాలను పట్టిపీడిస్తున్న మద్యం మహమ్మారిపై ఈ వారం ఫోకస్...
⇒ 6491 రెండు రాష్ట్రాల్లో లెసైన్సుడు మద్యం దుకాణాలు
⇒ రెండు రాష్ట్రాల్లో 125000 బెల్టుషాపులు
⇒ రెండు రాష్ట్రాల్లో 11956 కల్లు దుకాణాలు
20-25%
బానిసలుగా మారిన వారిలో అసలు ఏ పనీ చేయకుండా మద్యపానమే జీవనంగా బతికేస్తున్నవారు.
50-60%
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గ్రామీణ జనాభాలోని పురుషుల్లో... ముఖ్యంగా యువకులు, శ్రామికుల్లో మద్యానికి బానిసలుగా మారినవారు.
సాక్షి నెట్వర్క్: తెలుగు రాష్ట్రాల్లో మద్యపానం వ్యసనం విజృంభిస్తోంది. పదిహేనేళ్ల పాలబుగ్గల వయసు నుంచీ ఏడు పదుల పండుముదుసలి వయసు వరకూ.. మద్యపానానికి ‘అలవాటు’ పడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కాయకష్టం చేసి కూలి డబ్బులు సంపాదించుకునే బడుగు వర్గాల వారే.. ఈ మహమ్మారికి ఎక్కువగా బానిసలవుతున్నారని ‘సాక్షి’ రెండు రాష్ట్రాల్లో చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. నిత్యం సతమతం చేసే ఆర్థిక సమస్యలు పరిష్కారమయ్యే దారి కనిపించక.. ఆ సమస్యల వల్ల కుటుంబంలో తలెత్తే స్ఫర్థలను తట్టుకోలేక.. రోజంతా ఒళ్లు హూనమయ్యేలా చేసిన శ్రమ నుంచి ఉపశమనం పొందటానికి.. ఎంతోమంది మద్యపానాన్ని ఆశ్రయిస్తున్నారు.
క్రమంగా మత్తుకు బానిసలైపోయి శ్రమించటమనే మాటే మరచిపోతున్నారు. మద్యం ఖర్చుల కోసం మళ్లీ కుటుంబంపైనే ఆధారపడి.. చివరికి జీవచ్ఛవాలుగా మారిపోతున్నారు. వ్యవసాయ కూలీలు, గనుల్లో, క్వారీల్లో పనిచేసే కార్మికులు, రిక్షాలు, ఆటో రిక్షాలు, లారీలు నడిపే డ్రైవర్లు, క్లీనర్లు, భవన నిర్మాణ కార్మికులు, చిల్లర వ్యాపారులు.. వీరిలో దాదాపు సగం మందికి మద్యం తాగనిదే నిద్రపట్టదు. రోజుకు రూ. 200 నుంచి రూ. 300 వరకూ సంపాదిస్తే.. ఇందులో రూ. 100 నుంచి రూ. 150 తాగుడుకు ఖర్చు చేస్తున్నారు. నిత్యం కూలికి వెళ్లే అవకాశం లేని వారు సంపాదించిన కూలీ డబ్బులు ఇంటికి ఇవ్వకుండా మరుసటి రోజు కోసం ‘మందు’జాగ్రత్త చేసుకుంటున్నారు.
పల్లెలెట్లా తూలుతున్నయంటే...
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం గ్రామం జనాభా 25,754 మంది. వీరిలో 60 శాతం అంటే సుమారు 14,500 మంది చేనేత కార్మికులే. రోజువారీ చేనేత పనులు చేసుకునేవారు, వ్యవసాయ కూలీలు, బేల్దారి, వడ్రంగి పనులు చేసుకునే వారు కూడా ఉన్నారు. గ్రామంలో 4 బ్రాందీషాపులు, 10 బెల్టుషాపులు, 10 కల్లుదుకాణాలు ఉన్నాయి. నాటుసారా పరవళ్లు సరేసరి. కుటుంబాల ఆలనాపాలనా చూడాల్సిన కుటుంబ పెద్దలు, వయసులో ఉన్న యువకులు మద్యానికి బానిసలై పనులకు వెళ్లడం లేదు.
