![సీఎం మాట తప్పారు.. - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/41436119301_625x300.jpg.webp?itok=wK4M28hR)
సీఎం మాట తప్పారు..
బెల్టు షాపులు ఉండవంటూనే విచ్చలవిడిగా ఏర్పాటు
పీసా కమిటీల విధులేమిటో తెలియని దుస్థితి
ఏపీ గిరిజన సమాఖ్య ఉపాధ్యక్షుడు దేముడు
కొయ్యూరు: టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో బెల్టు షాపులను నిషేధిస్తామని చెప్పిన చంద్రబాబునాయుడు ఇప్పుడు దానికి భిన్నంగా గ్రామానికి ఐదు వరకు బెల్టు షాపులను పెట్టుకునే విధంగా పరిస్థితిని కల్పించారని ఏపీ గిరిజన సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షుడు జి. దేముడు ఆరోపించారు. నూతన మద్యం పాలసీలో భాగంగా ప్రతీ గ్రామంలో బెల్టు షాపుల సంఖ్యను ప్రభుత్వం పెంచేస్తున్నదని విమర్శించారు.
ఆదివారం రాజేంద్రపాలెంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రామాల్లో బెల్టుషాపులను నియంత్రించాల్సిన ఎక్సైజ్ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదన్నారు. ఎక్కడైనా సారా కాస్తే వచ్చి దాడులు చేస్తున్న ఆ అధికారులు బెల్టు షాపులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బెల్టు షాపుల నిర్వహణకు ప్రభుత్వం లెసైన్స్ ఇచ్చి ఉంటే చూపాలని డిమాండ్ చేశారు. పీసా కమిటీకి సర్వఅధికారాలున్నాయని చెబుతున్న ఐటీడీఏ పీవో హరినారాయణన్ కనీసం వాటి అనుమతి లేకుండా నిర్వహిస్తున్న బెల్టు షాపులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు.అసలు పీసా కమిటీలకు విధి విధానాలు లేవన్నారు. వారి అధికారం ఏమిటో ఎవరికీ తెలియడం లేదన్నారు.