కిడ్నాప్ చేసి.. పనయ్యాక వదిలేసి..
సాక్షి, అనంతపురం : అనంతపురం ట్రాన్స్‌కో ఎస్ఈ కార్యాలయంలో శుక్రవారం టెండర్ షెడ్యూల్ దాఖలు చేయడానికి వచ్చిన కాంట్రాక్టర్ అనుచరున్ని ఓ టీడీపీ ఎమ్మెల్యే కుమారుడు కిడ్నాప్ చేయించాడు. షెడ్యూల్ దాఖలు సమయం అయిపోయే దాకా కార్లో చక్కర్లు కొట్టించి వదిలేయించాడు. కలకలం రేపిన ఈ సంఘటన వివరాలు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇలా ఉన్నాయి. జిల్లాలోని 162 విద్యుత్ సబ్స్టేషన్ల నిర్వహణకు సంబంధించి ట్రాన్స్‌కో అధికారులు మూడు వారాల క్రితం టెండర్లు పిలిచారు. ఒక్కో సబ్‌స్టేషన్‌లో నలుగురు ఆపరేటర్లు పనిచేస్తుంటారు. వీరికి నెలకు రూ.8040 జీతం చెల్లిస్తారు. జీతాల చెల్లింపుతో పాటు సబ్స్టేషన్ల నిర్వహణకు సంబంధించి టెండర్లు పిలిచారు. అయితే ఒక్కో కాంట్రాక్టర్‌కు ఎనిమిది సబ్స్టేషన్లకు మించి షెడ్యూల్ దాఖలు చేసే అవకాశం లేదు. కళ్యాణదుర్గం డివిజన్ పరిధిలో 15 సబ్స్టేషన్లు ఉండగా వాటికి తీవ్రస్థాయిలో పోటీ నెలకొంది. ఈ మేరకు కాంట్రాక్టర్లు చివరి రోజైన శుక్రవారం అనంతపురంలోని ట్రాన్స్‌కో ఎస్ఈ కార్యాలయంలో షెడ్యూళ్లు దాఖలు చేయడానికి వచ్చారు. డివిజన్ పరిధిలోని సబ్స్టేషన్లు టెండర్‌ను తమ వారికే కట్టబెట్టేందుకు జిల్లాకు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యే కుమారుడు పథకం రచించాడు. ఇందులో భాగంగా తమకు పోటీగా మరో కాంట్రాక్టర్ షెడ్యూల్ దాఖలు చేయకూడదంటూ హెచ్చరికలు కూడా జారీ చేశాడు. అయితే ఆ యువ నాయకుడి మాటలు పట్టించుకోని ఓ కాంట్రాక్టర్ టెండర్‌కు సంబంధించి షెడ్యూల్‌ను దాఖలు చేయడానికి అతని అసిస్టెంట్‌ను అనంతపురం పంపించాడు.
సరిగ్గా మధ్యాహ్నం 2.30 గంటల సమయానికి కాంట్రాక్టర్ అసిస్టెంట్ షెడ్యూల్ ఫారం చేతపట్టుకుని ట్రాన్స్‌కో ఎస్ఈ కార్యాలయం వద్దకు చేరుకున్నాడు. ఇదే సమయంలో ఆ యువ నాయకుడు తన అనుచరులతో కలసి ఇన్నోవా వాహనంలో వేగంగా వచ్చి కాంట్రాక్టర్ అసిస్టెంట్‌ను వాహనంలోకి లాగి ఎక్కించుకుని వెళ్లిపోయాడు. షెడ్యూల్ దాఖలుకు మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే డెడ్‌లైన్ కావడంతో అప్పటి వరకు కిడ్నాపర్లు అతన్ని అనంతపురం రూరల్ ప్రాంతంలో చక్కర్లు కొట్టించి సరిగ్గా సాయంత్రం 4 గంటల సమయంలో రాంనగర్ గేటు వద్ద వదిలేసి వెళ్లిపోయారు. సమయం మీరిపోవడంతో షెడ్యూల్ దాఖలు చేయలేకపోయినా కనీసం ప్రాణాలైనా దక్కించుకున్నాలే.. చాలనుకుంటూ అక్కడి నుంచి కళ్యాణదుర్గం వెళ్లిపోయాడు. పరిస్థితిని తన యజమాని అయిన కాంట్రాక్టర్‌కు వివరించాడు.
ఇదే సమయంలో ఆ యువ నాయకుడు ఆ కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసి జరిగిన విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరిస్థితి మరోలా ఉంటుందని బెదిరించాడు. దీంతో ఆ కాంట్రాక్టర్ పోలీసులకు సైతం ఫిర్యాదు చేయలేకపోయాడు. అయితే మరో కాంట్రాక్టర్ గోపాల్‌రెడ్డిని కూడా ఆ యువ నాయకుడు బెదిరించినట్లు తెలిసింది. అయితే గోపాల్‌రెడ్డి ఖాతరు చేయకుండా షెడ్యూల్ దాఖలు చేయడంతో ప్రస్తుతం ఆయనపై ఆ యువ నాయకుడు కారాలు.. మిరియాలు నూరుతున్నట్లు సమాచారం. కాగా 162 సబ్స్టేషన్ల నిర్వహణకు సంబంధించి జిల్లా నుంచి 500 షెడ్యూళ్లు దాఖలు కాగా..వాటిని రెండు రోజుల్లో పరిశీలించి ఖరారు చేయనున్నట్లు ఎస్ఈ ప్రసాద్‌రెడ్డి తెలిపారు.