మద్యానికి డబ్బులు తక్కువగా ఉన్న వారు నాటు సారా తాగుతూ అనారోగ్యం బారిన పడుతున్నారు. మద్యానికి సరిపడా డబ్బులు లేక ఇంట్లోని వస్తువులను తాకట్టు పెట్టి మరీ మద్యం తాగుతున్నారు. గ్రామంలోని ఒక్కో వైన్ షాపు రోజుకు రూ. 55,000 నుంచి 80,000 వరకు అమ్మకాలు జరుపుతోంది. నాటుసారా, కల్లు అమ్మకాలు రోజుకు రూ. 20,000 వరకు జరుగుతున్నాయని అధికారుల అంచనా. మొత్తంగా రోజుకు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు ఈ ఒక్క గ్రామంలోనే మద్యపానానికి వెచ్చిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పంలో పరిస్థితి ఇది. నియోజకవర్గంలోని శాంతిపురం మండలం కర్లగట్ట గ్రామంలో మొత్తం 352 కుటుంబాలు ఉన్నాయి. జనాభా సువూరు 1,300 వుంది. ఇక్కడ ప్రధాన వృత్తి వ్యవసాయుం. ఉపాధి హామీ పనుల్లో 150 వుందికి పైగా కూలీలు పనిచేస్తున్నారు. గ్రావుంలో మూడు బెల్టు షాపులు ఉన్నాయి. బాటిల్‌పై ఉన్న ధరకు పాతిక రూపాయలు అదనంగా చెల్లిస్తే ఇక్కడ క్వార్టర్ బాటిళ్లు దొరుకుతాయి. మరో 13 కల్లు దుకాణాలు ఇళ్లలోనే నడుస్తున్నాయి. సగటున ప్రతిరోజూ కల్లు, వుద్యం కొనుగోలు చేసేవారి సంఖ్య 280 పైగా ఉంటుంది.
- వీరిలో రోజూ క్రవుం తప్పకుండా వుత్తు పానీయూలు కొనుగోలు చేసేవారు 260 మంది వరకు ఉంటారు. గ్రామంలో వుద్యం సేవించే వారిలో 17 ఏళ్ల పిల్లల నుంచి 65 ఏళ్ల వృద్ధుల వరకు ఉన్నారు. వుత్తులో ఉన్న ఐదుగురు కలిసి 2012 నవంబర్‌లో ఐదేళ్ల చిన్నారి లోకేష్‌ను దారుణంగా హతమార్చిన సంఘటన ఈ గ్రామంలో చోటు చేసుకుంది.
- తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా పరిగి మండలం సయ్యద్‌పల్లి గ్రామ పంచాయతీలో మొత్తం జనాభా 2,600 మంది. వ్యవసాయ కూలీ, అడ్డాకూలీలుగా పనిచేసే కార్మికులు ఎక్కువ మంది. అడ్డా కూలీలు రోజుకు రూ. 300, వ్యవసాయ కూలీలు రూ. 200, ఉపాధీ కూలీలు రూ. 150 చొప్పున సంపాదిస్తారు. గ్రామంలో 8 మద్యం దుకాణాలు, 4 గుడుంబా, నాటుసారా దుకాణాలు, 2 కల్లు దుకాణాలు ఉన్నాయి. జనాభాలో 70 శాతం మంది రోజూ కల్లుగాని, సారాగాని, మద్యంగాని తాగుతారు. సంపాదనలో సగం మద్యపానానికే ఖర్చు చేస్తారు. గత సంవత్సర కాలంగా నాటు సారా తాగి ఇద్దరు మృతి చెందారు.
- గత సంవత్సరం ఓసారి గ్రామంలో కల్లు విక్రయాలు నిలిపివేస్తే గ్రామంలో వందల మంది పిచ్చిపట్టినట్లుగా తిరిగారు. ఐదారుగురు డాక్టర్లు వైద్యం చేసేందుకు గ్రామానికి రోజూ రావాల్సివచ్చింది.
