అమెరికాలో సిక్కు బాలుడిపై జాతివిద్వేష వ్యాఖ్యలు
అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో ఓ సిక్కు బాలుడిని అతడి స్కూలుకు చెందిన ఇతర పిల్లలు 'ఉగ్రవాది' అంటూ జాతి విద్వేష వ్యాఖ్యలతో ఏడిపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో విస్తృతంగా ప్రచారం అవుతోంది. కళ్లజోడు పెట్టుకున్న హర్సుఖ్ సింగ్ అనే సిక్కు బాలుడు స్కూలు బస్సులో కూర్చుని ఉండగా, ఇతర విద్యార్థులు అతడి చుట్టూ చేరి అతడిపై వ్యాఖ్యలు మొదలుపెట్టారు. ఓ అమ్మాయి అయితే అతడిని 'ఉగ్రవాది' అంటూ అతడివైపు వేళ్లు చూపిస్తూ ఏడిపించింది.
దీన్ని అతడు తన సెల్‌ఫోన్‌తో వీడియో తీశాడు. వాళ్లంతా తనను జాతిపేరుతో వేధిస్తున్నారని కూడా అతడు కెమెరా ముందు చెప్పాడు. ఈ వీడియోను ఇప్పటికే 1.30 లక్షల మందికి పైగా చూశారు. తనలాంటి వాళ్లపట్ల ఇలా ప్రవర్తించొద్దని, తాను ముస్లింను కానని, తాను సిక్కునని కూడా హర్సుఖ్ సింగ్ చెప్పాడు. ఇటీవలే సీటెల్ ప్రాంతంలో ఓ హిందూ దేవాలయాన్ని కొంతమంది కూల్చేశారు. నాజీలు ఉపయోగించే స్వస్తిక్ గుర్తు, 'గెటవుట్' అంటూ ఎర్రటి స్ప్రే పెయింటుతో రాసిన అక్షరాలు అక్కడ కనిపించాయి.