పల్లెపల్లెనా బెల్టుషాపులు...
ఆంధ్రప్రదేశ్‌లో 4,380 మద్యం దుకాణాలు ఉంటే, ఒక్కో లెసైన్సు దుకాణానికి అనుబంధంగా సగటున 20 బెల్టు షాపులు పనిచేస్తున్నట్టు ఎకై ్సజ్ అధికారులే అంచనా వేస్తున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 85,000కు పైగా బెల్టు షాపులు నడుస్తున్నట్టు లెక్క. ఇక తెలంగాణ రాష్ట్రంలో 2,111 మద్యం దుకాణాలు ఉంటే.. వాటికి అనుబంధంగా దాదాపు 40,000కు పైగా బెల్టు షాపులు నడుస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 1.25 లక్షల బెల్టు షాపులతో మారుమూల పల్లెలకు సైతం నిరంతరాయంగా మద్యం ప్రవహిస్తోంది.
విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం వెంకటరమణపేట గ్రామం జనాభా 4,000. ప్రధాన వృత్తి వ్యవసాయం. చాలా కుటుంబాలకు కూలి పనులే ఉపాధి. చుట్టు పక్కల క్వారీల్లోనూ, భవన నిర్మాణ పనుల్లోనూ పనిచేస్తున్నారు. డ్రైవర్లు, క్లీనర్లు, ఆపరేటర్లుగా పనిచేసే వారూ ఉన్నారు. మహిళలు ఇళ్ల వద్ద విస్తరాకులు తయారు చేస్తారు. ఈ గ్రామంలో నాలుగు బెల్టు షాపులు నడుస్తున్నాయి. ఇటీవల గ్రామపెద్దలు వాటికి వేలం పాట నిర్వహించారు. మూడు నెలలకు రూ. 1,40,000 ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. ఒక్కో క్వార్టర్ బాటిల్ మద్యాన్ని రూ. 20 ఎక్కువకు అమ్ముతారు. సగటున రోజూ మద్యం తాగేవారు 300 నుంచి 400 మంది వరకూ ఉంటారు. వీరిలో స్థిరమైన కూలి పనులకు వెళ్లేవారు, వ్యవసాయ కూలీలు ఎక్కువ. గ్రామంలో రూ. 30,000 నుంచి రూ. 40,000 వరకూ వ్యాపారం జరుగుతుందని అంచనా.
- నిజామాబాద్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో కిరాణా దుకాణాలు, కల్లు బట్టీల్లో బెల్ట్‌షాపులు కొనసాగుతున్నాయి. ఒక్కో బాటిల్‌కు అదనంగా రూ. 20 వరకు వస్తుండటంతో మద్యం దుకాణదారులే గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్‌షాపులు నడుపుతున్నారు. ఈ నిర్వాహకుల నుంచి గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, స్థానిక పోలీస్‌స్టేషన్, ఎక్సైజ్ అధికారులకు నెలనెలా మామూళ్లు అందుతాయి.
నాయకులే మద్యం వ్యాపారులు...
ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 90 శాతం మంది రాజకీయ నాయకులకు ప్రధాన ఆదాయ వనరు మద్యం వ్యాపారమే. ప్రత్యక్షంగా/పరోక్షంగా మద్యం వ్యాపారంతో సంబంధాలున్న రాజకీయ నేతలు చాలా మంది రాష్ట్రంలో ఉన్నారు. ముఖ్యంగా అధికార పార్టీ టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు/మంత్రులు, వారి అనుచరులు మద్యం వ్యాపారం నిర్వహిస్తున్నారు. తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీల వారు సిండికేట్‌గా ఏర్పాటై మద్యం వ్యాపారం చేస్తున్న ఘటనలు పలు జిల్లాల్లో ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లాలో టీడీపీ ప్రజాప్రతినిధులు జిల్లా మద్యం సిండికేట్‌ను తమ గుప్పిట పెట్టుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే ఒకరు గత 20 ఏళ్లుగా మద్యం వ్యాపారంలో చక్రం తిప్పుతున్నారు. నగరంలోని అన్ని మద్యం దుకాణాల్లోనూ ధరలను ఆయనే నిర్ణయిస్తారు. అధికార యంత్రాంగం మొత్తం ఆయనకు దాసోహమంటోంది. రూరల్ జిల్లాలో మద్యం సిండికేట్‌ను మరో ఎమ్మెల్యే నియంత్రిస్తున్నారు. తమ తాత ముత్తాతల నుంచి ఆయన కుటుంబం మద్యం వ్యాపారంలోనే ఉంది.
జిల్లాలోని మద్యం దుకాణాలకు ఎంత మద్యం సరఫరా చేయాలి, మద్యం ధర ఎంతుండాలి అనేవి ఆయన కుటుంబమే నిర్ణయిస్తుంది. ఇక అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు ఈ మద్యం సిండికేట్‌లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకు నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొంగ మండలం కొత్త మల్లంపేట గ్రామంలో మొత్తం 3,200 కుటుంబాలున్నాయి. ఈ గ్రామంలో రెండు బెల్టు షాపులు ఏడాదికి రూ. 80,000 అధికార పార్టీ వారికి ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాయి.
గుడుంబా, నాటు సారా పరవళ్లు...
రెండు రాష్ట్రాల్లోనూ రాజధాని నగరం హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లోనూ నాటుసారా, గుడుంబా తయారీ విచ్చలవిడిగా సాగుతోంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో నాటు సారా తయారీ, వినియోగం రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా కనిపిస్తోంది. అనధికారిక అంచనా ప్రకారం నాటుసారా విక్రయాల విలువ రెండు రాష్ట్రాల్లో కలిపి రోజుకు రూ. 10 కోట్ల పైనే ఉంటుంది. ప్రమాదకరమైన ఈ సారాకు బలవుతున్న వారి సంఖ్యా తగ్గటం లేదు. ఎక్కడైనా మరణాలు సంభవిస్తే హడావుడి చేయటం.. కాదంటే రికార్డుల కోసమో, మామూళ్ల కోసమో అప్పుడప్పుడూ దాడులు చేసి, పలువురిని అరెస్ట్ చేయటం అధికార యంత్రాంగం ‘కర్తవ్యం’గా మారిపోయింది.
ధూల్పేట్గా మారిన మంతన్‌గౌరెల్లి
ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉంటుంది రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని మంతన్‌గౌరెల్లి గ్రామం. ఇక్కడి జనాభా నాలుగు నుంచి ఐదు వేలు. అత్యధికులు గిరిజనులే. నిత్యం రెక్కాడితే గానీ డొక్కాడని పేద కుటుంబాలు. జనాభాలో 15 ఏళ్ల బాలల నుంచి వృద్ధుల వరకు దాదాపు 60 శాతం మంది నాటుసారాకు బానిసలయ్యారు. గ్రామంలో 40కి పైగా కుటుంబాల్లో నాటు సారా తయారు చేస్తారు. నిత్యం దాదాపు వెయ్యి లీటర్ల సారాయి తయారవుతుంది.
గ్రామంలో ఐదుకు పైగా మద్యం దుకాణాలున్నాయి. మద్యం ధరలు అధికంగా ఉండడం వల్ల గిరిజనులు సారా తాగడానికే మొగ్గు చూపుతున్నారు. సారాయి తాగడం వల్ల రెండేళ్లలో 30 మందికి పైగా మృతి చెందారు. మరో 300 మంది రోగాల బారిన పడగా, 20 మంది వరకు చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. గ్రామంలోని ఓ కాలనీలో 20 ఇళ్లల్లో సారాయి తయారు చేయడం, విక్రయాలు జరపడం, తాగడం వల్ల ఆ కాలనీకి ధూల్పేటగా నామకరణం చేయడం జరిగింది. ఎకై్సజ్ పోలీసుల అండదండలతోనే గ్రామంలో మద్యం, నాటు సారా తయారీ జోరుగా సాగుతోందని విమర్శలున్నాయి.
ఏజెన్సీల్లో నాటు సారా కాటు
విశాఖ జిల్లాలో మద్యం ధరలు అధికం కావడంతో ఏజెన్సీలో నాటుసారా జోరు ఎక్కువగా ఉంది. పాడేరు గ్రామంలోనూ నాటు సారా అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అటవీ ప్రాంతంలో కొండవాగుల చెంతన సారాబట్టీలను ఏర్పాటు చేసి సారా తయారు చేస్తుంటారు. మద్యం దుకాణాల్లో ఖరీదైన బ్రాండ్ల విస్కీ, బ్రాందీల్లో కల్తీ జరుగుతున్నట్లు వినియోగదారుల నుంచి ఆరోపణలు ఉన్నాయి. నాటుసారా తయారీకి ఉపయోగించే ప్రధాన ముడి సరుకు నల్లబెల్లం, అమ్మోనియా మైదాన ప్రాంతాల నుంచి మన్యానికి సరఫరా అవుతున్నాయి.
మండలంలో ప్రధానంగా జోడుమామిడి, గురుపల్లి, ఉగ్గంగొయ్యి, వంజంగి, జల్లిపల్లి, అల్లివర, సంపల, సోలముల, ముల్లుగరువు, వర్తానపల్లి, చింతలవీధి, గొండెలి తదితర 50కి పైగా గ్రామాల్లో నాటుసారా తయారీ, అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఈ నాటుసారా కాటుకు అనేక మంది బలవుతున్నప్పటికీ విషయం బయటకు పొక్కకపోవటంతో లెక్కలోకి రావటం లేదు.
జోడుమామిడి గ్రామంలో సుమారు 50 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరిలో సగం కుటుంబాలకు చెందిన యజమానులు నాటుసారా కాటుకు బలయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చిత్తూరు జిల్లాలో చిప్పారపల్లెకు చెందిన సి.పురుషోత్తంనాయుడు, చిప్పారపల్లె బీసీ కాలనీకి చెందిన గండికోట క్రిష్ణయ్య గత ఏడాది డిసెంబర్లో రెండు రోజుల వ్యవధిలో కల్తీసారా తాగి మృతి చెందారు.
విషం చిమ్ముతున్న కల్తీ కల్లు
తెలుగు రాష్ట్రాల్లో కల్లు సంప్రదాయబద్ధంగా విక్రయిస్తున్న ప్రకృతి సహజ మద్యపానీయం. ధర కూడా తక్కువ. రెండు రాష్ట్రాల్లోనూ చాలా ప్రాంతాల్లో కల్లు ఉత్పత్తి తక్కువ ఉండటంతో కృత్రిమంగా ప్రమాదకర రసాయనాలతో తయారు చేస్తున్నారు. దీనివల్ల కల్లు సేవించే వారు అనేక దుష్ర్పభావాలకు లోనవుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో కల్తీ కల్లు విక్రయాలు అధికం. ఆంధ్రప్రదేశ్‌లోనూ రాయలసీమలో అధికంగా కల్తీ కల్లు విక్రయాలు జరుగుతున్నాయి.
ఎక్సైజ్ అధికారులకు నిబంధనల ఉల్లంఘనలు తెలిసినా ఒకవైపు మామూళ్లు.. మరోవైపు సర్కారు విధించిన ‘టార్గెట్’ను అధిగమించటం కోసం చట్టం అమలు జోలికెళ్లటం లేదు. రికార్డుల కోసం నామ్‌కే వాస్తే దాడులు చేసి అరకొరగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు.
తెలుగు రాష్ట్రాలు రెండిటిలోనూ.. పొరుగు రాష్ట్రాల నుంచి పన్ను చెల్లించని (నాన్ డ్యూటీ పెయిడ్ - ఎన్డీపీ) మద్యాన్ని యథేచ్ఛగా తెచ్చి విక్రయిస్తున్నారు. ముఖ్యంగా ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే ఎన్డీపీ మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో బెల్టు షాపులు లేకుండా చేస్తామని ప్రమాణ స్వీకారం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో సంతకం చేశారు. ఇతర హామీల తరహాలోనే ఈ హామీ అమలులోనూ చిత్తశుద్ధి చూపలేదు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎక్సైజ్ మంత్రి పద్మారావుగౌడ్ జూన్ 21న సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో మద్యం బెల్టుషాపులే లేవని చెప్పటం విశేషం.
మద్యపానం వ్యసనాల నుంచి ప్రజలను బయటపడేసేందుకు.. ఆరోగ్య, వైద్య శాఖతో సంప్రదించి ప్రతి జిల్లాకు ఓ డి-అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని 2013లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యపానానికి వ్యతిరేక ప్రచారం కోసమని పౌరసంబంధాల శాఖ, ఎక్సైజ్ కమిషనర్లు, ముఖ్య కార్యదర్శి/ఆర్థికశాఖ కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు చేస్తూ 2011లో జీవో జారీ చేసింది. ఈ కమిటీలు ఏమయ్యాయో తెలియదు. ఇందుకోసం ప్రతి ఏటా రూ. 10 కోట్లకు తక్కువ కాకుండా నిధులు మాత్రం ఖర్చు అవుతున్నాయి.
కల్తీ కల్లు తయారీ విధానమిది...
క్లోరోహైడ్రేడ్, అల్ఫాజోలం, డైజోఫామ్ వంటి మత్తు పదార్థాలు, చక్కెర, నీళ్ళతో కల్తీ కల్లును తయారుచేస్తున్నారు. ఈ కల్లు తాగినవారికి నరాల బలహీనత ఏర్పడటమేగాక, పిచ్చిలేచి చనిపోతున్నారు.
ప్రాణాంతకం.. నాటు సారా!
సాధారణంగా నల్లబెల్లం, తెల్లతుమ్మ చెక్కను ఓ కడవలో వేసి నీళ్ల్లతో ఊట బెడతారు. ఊట వేసిన 7 నుంచి 10 రోజుల తర్వాత నాటు సారా కాచి తయారు చేస్తారు. ఇలా చేయడం వల్ల సారా తయారీ ఆలస్యమవుతుంది. దీనికితోడు తెల్లతుమ్మ చెక్కకు ఎక్కువగా డిమాండు ఉంది. కిలో చెక్క 50 నుంచి 80 రూపాయలకు విక్రయిస్తున్నారు. దీంతో.. బెల్లం ఊటలో పనికిరాని చొప్పులు, పగలకొట్టిన బ్యాటరీ సెల్స్ వేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మంచి కిక్ రావడానికి యూరియా వంటి ఎరువులు ఉపయోగిస్తున్నారు. దీనివల్ల రెండు రోజుల్లో సారా తయారవటంతో పాటు తక్కువ ఖర్చు ఉంటుందని తయారీదారులు చెప్తున్నారు. ఇలా తయారు చేసిన నాటు సారా తాగడం ప్రాణాంతకంగా మారుతోంది.
మద్యం తయారీ, పంపిణీ ఇలా...
మద్యం ఉత్పత్తిని ప్రభుత్వం నుంచి లెసైన్సు పొందిన డిస్టిలరీలు చేస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో 14 లెసైన్సుడు డిస్టిలరీలున్నాయి. వీటి ఉత్పాదక సామర్థ్యం 1,221.58 లక్షల ప్రూఫ్ లీటర్లు.తెలంగాణ రాష్ట్రంలో 17 డిస్ట్టిలరీలు, ఏడు బ్రూవరీల నుంచి మద్యం, బీరు ఉత్పత్తి అవుతాయి. ఏటా 1,900 లక్షల లీటర్ల ఉత్పాదక సామర్థ్యంతో 17 డిస్టిలరీలు మద్యం ఉత్పత్తి చేస్తుండగా, 5,795 లక్షల లీటర్ల సామర్థ్యంలో 7 బ్రూవరీల నుంచి బీర్లు తయారవుతున్నాయి.
మద్యపానీయాన్ని మొలాసిస్, గ్రెయిన్స్ (మొక్కజొన్న, సోయా తదితర పదార్థాలనుంచి) తయారు చేస్తారు. ఒక లీటరు ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (ఈఎన్ఏ)లో లీటరున్నర నీళ్లు కలుపుతారు. దానికి మాల్ట్ అనే పదార్థం జోడిస్తారు. దాన్ని స్టోరేజ్ ట్యాంకులో పెడతారు. వారం రోజుల పాటు మోటారు వేసి తిరగగొడతారు. వారం తర్వాత ట్యాంకులోని ద్రవంపై మీద ఉన్న పొరను తీసి మిగతా ద్రవాన్ని బాటిల్లో నింపి మూతలు బిగిస్తారు. అదే మద్యం!
ఒక లీటరు మద్యం తయారీకి సుమారు రూ. 20 నుంచి రూ. 25 వరకు ఖర్చవుతుంది. ఒక పెట్టెలో 9 లీటర్లు మద్యం ఉంటుంది. ఈ పెట్టెపై సేల్స్ ట్యాక్స్, ఎడ్యుకేషన్ సెస్, ఏపీబీసీఎల్ మార్జిన్, మార్జిన్‌పై మళ్ళీ సెస్ ఇవన్నీ కలిపి 190 శాతం పన్నులు వేస్తారు. ఇవి కాక ఎక్సైజ్ డ్యూటీ పడుతుంది. మద్యం దుకాణదారునికి ఒక బాక్సు మీద 25 శాతం గవర్నమెంటు మార్జిన్ లాభం ఉంటుంది.
ఉదాహరణకు రాయల్ స్టాగ్ బ్రాండ్‌తో విక్రయించే క్వార్టర్ బాటిల్ (ప్రామాణికం 180 ఎం.ఎల్.) మద్యం తయారీకి రూ. 15 నుంచి రూ. 20 ఖర్చు అవుతుంది. దీనిపై 190 శాతం పన్ను అంటే, రూ. 44 కలిపి సుమారు రూ. 64 అవుతుంది. దీన్ని ఏపీబీసీఎల్ మార్జిన్ కలుపుకుని రూ. 70కి దుకాణదారుడికి విక్రయిస్తుంది. దుకాణదారుడి లాభం, ఆ తర్వాత బెల్ట్‌షాపుల వారి లాభం.. ఇవన్నీ కలిపి తాగే వారి దగ్గరకు వెళ్లేసరికి ఈ క్వార్టర్ బాటిల్ ధర 100 రూపాయలకు చేరుతుంది.
వైట్నర్కు అలవాటుపడుతూ...
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ రైల్వేస్టేషన్ ప్రాంతంలో 10 నుండి 20 సంవత్సరాల బాలలు వైట్నర్ సేవిస్తూ పోలీసులకు చిక్కుతున్నారు. సారా, గుడుంబా అందుబాటులో లేకపోవడంతో అతితక్కువ ధరవున్న వైట్నర్కు అలవాటు పడి,ఆరోగ్యాలను పాడుచేసుకుంటున్నారు.
తల్లీకూతుళ్లం కష్టపడుతుంటే... ఆయన తూలుతున్నాడు!
నా భర్త ప్రసాద్ ప్రతి రోజు మద్యాన్ని తాగుతూ కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. మాకు ముగ్గురు ఆడపిల్లలు. ఈమధ్య ఒక కూతురికి వివాహం చేసి అప్పులు పాలయ్యాం. మిగిలిన ఇద్దరికి పెళ్లిళ్లు చేయాలి. కుటుంబపోషణ భారంగా మారడంతో నేను కూడా అల్లుకట్టే పనికి వెళుతుండగా ఇద్దరు ఆడపిల్లలు మగ్గం నేస్తున్నారు. రోజంతా మేము ముగ్గురం కష్టపడితే మా ఆయన మాత్రం మద్యంతాగుతూ పనిచేయడం లేదు. తాగుడు మా కుటుంబాన్ని ఛిద్రం చేసింది. అంతేగాక నాటుసారా భారీగా విక్రయిస్తుండటంతో మాలాంటి చేనేత కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది.
- గుడిమెట్ల వరలక్ష్మి, చేనేత కార్మికురాలు (ఈపూరుపాలెం, చీరాల మండలం, ప్రకాశం జిల్లా)